Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, April 29, 2021

వాక్శీన్ వేయించుకోమన్న బాబా - వాక్సీన్ వేయించిన బాబా

Posted by tyagaraju on 7:37 AM

 




29.04.2021  గురువారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

వాక్సిన్  వేయించుకోమన్న బాబా -  వాక్సిన్ వేయించిన బాబా

ఈ రోజు నా స్వీయ అనుభవాన్ని మీ అందరితోను పంచుకొంటున్నాను.  నా అనుభవాన్ని చెప్పేముందు బాబా నానా సాహెబ్ చందోర్కర్ గారికి వాక్సిన్ వేయించుకోమన్న వృత్తాంతాన్ని వివరిస్తాను.  ---   త్యాగరాజు


నానాసాహెబ్ చందోర్కర్ బాబాను సందర్శించిన కొన్ని నెలల తరువాత  అహ్మద్ నగర్ జిల్లాలో ప్లేగువ్యాధి వ్యాపించింది.  నానాసాహెబ్ ప్రజలను ప్లేగు టికాలు వేయించుకోమని చెబుతూ ఉండేవాడు.   కాని, ప్లేగు టికాలు వేయించుకొన్న తరువాత జ్వరము తగిలి మరణిస్తారనే భయంతో ప్రజలు ముందుకు రాలేదు.  ప్రభుత్వోద్యోగులందరు ముందుగ టీకాలు వేయించుకొని దానివల్ల ఎటువంటి అపాయము లేదని చెబుతూ ప్రజలకు మార్గదర్శకులుగా ధైర్యము కలిగించాలని  జిల్లా కలెక్టరు ఆజ్ఞాపించారు. 


చందోర్కర్ అందరికీ చెప్పేవాడు కాని తనకు కూడా టీకా వేయించుకోవడానికి భయమే.  కలెక్టరు ఉత్తరువులను తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించాడు..  గడిచిన నాలుగు జన్మములనుండి నిన్ను నేనెరుగుదును అని బాబా అన్న మాటలు చందోర్కర్ కి గుర్తుకు వచ్చాయి.  బాబా ఒక్కడె తనకు మార్గదర్శి అని నిశ్చయించుకొని బాబా ఆజ్ఞ కోసం షిరిడీకి వెళ్ళాడు. 


బాబా వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించగానే “నానా, ప్లేగు టీకా వేయించుకో. నీకు జ్వరము రాదు.  ప్రాణభీతి లేదు” అని ధైర్యము చెప్పారు.  బాబా అన్న మాటలకు చందోర్కర్ ఆశ్చర్యపడ్డాడు.  తాను వచ్చిన పని తన సందేహము చెప్పడానికి ముందుగానే తనకావిధంగా ధైర్యము చెప్పిన సాయి సామాన్యమైన మహమ్మదీయ సాధువు కాడని, సకల దైవ సమర్ధతలు కలిగిన అంతర్యామి అని చందోర్కరుకు నమ్మకం కలిగింది.

సాయి ఆజ్ఞ ప్రకారం చందోర్కరు టీకా వేయించుకున్నాడు. జ్వరము రాలేదు.  మిగతా ఉద్యోగులు, ప్రజలు కూడా ఆవిధంగానే టీకాలు వేయించుకున్నారు.  క్రమముగా ప్లేగు వ్యాధి ఉపశమించింది. సాయినాధుడు ప్రత్యక్ష దైవము అని  చందోర్కరుకు  భక్తివిశ్వాసాలు కలిగాయి.



 నా స్వీయానుభవమ్ 

మేము అనగా నేను, నాభార్య మార్చి 24 వ.తారీకున కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నాము.  వేయుంచుకోవడానికి ఒక వారం రోజుల ముందు బాబాను ధ్యానంలో బాబా, వాక్సిన్ వేయించుకోమంటావా అని అడిగాను.  ఆయన “S” అక్షరం చూపించారు.  అనగా వేయించుకోమని అర్ధం.  వాక్సిన్ వేయించుకోవడానికి ఒక రోజు ముందు మరలా నాకు ఒక సందేహం వచ్చింది.  కోవాక్జిన్ షీల్డ్ వేయించుకోవాలా, లేక కోవాక్సిన్ వేయించుకోవాలా అని.  బాబాని వాక్సిన్ అని మాత్రమే అడిగాను ఎలాగా అనుకుని సరే చీటీలు వేద్దాములే అనుకున్నాను.  ఒక దానిమీద 'కోవాక్జీన్ షీల్డ్ వేయించుకో' అని, మరొక దానిమీద ,కోవాక్సిన్ వేయించుకో, అని రాసి చీటీలు మడిచి బాబా విగ్రహం ముందు వేసాను.  బాబా పాదాలమీద పడిన చీటీని తీసాను.  అది కోవాక్సిన్ వేసుకో అని రాసిన చీటీ.  ఇక సంతోషంగా కొవాక్సిన్ వేయించుకున్నాము.  నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. 

ఇక రెండవ డోసు 26.04.2021 న వేయించుకున్నాము. ముందు రోజు బాబాను ప్రార్ధించుకున్నాను.  బాబా రేపు వాక్సిన్ వేయించుకోవడానికి వెడుతున్నాము.  జనాలు ఎవరూ లేకుండా ఖాళీగా ఉండేలాగా చూడు అని అనుకున్నాను.  ఇదంతా నా స్వార్ధమేమో.  మరునాడు కడుపునిండా ఫలహారం చేసిన తరువత ఉదయం 9 గంటలకి మా పెద్ద అల్లుడుగారు మమ్మల్ని కారులో ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.  అబ్బో అక్కడికి వెళ్లాక అప్పటికే చాలామంది వరుసలో నించుని ఉన్నారు.  మేము ఇద్దరం ఎక్కడో చివరలో నించున్నాము.  మాముందు అప్పటికే దాదాపు 150 , 200 మంది పైగానే ఉండి ఉంటారు.  అలాగా వరుసలో దాదాపు మూడు గంటల సేపు నుంచునే ఉన్నాము.  9.15 దాటిన తరువాత ఆస్పత్రి ప్రవేశ ద్వారం దగ్గర గలాటా.  లోపలికి ఇంకా ఎందుకని పంపించరని.  వాక్సిన్ రెండవ డోసు వారికి మాత్రమే అని కాసేపు మొదటి డోసు వాళ్లకి లేదని కాసేపు.  ఇలాగా గొడవ జరుగుతూ ఉండటం వల్ల అక్కడున్నవారిలో సహనం నశించడంతో కొట్టే పరిస్థితి రావడంతో రక్షకభటులను పిలవవలసి వచ్చింది.  వారు వచ్చి కాస్త గొడవ సద్దుబాటు చేసిన తరువాత మెల్లగా కొంతకొంత మందిని లోపలికి పంపించే ఏర్పాటు చేసారు.  మెల్లమెల్లగా అందరూ కదులుతూ ఉండటం మరలా ఒక ఇరవై నిమిషాలు ఆగడం ఈవిధంగా దాదాపు మూడు గంటలసేపు నిలబడే ఉన్నాము. పోనీ మరుసటి రోజు వద్దామా అనుకున్నాము గాని అప్పుడుకూడా ఇలాగే ఉంటే అంతా శ్రమే అనుకున్నాము. ఈ లోగా మా అల్లుడుగారు అక్కడ ఉన్న సెక్యూరిటీవారికి మాగురించి చెప్పి పెద్దవారు ఉన్నారు కాస్త లోపలికి పంపించండి అన్నా కూడా కనికరం చూపలేదు.  ఇంతలో ఒకాయన వచ్చి, మీరు సీనియర్ సిటిజెన్స్ అని చెప్పండి, లోపలికి పంపిస్తారని చెప్పగా నేను ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళి, మేము సీనియర్ సిటిజెన్స్ అని అనగానే ప్రక్కనున్న వ్యక్తి ఇక్కడ నుంచున్నవారందరూ సీనియర్ సిటిజన్సే అని అనడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను.  ఇంతలో కొద్ది నిమిషాలలోనే మరొక వ్యక్తి వచ్చి మీరు 70+ అని చెప్పండి అన్నాడు.  వెంటనే నేను మీరు కూడా నాకూడా ఉండండి, అని ప్రవేశద్వారం వద్దకు నేను, నా భార్య వెళ్లాము.  అక్కడేఉన్న ఆస్పత్రికి సంబంధించిన వ్యక్తితో మేము 70+ అని చెప్పాము. (మాకు అంత వయస్సు లేనప్పటికి) అతను కాస్త మొహమాట పడి అందరూ ఇలాగే చెబుతున్నారు అని కాసేపు ఆలోచించి సరే వెళ్లండి అని లోపలికి పంపించాడు.  లోపలికి వెళ్ళాక అబ్బో అక్కడ రెండు వరుసలు ఉన్నాయి.  ఒకటి రెజిస్ట్రేషన్ కి ఒక వరుస మరొకటి రిజిస్ట్రేషన్ అయిన తరువాత బిల్లు కట్టడానికి మరొక వరుస.  ఎలాగయితేనే 12.15 కి లోపలికి వెళ్లినవాళ్లము 2.00 గంటలకి వాక్సిన్ వేయించుకుని గం.2.20 కి బయటకు వచ్చాము.  బాబాయే ఆవ్యక్తి ద్వారా 70+ అని చెప్పండి అని చెప్పించి ఉంటారు. ఆవ్యక్తి కూడా తనవారిద్దరిని వాక్సిన్ కోసం తీసుకువచ్చాడు.  అక్కడ వరుసలో ఇంకా చాలామంది నిలబడే ఉన్నారు.  వయసుపైబడ్డవారు కూడా ఉన్నారు. అటువంటిది అతను నా వద్దకు వచ్చి ఆవిధంగా చెప్పి లోపలికి వెళ్ళేలాగా అవకాశం కల్పించాడు.  లేనట్లయితే ఆరోజుకి అవుతుందో లేదో కూడా అనుమానమే. బాబా ఈ లోగా మా సహనాన్ని పరీక్షించి ఉంటారనిపించింది.  బాబా దయవల్ల కాస్త ఒళ్ళు నొప్పులు తప్ప మరింకేమీ సైడ్ ఎఫేక్ట్స్ లేవు. అంతా బాబా దయ.  ఓమ్ సాయిరామ్.


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List