19.04.2024 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
.
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411, 8143626744
సాయి అనుగ్రహం అపారమ్ – 4 వ.భాగమ్
ఈ సమయంలోనే ప్రముఖ శిల్పి శ్రీ తాలిం
గారు చెక్కిన శ్రీ సాయిబాబా విగ్రహాన్ని అంబర్
నాధ్ లో వలవాల్కర్ గారిగృహం మాతృచాయ లో ఉన్న
సాయి మందిరంలో ప్రతిష్టించారు. ఆ విగ్రహం షిరిడీలో
ఉన్న శ్రీ సాయిబాబా విగ్రహానికి ప్రతిరూపం.
శ్రీ తాలిం గారు ఇటువంటి విగ్రహాలను రెండు మాత్రమే చెక్కారు. ఈ మందిరంలో దేవ్ బాబా , భావు మహరాజ్ ఇద్దరూ ప్రతిరోజూ
సాయిబాబా విగ్రహానికి పూజలు చేస్తూ ఉండేవారు.
షిరిడిలోని సాయిబాబా మందిరంలో పుణ్యతిధులలో ఏవిధంగానయితే పూజలు జరుగుతాయో అదేవిధంగా
ఇక్కడ కూడా జరుపుతూ ఉండేవారు. అంబర్ నాధ్ లోని
‘మాతృచాయ” లో ఉన్న ఈ ప్రదేశాన్ని ‘సాయి సెక్షన్’ గా పేరుపెట్టారు.
కాలం గడుస్తున్న కొద్దీ సీతాబాయి ఆరోగ్యంలో
చాలా సమస్యలు మొదలయ్యాయి. 1945లో ఆమె ఆరోగ్యం
బాగా దిగజారింది. ఈ సమయంలోనే దేవ్ బాబా షిరిడీలో
సాయి చరిత్ర పారాయణ చేయడంలో నిమగ్నమయి ఉన్నాడు.
దేవ్ బాబాని చూడాలని సీతాబాయి ఎంతగానో తహతహలాడింది. సీతాబాయి ఆరోగ్య పరిస్థితి గురించి దేవ్ బాబాకి
తంతి పంపించారు. అప్పట్లో బొంబాయి నుంచి షిరిడీ
వెళ్ళడానికి ఎప్పుడు పడితే అప్పుడు తగిన ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. రెండింటి మధ్య గల దూరాన్ని తలచుకుంటే సమయానికి తాను
బొంబాయి చేరుకోగలనా లేదా అని దేవ్ బాబా చాలా ఆందోళన పడ్డాడు. అదే క్షణంలో శ్రీ సాయిబాబా దేవ్ బాబాకు దర్శనమిచ్చి
ఎటువంటి ఆందోళన పడవద్దని అన్నారు. తాను ఒక
అశ్వాన్ని తెచ్చాననీ, దానిమీద స్వారీ చేసుకుంటు ఇద్దరం సమయానికే బాంద్రా వెళ్ళి సీతాబాయిని
కలవచ్చని అన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నచోటునుండి
క్షణంలో బొంబాయి వెళ్ళి ఇద్దరూ సీతాబాయిని
కలుసుకున్నారు. దేవ్ బాబా తన తల్లి చెవిలో
గురుమంత్రాన్ని చెప్పి నిరంతరం దానినే జపిస్తూ ఉండమని చెప్పారు. తన తల్లిని అనుగ్రహించిన తరువాత శ్రీ సాయిబాబా,
దేవ్ బాబా తిరిగి షిరిడీకి వచ్చారు. ఆ తరువాత
దేవ్ బాబా సాయి సత్ చరిత్ర పారాయణను కొనసాగించి పూర్తి చేసారు.
సీతాబాయి దైవభక్తికి కట్టుబడి ఉంది, ఎల్లప్పుడూ
భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ జీవితమంతా భజనలు, కీర్తనలు వింటూ ఉన్నప్పటికీ జీవిత
చరమాంకంలో ఆధ్యాత్మిక గురువుయొక్క ఉపదేశం లభించడం ఆమె చేసుకున్న అదృష్టం.
శిష్యునికి ఆధ్యాత్మిక గురువు లభించడం
వల్ల శిష్యునికి జీవితంలో కావలసిన మహోన్నత లక్ష్యమయినటువంటి మోక్షం చాలా సులభంగా లభిస్తుంది.
శ్రీ సాయి సత్ చరిత్రలో సద్గురువుయొక్క
సమర్ధత గురించి ఈవిధంగా వివరింపబడింది.
మాతృమూర్తి నవమాసాలు తన బిడ్దని ఎంతో
జాగ్రత్తగా ప్రేమగా మోసిన తరువాత, బిడ్డ జన్మించే సమయం వచ్చేసరికి, శిశువును ఈ బాహ్యప్రపంచంలో
బయట పడేలాగ ముందుకు నెట్టుతుంది. సద్గురువయితే
తన శిష్యుడిని ప్రాపంచిక విషయాలనుండి బయటకు లాగి అందర్ముఖుని చేసి ఆత్మతో అనుసంధానం
కలిగిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణించిన శిష్యుడు
చివరికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment