21.04.2024 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411, 8143626744
సాయి అనుగ్రహం అపారమ్ – 5 వ.భాగమ్
చివరి శ్వాస వరకు సీతాబాయి గురుమంత్రాన్ని
విపరీతంగా జపించింది. రంగపంచమి పండుగ రోజున
ఆమె కాలం చేసింది. శాస్త్రాలలో చెప్పబడినట్లుగా
ఆమెకు ఉత్తమ గతి తప్పక లభించే ఉంటుంది.
‘మానవుడు అంత్య సమయంలో దేనినయితే భావిస్తూ
మరణిస్తాడో మరుసటి జన్మలో అదే జన్మ లభిస్తుంది’
--- శ్రీ సాయి సత్ చరిత్ర.
శ్రీ భావూ మహరాజ్ కి జీవితంలో ఎన్నో కష్టాలు,
ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ, అన్ని ఒడిదుడుకులను తట్టుకుంటూ ఎల్లప్పుడూ సాధువుల సాంగత్యంలో
ఉంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండేవారు.
ఆయన బాగా గ్రహించుకున్న జీవిత సత్యం
….
“సుఖదుఃఖాలు రెండూ ఒకదాని వెంట మరొకటి
రావడం అనివార్యం. వాటిని ఆమోదించినా లేక వాటినుండి
పారిపోదామని చూసినా జరగవలసినవి జరగక మానవు.
ఈ అనుబంధాలు,భ్రాంతి, భయాలనుండి మనలను బయట పడవేయగలిగినది మహాత్ముల సాంగత్యం
ఒక్కటే. వారి సాంగత్యం యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది.”
కాలం గడిచే కొద్దీ సద్గురు కృప, నిరంతర
సాధన వల్ల పరమపూజ్య భావూ మహరాజ్ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తల్లి తాబేలు తన పిల్లలు దగ్గరగా ఉన్నా దూరంగా నది
ఆవలి ఒడ్డున ఉన్నా కేవలం తన చూపుతోనే తన పిల్లలను (కూర్మ దృష్టి) పొదిగినట్లుగా దేవ్
బాబా ఎల్లప్పుడూ ఆయన ఆధ్యాత్మికాభివృధ్ధిని పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
భావూ మహరాజ్ తన శిష్యులకి కేవలం సత్పురుషుల
జీవిత చరిత్రలను, గొప్ప గొప్పవారు, జ్ణానులు వ్రాసిన పుస్తకాలను చదవడమే కాదు, వాటిని
బాగా ఏకాగ్రతతో చదివి జీర్ణించుకోవాలని జీవితాలను సఫలం చేసుకోవాలని ఎప్పుడూ చెబుతూ
ఉండేవారు. ఆధ్యాత్మికంగా నడిచే దారిలో అవి
మార్గాన్ని చూపుతాయని చెప్పారు. మహాత్ముల చరిత్రలు
చదవడం వల్ల, మన ఆలోచనలు పవిత్రమవుతాయి. అజ్ణానమనే
చీకటి తెరలు తొలగిపోతాయి. భక్తునియొక్క భావోద్వేగ,
మేధోపరమయిన స్థితి శాశ్వతమయిన సత్యంతో ప్రకాశిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మోసపూరితమయిన అడ్డంకులులాంటి
అవరోధాలు ఎదురయి భక్తులను ఆధ్యాత్మిక పురోగతినుండి దూరం చేస్తుంది. అందువల్ల భగవంతుని చైతన్యంతో ఒక్కటయిన మహాత్ముల
చరిత్రలను అధ్యయనం చేసినట్లయితే అటువంటి ప్రభావం భక్తుల మీద పడకుండా హెచ్చరిస్తుంది.
భావు మహరాజ్ తన శిష్యులకి ఎల్లపుడూ
ముఖ్యంగా శ్రీ సాయి సత్ చరిత్రను చదవమని, అవసరమయితే ఇతర మహాత్ముల చరిత్రలను కూడా చదవమని
చెబుతూ ఉండేవారు. దానికి కారణం అత్యున్నతమయిన
ఆధ్యాత్మిక మార్గంలో మహాత్ములు అందరూ ఒక్కటే.
వారిలో ఎటువంటి ద్వైత భావం లేదు వారంతా
ఒకే జ్ణాన మార్గంలో పయనిస్తున్నవారు. --- శ్రీ
సాయి సత్ చరిత్ర.
భావు మహరాజ్ గారి జీవిత చరిత్ర గురించి
ఈ వ్యాసంలో తెలియచేయాలని కాదు. శ్రీ సాయిబాబాకు
సంబంధించి జరిగిన అధ్భుత సంఘటనలు గురించి మాత్రమే నేను వివరిస్తున్నాను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment