18.04.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –24 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ప్ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id : tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
సాయిబాబా వారి ఆగ్రహమ్
బాబా దయవల్ల దుబాయి నుంచి
క్షేమంగా హైదరాబాదుకు చేరుకున్నాము. ఈ రోజునుండి
యధావిధిగా శ్రీసాయిలీలా తరంగిణిని ప్రచురిస్తూ ఉంటాను.
శ్రీ సాయి సత్ చరిత్రలో
బాబా అన్న మాటలు “ నేనెవరినైనా కోప్పడ్డట్లు నాకు గుర్తు లేదు. తల్లి బిడ్డను తరిమేస్తే, సముద్రం నదిని వెళ్ళగొట్టితే,
నేను మిమ్మల్ని నిరాకరిస్తాను. నేను మీ హితాన్నే
కోరుతాను. నేను భక్తులకు అంకితుణ్ణి, వారి
వెన్నంటే ఉంటాను. నేనెప్పుడూ ప్రేమనే కోరుతాను. పిలిచిన వెంటనే పలుకుతానని” చెప్పారు.
మరి దయార్ద్ర హృదయులైన
సాయిబాబాకు తన అంకిత భక్తుడైన శ్రీ భారం ఉమామహేశ్వరరావుగారిపై ఒకానొక సందర్భంలో ఆగ్రహం
కలిగింది. అంతే కాదు ఆయనకు శిక్ష కూడా వేశారు.
ఎందుకనో ఇప్పుడు తెలుసుకుందాము.
నాభర్తపై బాబాగారికి
ఎంతో అనురాగం, ఆప్యాయత, దీవెనలు ఉన్నాయి. అయినాగాని
ఒకానొక సందర్భంలో బాబావారి ఆగ్రహాన్ని కూడా చవి చూశారు.
1990 వ.సంవత్సరం ఏప్రిల్
నెలలో నా భర్త ఒక పాపం చేశారు. దానివల్ల బాబా
ఆయనకు శిక్ష విధించారు. హైదరాబాదులో ఉన్న మాయింటికి
మంచి అందమయిన పూలతోట ఉంది. ఆ తోటలో రంగురంగుల
పూలమొక్కలు ఉన్నాయి. తోటలో పచ్చటి తివాచీ పరిచినట్లుగా పచ్చగడ్డి (లాన్) ఉంది. లాన్ లో ఒక మూలగా చీమలు పుట్ట పెట్టుకున్నాయి.
మావారు ఆ చీమలను తోలేయడానికి ఆ పుట్ట మీద నీటిని
పోస్తూ ఉండేవారు. కాని ఆ చీమలు మళ్ళీ మళ్ళీ
వచ్చి పుట్టను ఇంకా ఇంకా పెద్దదిగా కట్టుకోసాగాయి.
ఆఖరికి మావారికి విసుగు వచ్చి ఆ చీమల పుట్టమీద వాటర్
ట్యూబ్ తో చాలాసేపు నీటిని పోశారు.
ఆ రోజు రాత్రి ధ్యానంలో
సాయిబాబా నా భర్తకు దర్శనమిచ్చి, “ఆ చీమల పుట్టమీద ఆవిధంగా నీటిని పోయడంలో నీ ఉద్దేశ్యమేమిటి? వాటికి హాని తలపెడదామనా? కాని అవి చావలేదు. అవి గడ్డిలో పాకుకుంటూ వెళ్ళిపోయాయి. నువ్వు చేసిన పని చాలా తప్పు. అన్ని జీవులలోను నేనున్నాననే విషయం నీకు తెలీదా? నువ్వు చేసిన ఈ పాపపు పనికి శిక్షగా నువ్వు రెండురోజులపాటు
ఆకలితో మాడు” అని శిక్ష విధించారు. బాబా విధించిన
శిక్ష ప్రకారం మావారు రెండురోజులు ఆఖరికి పళ్ళు కూడా తీసుకోకుండా ఆకలితో మాడారు. ముసలితనంలో కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా రెండురోజులు
ఉన్నా గాని ఆయనకి ఎటువంటి నీరసం రాలేదు. ఆ
విధంగా ఉండగలిగారంటే అదంతా బాబా అనుగ్రహమే.
బాబా తన భక్తులను రక్షించడమే కాదు తప్పు చేస్తే శిక్షిస్తారనడానికి కూడా ఇదే ఉదాహరణ.
***
తల్లి ఏనాడయినా తన పిల్లలను
తరిమివేస్తుందా, పిల్లలపై కోపగిస్తుందా అన్న బాబా మరి తన భక్తునిపై ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కారణమేమిటి?
భారం ఉమామహేశ్వర రావుగారు సాయి తత్వాన్ని సమగ్రంగా అర్ధంచేసుకున్న వ్యక్తి. ఆయనకు బాబా పిలిస్తే వెంటనే ఓయని పలుకుతారు. అటువంటిది సర్వ జీవులలోనూ బాబా నివసిస్తున్నారనే
విషయాన్ని మర్చిపోయారు. అజ్ఞానం వల్ల చీమలను
తరిమివేయడానికి అవి కట్టుకున్న పుట్టను కూడా నీటిని పోసి చెదిరిపోయేటట్లు చేశారు. తను అన్ని జీవరాసులలోను ఉన్నానని గుర్తు చేయడానికి
బాబా ఆయనకు శిక్ష విధించారు. మనం కూడా శ్రీసాయి
సత్ చరిత్రలో బాబా చెప్పిన విషయాలను ఎంత వరకు ఆచరిస్తున్నామో మనకు మనమే ఆత్మ విమర్శ
చేసుకోవాలి. ఆచరణలో పెడితే కష్టమేమీ కాదు. కష్టమైనవేమి ఆయన తన భక్తులకి చెప్పలేదు. ఆచరణలో పెట్టడం కష్టమని మనమే అనుకుంటాము.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment