27.07.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుండి సాయిబంధువులకు, బాబావారు శ్రీభారమ్ ఉమామహేశ్వరరావు గారికి ప్రసాదించిన సందేశములను ప్రచురిస్తున్నాను. విచిత్రమయిన విషయమేమంటే బాబా శ్రీరావుగారికి ఆంగ్లంలో ప్రప్రధమంగా సందేశం యిచ్చిన తారీకు…28.05.1987. సరిగ్గ
ఈ రోజుకు 30 సంవత్సరములు. బాబా సందేశాలను చదవనివారి కోసం బాబా తన భక్తులకు సందేశాలను అందిస్తున్న తారీకు
27.05.2017. ఇది బాబా ఏర్పాటు చేసిన తారీకుగానే నేను భావిస్తున్నాను. కారణం నేను ఈ సందేశాలను ఈ రోజునే అందిద్దామని ముందుగా ఎటువంటి ప్రణాళిక వేసుకోలేదు. రెండురోజుల క్రితమే శ్రీ సాయితత్వ సందేశములు పుస్తకం లోని సందేశాలను తయారు చేస్తూ శ్రీ భారమ్ ఉమామహేశ్వరరావుగారు వ్రాసిన తన తొలిపలుకులలో తారీకు నిన్నమాత్రమే గమనించాను. ముందుగా
ప్రణాళిక వేసుకుని ఉంటే ‘ఈ నాటి సమాజంలో మానవత్వమ్’ ఈ రోజున పూర్తి చేసేవాడిని.
శ్రీ సాయితత్త్వ సందేశములు - 1 వ.భాగమ్
(vaice of Sai Baba)
సాయి బంధువులందరికి బాబావారి శుభాశీస్సులు. ఇంతకు
ముందు మనమందరం శ్రీసాయి లీలా తరంగిణి ద్వారా శ్రీసాయిబాబా వారు శ్రీ భారం ఉమా మహేశ్వరరావు గారికి బాబా వారు అందించిన అనుభవాలను అనుభూతులను చదివి చాలా ఆనందించాము. వాటిలో బాబా వారు శ్రీ రావుగారికి ప్రతిరోజు సందేశాలను కూడా అందించారని తెలుసుకున్నాము. బాబా వారు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ సందేశాలన్నిటినీ పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ సందేశాల తెలుగు పుస్తకం సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారి ద్వారా నాకు లభించింది. ఈ రోజు నుంచి వాటిలోని ముఖ్యమయిన సందేశాలను అందిస్తున్నాను. ఆ సందేశాలను కూడా చదివి బాబా అనుగ్రహానికి మనమందరం పాత్రులమవుదాము.
శ్రీ భారం ఉమా మహేశ్వరరావుగారు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారికి కాపీ రైట్స్ ఏనాడో యిచ్చారు. సాయి బానిస శ్రీరావాడ గోపాలరావుగారు మరల నాకు కాపీ రైట్స్ యిచ్చారు. మీకందరికి సాయి సందేశాలను యిచ్చె భాగ్యం బాబావారు నాకు ఈవిధంగా కలిగించినందుకు బాబావారికి నా సాష్టాంగ నమస్కారాలను తెలియ చేసుకుంటున్నాను. అదేవిధంగా సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారికి కూడా నా ధన్యావాదాలను తెలుపుకొంటున్నాను.
శ్రీరావు గారు ప్రచురించిన పుస్తకంలో ఆయన వ్రాసిన తొలిపలుకులలోని ముఖ్యమైన మాటలు :
1987 వ.సం. మే నెల 28 వ.తేదీన షిరిడీ ద్వారకామాయిలో శ్రీసాయినాధుడు దర్శనమిచ్చి ఆంగ్లములో సందేశమును ప్రధమంగా యిచ్చారు. ఆనాటినుంచి తెలుగు భాషలో వారికి అనుగ్రహం కలిగినప్పుడు సందేశాలని యిస్తూ వచ్చారు. శ్రీసాయి తత్త్వబోధలను భక్తులకందచేసి, బాబా కృపకు
పాత్రులగునట్లు చేయుటయే ఈగ్రంధ ముద్రణకు ముఖ్యోద్దేశ్యము. 1995 సం.లో 161 సందేశములు ముద్రించబడ్డాయి. 1992 సం. నుంచి 1995 మార్చి నెలవరకు వచ్చిన సందేశాలు ఈ గ్రంధంలో ముద్రింపబడ్డాయి.
శ్రీబాపట్ల వేంకట పార్ధ సారధి గారు ఈ పుస్తకం గురించి ప్రశంసించిన దానిలోని రెండు పేరాలుః
మనస్సు నిశ్చల స్థితిలో ఉంచి విశ్వసించిన శ్రీసాయీశ్వరుని పరం చేయుటయే సమాధి. ఈస్థితిలో మన మనస్సులో ఏభావం లగ్నమగుతుందో ఆ స్థితిలో బాబా మనతో సంభాషిస్తాడు. అడిగిన
వాటికే కాక ఆలోచనలకు కూడా సమాధానాలను అందిస్తాడు – వివరిస్తాడు – వినిపిస్తాడు – లిఖిత పరిపిస్తాడు.
పూజ్యశ్రీ భారం ఉమామహేశ్వరరావుగార్కి, అట్టి అనుగ్రహాన్ని ప్రసాదించి యీ “తత్త్వ సందేశాన్ని” ఎన్నో ప్రకరణములుగ యే రోజుకారోజు యే గంటకాగంట వినిపించి వారి గళంనుండి వెలువరించి యీ గ్రంధాన్ని మనకందిపంప చేసిన శ్రీసాయి భగవానునికి ఉమామహేశ్వరరావుగారిపై
యెంత మక్కువో వారెట్టి ఉత్తమ భక్తులో వేరే విశదీకరించ పనిలేదు.
ఇందులో యే అంశము తీసుకొనినా అది భగవానునికి భక్తునికి మధ్య నడిచే సంభాషణముగ పవిత్రతను సంతరించుకొనినది.
శ్రీసాయి తత్త్వ సందేశములు – 1వ.భాగమ్
1 01.02.1992
ఉదయం 6.15 గంటలకు తిరుమల దేవస్థానంవారి కాటేజీ నెం.173 లో శ్రీసాయిబాబా వారు ధ్యానములో యిచ్చిన సందేశము.
నిత్యానిత్య విచారము పోయినప్పుడే ఈ ప్రపంచ స్ఫురణ ఉండక అంతఃకరణము బ్రహ్మములో లయమగును. మీలో ఉన్న మానవత్వము సమసిపోయినప్పుడే దివ్యత్వము ప్రాప్తించును. అదే విధముగా జీవత్వము నశించినప్పుడే అహంకారము నశించును. నీ మనస్సు శుధ్ధమైనచో నేను ఎవరో, నా అవతారము ఏమిటో తెలుసుకొనగలవు. నేను సర్వదైవ సంభూతుడను. అన్ని
దైవములు నేనే. మీరు ఒక దైవమును ధ్యానించుట వలన యితర దైవముల యందు దైవ భావము కలిగి యుండుట లేదు. అది సరి కాదు.
బుధ్ధి గ్రాహ్య మతేంద్రియం” ॥
మీ మనస్సు, బుద్ది మలినమై యున్నంత వరకు నన్ను కాని నాదివ్య రూపము కాని చూడలేరు. మీ హృదయములో అవిద్య రాజ్యము చేయుచున్నంత వరకు, మీ మనోబుధ్ధులు ఎప్పటికిని శుధ్ధము కానేరవు. అసమాన సత్ సంపన్న గుణములు అలవరచుకొన్న పరమ పధము పొందగలరు. లోకచింత యందు ఆసక్తి వదలుకొని భావనా భక్తితో నన్ను కొలవండి.
‘అవశ్య మను భోక్తవ్యం
కృంతం కర్మ శుభా శుభం’
నా జీవిత చరిత్ర సర్వ వేదాంత సారామృతము, ఉపదేశామృతము, నీతి కధా రత్నముల పుట్ట. నా బోధలలోని మూలత్వమును, వాటిలోని అంతరార్ధమును గ్రహించుటకు మూల గ్రంధములను సేకరించి వాటిలోని సారాంశము తెలుసుకొని, సమగ్రముగా కూర్చి సామాన్య ప్రజలకు తెలియునట్లుగా గ్రంధ రూపములో వెలుగులోనికి తీసుకొని వచ్చు బాధ్యత నీకు అప్పగించుచున్నాను. విషయ విన్యాసముల యందు జాగరూకత వహించిన ఈ గ్రంధము జగత్ వ్యాపకమగును. ఇందు వేదాంత శాస్త్ర ప్రమాణములు, నా స్వవచనములు కూడా చేకూర్చు. మానవాళి
సంరక్షమైన పరమార్ధము వివిధ వేదాంత శాస్త్రములలో వేరు వేరు పదములతో వ్యక్తము చేసియున్నారు. ఈ గ్రంధములో అట్లు ఉండరాదు. నీవు చిత్త శుధ్దితో ప్రయత్నించిన ఈ గ్రంధ ప్రచురణ సాధ్యమే.
ఏ నిర్దిష్టమైన భావన లేకుండా స్వచ్చమైన హృదయముతో అన్వేషించిన ఈ గ్రంధ ముద్రణకు దాత తనంతట తానే ముందుకు వచ్చును. అట్టివారికి నాకృప ఎల్లవేళలు ఉండుటయే గాక నా అనుగ్రహము సదా వారిపై వీచును.
ఈగ్రంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యము నా వేదాంతము, నా తత్త్వము, నాబోధలు, నా ఉపదేశములు, వాటిలోని అంతరార్ధము వాటి భావన సర్వ మానవకోటికి తెలియ చేయునట్లుగా ఉండవలయును. ఇదే నీ లక్ష్యమని ముందుకు పోసాగు. నా రక్షణ సర్వదా ఉండును.
2. 04.02.1992 ఉదయం 4.30 గంటలకు గుంటూరులో శ్రీసాయిబాబా వారు యిచ్చిన సందేశము.
ఎవరైతే సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పించి ఫలాపేక్ష లేక చేయుదురో అట్టివారు పాపముచే అంటబడరు. కర్మ చెడ్డదికాదు. మీ దృష్టిని పవిత్రము చేసుకొన్న మీరు చేయు కర్మ మహా యజ్ఞమై ప్రకాశించుచూ, మీ భావములు శుధ్ధమై మీరు చేయు ప్రతి కార్యము శ్రేయస్కరమై యుండును. మీ కర్మలద్వారా ఆ పరమాత్మను పూజించిన ముక్తిని పొందగలరు. దైవార్పణ చేసి కార్యము చేసిన కర్మ కర్మగా నుండక కర్మ యోగముగా మారును. ప్రవృత్తియందున్న మనస్సును నివృత్తియందుంచుకొనండి. నిష్కామ పూర్వకముగా కర్మనే ఆచరించండి. దైవార్పణముగా భక్తి పూర్వకముగా చేయు కర్మ సంసారబంధము నుండి విముక్తిని గలుగచేయును. నియమితమైన కర్మనే చేయండి. కర్మచేయకుండా యుండుటకంటే చేయుటయే మంచిదని గ్రహించండి. కర్మ చేయకపోవుట వలన మీకు దేహ యాత్ర సిధ్ధింపదు.
అనంతమునకు ఏది జోడించిననను తుదకు అనంతమే మిగులును. దైవము
అనంతము. జ్ఞానము అనంతము. దైవ దృష్టి కలిగి, దైవార్పణ బుధ్ధితో ఏ కార్యము చేసినప్పటికి అది కర్మ బంధము కాదని తెలుసుకొనండి. కాబట్టి కర్మ గొప్పది కాదు. కర్మచేయు
విధానము గొప్పది. ఈశ్వరార్పణ బుధ్ధితో చేసిన కర్మ యందలి బంధ జనకత్వము తొలగిపోవును.
3. 07.02.1992 ఉదయము 7.30 గంటలకు గుంటూరులో కృష్ణకిషోర్ యింటి పూజామందిరములో శ్రీసాయి యిచ్చిన సందేశము.
నీవు తలపెట్టిన గ్రంధ రచన ప్రారంభమునకు ముందు ఈ స్వామిని (అవధూత పూజ్యశ్రీ రామిరెడ్డి తాతగారిని చూపించినారు) దర్శించిన, వారు నీకు ఆశీస్సులు అందించుటయే గాక ఆధ్యాత్మిక ప్రగతికి దారి చూపెదరు.
దీనికి ముందు యాబది వేల పర్యాయములు గాయత్రి మంత్రము పఠించి, నాగరాజు పుట్టలో క్షీరము,
నాకు పదకొండు నారికేళములు సమర్పించి ఈగ్రంధ రచన పారంభించు. అప్పుడే ఈ గ్రంధము జయప్రదమై జనాదరణ పొందును.
దీనికి ముందు యాబది వేల పర్యాయములు గాయత్రి మంత్రము పఠించి, నాగరాజు పుట్టలో క్షీరము,
నాకు పదకొండు నారికేళములు సమర్పించి ఈగ్రంధ రచన పారంభించు. అప్పుడే ఈ గ్రంధము జయప్రదమై జనాదరణ పొందును.
వెంటనే ఆరంభించుటకు ప్రయత్నము చేయి. వాటిమూల గ్రంధములను నేనే తెలిపెదను. ఆ స్వామి (శ్రీరామిరెడ్డి తాత) దర్శనము చేసుకొని వారి ఆశీస్సులు పొందు.
ఈ గ్రంధ రచనయందు ఎన్ని అడ్డంకులు వచ్చినను వాటికి విలువ యివ్వవద్దు. విమర్శనలకు తావు లేదు. నీలో వచ్చిన భావనలన్నియూ నావే అని గ్రహించు.
ఈగ్రంధములో ముఖ్యముగా నాతత్త్వ రహస్యములు వెలుగులోనికి తీసుకొనిరా. ఇది అసాధ్యమని భావించవద్దు.
(సాయి సందేశాలు యింకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment