28.05.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(vaice of Sai Baba)
శ్రీసాయి తత్వ సందేశములు – 2 వ.భాగమ్
4. 19.02.1992 తెల్లవారుజాము 3 గంతలకు స్వప్నములో శ్రీ సాయి దర్శనమిచ్చి సూర్యుడు భూమధ్యరేఖకు వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చోమనగా అట్లు చేయగా ధ్యానము కొనసాగి మధ్యాహ్నము 3 గంటలకు పూజామందిరములో శ్రీసాయినాధుడు యిచ్చిన సందేశము.
నీకు అప్పగించిన కార్యమందు ఆసక్తిని చూపక అశక్తిని ప్రకటించుకొనుచున్నావు. నీవు నిమిత్తమాత్రుడవు. నేనే వ్రాయుచున్నాననే భావనను నీవు వదలుకొని, నీలోవున్న అహంకారము మచ్చుకైనా వుండక యున్నచో నీమనస్సులో ప్రవేశించి వ్రాయునది నేనే.
ఈగ్రంధ రచనకు మూల గ్రంధములు సేకరించనవసరములేదు. నీవద్దనున్న ఆధ్యాత్మిక వేదాంత గ్రంధములను ఒక పర్యాయము ఏకాగ్రతతో నిర్మలమైన మనసుతో, ప్రశాంతముగా పఠించిన, నీలోవున్న ఆధ్యాత్మిక జ్ఞానము వృధ్ది పొందుటయేగాక, ఈ రచించబోయే గ్రంధ క్రోడీకరణకు సహకారియగును. వాటిలోని వేదంత రహస్యములన్నియు గ్రహించనవసరము లేదు. ఏవి కావలయునో నేనే చూపెదను. ఈ గ్రంధములను పఠించుటకు వెంటనే ప్రారంభించు.
నేను ఆదేశించిన గ్రంధము లోతైనదియు, విశాలమైన ఆధ్యాత్మిక బోధతో కూడినదియు, విచార గ్రస్థులకు శాంతిని సమకూర్చునదియు వేదములవలె బోధనను బోధించునదియు గాక, మననము చేసిన బ్రహ్మజ్ఞానమును ప్రసాదించునదిగాను,
బోధలు మధురముగాను, సుందరముగాను, మనోవికలత పోగొట్టునట్టిదిగా యుండునట్లుగా, ఈ గ్రంధరచన ప్రారంభించి కొనసాగించు. ఇది అతి దుర్లభమని భావించవద్దు. చిత్త శుధ్దితో ప్రయత్నించిన యిది సాధ్యమే. నీవు కారణమాత్రుడవేనని గ్రహించు.
ఈగ్రంధము శాంతి కధామృతముగా ఉండవలయును. ఈ గ్రంధమును సంపూర్తి గావించిన నీకును, నీకు తోడ్పడినవారికి ఆత్మసాక్షాత్కారము
కలిగించెదను. నాయందు భారము వుంచి, ఈకార్యక్రమము కొనసాగించు.
7. 02.03.1992 ఉదయం 07.20 గం. లకు శివరాత్రినాడు వచ్చిన సందేశము
నా అనుమతిలేనిది నా చరిత్రకాని, వేదాంత సారము కాని ఎవరైనా తలపెట్టిన అది వట్టి బూటకము. నా ఆజ్ఞలేనిది ఎవరూ ఏదీ సాధించలేరు. అట్లు
చేసినను అది ఫలవంతము కాదు. నా కొరకు ఎవరు వేదన పడేదరో అట్టివారికి, వారికి తగిన కార్యము అప్పగించెదను. నీలో వున్న బాహ్యాంతర ప్రకృతులను వశపరచుకొని, అంతర్గతముగా యున్నదైవత్వము మేలుకొలుపుకొని నీకు అప్పగించిన కార్యమును ప్రారంభించు. ఈ రచనకు కావలసిన శక్తి ధైర్యము, మేధాశక్తి, నేనే ప్రసాదించెదను.
నేను : బాబా! మీ దయాపూర్వకమైన ఆశీర్వచనములతో అవధూతేంద్రుడు శ్రీరామిరెడ్డి తాతగారిని దర్శించి రచనను ప్రారంభించెదను. బాబా!
నా చిరకాల కోరిక ఒకటిగలదు. అది కోరరాని కోరికైనచో క్షమించ ప్రార్ధన. మీరు స్వప్నంలో కాని, ధ్యానంలో కాని దర్శనమిచ్చుచున్నారే కాని, ప్రత్యక్ష దర్శనము భౌతికముగా యిచ్చుట లేదు. అట్టి దర్శన భాగ్యము ప్రసాదించవలయునని ప్రార్ధిస్తున్నాను. ఇదే నాజీవితాశయము.
(బాబా వారికి శ్రీ రావుగారికి ఈ సందర్భంగా జరిగిన సంభాషణ ఇంతకు ముందు రావుగారి అనుభవాలలో ఇవ్వడం జరిగింది. అందు చేత మరలా దానిని ప్రచురించటంలేదు)
8. 05.03.1992 రాత్రి 7 గంటలకు పూజామందిరములో దీక్షా సమయమందు శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
నీవు చేపట్టిన దీక్ష స్వలాభాపేక్షకు కాదు. లోక కళ్యాణార్ధము భక్తులలో జ్ఞానజ్యోతి వెలిగించుటకు. నేను ఎవ్వరో తెలియచేయుటకు ప్రారంభించిన సాధన. దీక్ష ప్రారంభించుటకు కారణము నా ప్రేరేపణే, దీనిలోని అంతరార్ధము నీ దీక్షానంతరము సర్వమానవకోటి తెలుసుకొనగలరు. ఎవరైతే
నీతోపాటు అనుష్టానమునందుకాని,
నామ జపమునందుకాని, ధ్యానమునందుకాని, పాల్గొనెదరో అట్టివారికి చైతన్యమును, నాయందు భక్తిని కలిగించెదను. విమర్శనలకు విలువనివ్వక నీకు అప్పగించిన కార్యమును మనోనిశ్చయముతో నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతతో సాధించిన నీకు జయము నిశ్చయము. ఒకరి దూషణ భూషణలకు తలవంచవద్దు. అవి అన్నియు నీకు శుభాకాంక్షలని గ్రహించు.
నీవు ఈ దీక్షను ప్రారంభించుటకు ముందు నీతో చాలా కఠోరమైన వాక్యములను మాట్లాడించి, కఠోరమైన నిబంధనలను నీకు పెట్టడమైనది. దానిని
మనస్సులో పెట్టుకొనక సరియైన మార్గములో అనుసరించు. నీవు ఏమిటో, నీవు ఎవ్వరివో తెలుసుకో. ఏకార్యము ఎటువంటివారికి అర్హత గలదో అట్టివారెకే అప్పగించెదనని తెలుసుకో.
నేను : ఎన్ని రోజులు ఈ దీక్షలో వుండవలెను. బాబా నేను తెలిసో తెలియకయో ఈ కోరిక కోరినాను.
బాబా : నీవు అడిగినది సబబుగానే వున్నది. ఇది నీకు ఒక్కడికే వచ్చిన సందేహం కాదు. అందుకే
లోక కళ్యాణార్ధము కొరకు వచ్చినదై, ఈ దీక్షానంతరము మానవకోటి గ్రహించగలదని చెప్పి యున్నాను.
9. 06.03.1992 మధ్యాహ్నం 2.50 గంటలకు దీక్షా సమయంలో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
నీకు వాహన ప్రమాదము సంభవించబోవుచున్నదని
ఈ కఠోరదీక్ష ప్రారంభించమని చెప్పినాను. నీతో కఠోరమైన వాక్కులను పలికించి కష్టతరమైన షరతులను విధించి గృహబంధితుడిని చేసినాను. లేనిచో
నీవు బయటకు పోయిన గొప్ప ప్రమాదము సంభవించి వుండేది. ఆ ప్రమాదము తప్పించుటకు యిటువంటి కఠినమైన, కఠోరమైన షరతులను నియమించినాను. ఈప్రమాదము నాలుగు దినములలో జరిగే అవకాశము కలదు. కనుక జాగరూకత వహించు. నీతో కఠోరమైన, అసభ్యకరమైన అనాలోచితమైన వాక్యములని పలికించితినని నీవు మనోవేదన పడుచున్నావు.
పలికించేది, వ్రాయించేది, బోధించేది, ఆచరణలో పెట్టించేది నేనే అని గ్రహించు. ఈ అపాయము పోయిన తరువాత ప్రజాలోకమునకు కావలసిన సందేశమును ఆరోజే యిచ్చెదను. అంతవరకు
ఈ దీక్షను మధ్యలో మానక కొనసాగించు. నా శుభాకాంక్షలచే జయప్రదమగును. నీ దీక్షయందు ఏకాగ్రత వహించు. నిర్మలమైన హృదయముతో ప్రతిఫలాపేక్ష లేకుండా కొనసాగించు.
ఈ నా దివ్య సందేశమును మనసారా పాటించిన నీకు ఏవిధమైన అడ్డంకులుగాని విమర్శలు గాని వచ్చినను ముందుకు పోగలవు. ఇది నీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి మొదటిమెట్టు.
అంతర్ముఖ స్థితికి చేరవలయునంటే అనేక మెట్లు దాటిన గాని ఆత్మజ్ఞానస్థితి సంభవించదు. ఇది నీ ఒక్కరికే కాదు నా భక్తులందరికి అనువర్తిస్తుందని సలహా యివ్వు. నాయందు పూర్తి శరణాగతులై, నన్నే నమ్ముకొన్నవారికి, ఈ సందేశములోని అంతరార్ధమును అర్ధము చేసుకొని ఆచరణలో పెట్టమను. అనేకమైన
విమర్శలు వచ్చినను వాటిని పాటించవద్దు. నీ గురుదైవమును నమ్ముకొన్న అన్ని సందేహములు మొదలైనవి పటాపంచలగును. గురుభక్తికి మించినది లేదు. సదా కోరికలన్నియు గురుడే తీర్చును. నీ దీక్షానంతరము మానవకోటికి ఉపయోగకరమైన సందేశమును యిచ్చెదను.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment