02.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –34 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id : tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
మీ భారములను నాపై పడవేయుడు - నేను మోసెదను
(మా అబ్బాయికి బాబా అందించిన
అనుభవాలు)
“నువ్వు నావైపు ఒక అడుగు
వేస్తే నేను నీవైపు పది అడుగులు వేస్తానని” బాబా చెప్పిన మాటలు చాలా సంఘటనలలో ఋజువయ్యాయి. సంపూర్ణంగా సాయిబాబాకు అంకితులయిన భక్తులు ఎన్నో
అనుభవాలను పొందారు. అటువంటి భక్తులలో చాలా
కొద్ది మంది మాత్రమే తమకు కలిగిన అనుభవాలను బయటకి వెల్లడి చేస్తున్నారు.
కొంతమంది సందేహాస్పదులు, మరికొంతమంది స్వీయగౌరవం
వల్ల, ఇంకా మరికొంతమందికి విశాలభావాలు లేకపోవడం వల్ల తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను
బయటకి వ్యక్తం చేయడంలేదు. తమకు సాయి ప్రసాదించిన
సాయిలీలలను ఎవ్వరితోను పంచుకోవడంలేదు. ఈ కారణాల
వల్లనే ఎన్నో సాయిలీలలు సాయిభక్తులలో ప్రచారంలోకి రాకుండా మరుగున పడిపోతున్నాయి.
సాయిబాబా అనుగ్రహంతో
మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ కి కూడా కొన్ని సాయిలీలలు అనుభవంలోకి వచ్చాయి. వాటిలో కొన్ని వ్యక్తిగతమయినవి. ఈ లీలలను మిగతా సాయిభక్తులందరికీ కూడా సాయిబాబా
మీద భక్తి మరింతగా వృధ్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో వెల్లడి చేస్తున్నాము.
మా అబ్బాయి చి.కృష్ణకిషోర్
తను చేస్తున్న మంచి ఉద్యోగాన్ని 1984వ.సంవత్సరంలో వదలిపెట్టి హైదరాబాదులో స్వంతంగా
ఒక పరిశ్రమను స్థాపించాడు. కాని తను స్థాపించిన
పరిశ్రమ విజయవంతం కాక భారీ నష్టాలను మిగిల్చింది.
దానివల్ల మా అబ్బాయి చాలా నైరాశ్యానికి గురయ్యాడు. ఈ సమయంలో మా అబ్బాయి శ్రీసాయి సత్ చరిత్రను ప్రతిరోజు
శ్రధ్ధగాను. దీక్షగాను పారాయణ చేశాడు.
శ్రీసాయి
సత్ చరిత్ర పారాయణ పూర్తవగానే బాబా ఫొటోనుంచి సుగంధ పరిమళం బొట్లు బొట్లుగా ధారగా కారసాగింది. ఈ సంఘటన చూసి, తన తండ్రిమీదనే కాక తనపైన కూడా బాబా
అనుగ్రహించారనే నమ్మకం కలిగింది. ఆ విధంగా బాబా
మీద మరింత నమ్మకం, శ్రధ్ధలతో ఆయనను ప్రార్ధించడం మొదలుపెట్టాడు.
ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల
తరవాత ఒక వృధ్ధుడు ఇంటి బయటనిలబడి ‘సాయిబాబా – సాయిబాబా’ అని గట్టిగా పిలవసాగాడు. మా అబ్బాయి అతడిని లోపలికి ఆహ్వానించాడు. ఆవ్యక్తి తన శరీరానికి ఊదీ రాసుకుని తలకి గుడ్డ
చుట్టుకుని ఉన్నాడు. మా అబ్బాయి అతనికి సాష్టాంగ
నమస్కారం చేశాడు. అపుడా వ్యక్తి “చింతించకు,
నీకు త్వరలోనే మంచి హోదా లభిస్తుంది. దానధర్మాలు
చెయ్యి. నీ తలిదండ్రులను జాగ్రత్తగా చూసుకో”
అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే
మా అబ్బాయి అతని కోసం బయటకు వెళ్ళి చూశాడు.
కాని అతనెక్కడా కనిపించలేదు. ఆ వ్యక్తి బాబాయేనని ప్రగాఢంగా నమ్మకం కలిగింది.
ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల
తరవాత మా అబ్బాయికి భారత ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం వచ్చింది. జీతం కూడా తను అనుకున్నదాని కన్నా ఎక్కువే. ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బాబా దయవల్ల మంచి ఉద్యోగం
లభించింది. ఉద్యోగం హైద్రాబాదులో వచ్చింది. 1989 వ.సంవత్సరం వచ్చేటప్పటికి మా ఆర్ధిక పరిస్థితి
మెరుగయింది. మా ఆస్తిపాస్తులు కూడా వృధ్ధి
చెందాయి. అంతా అయేటప్పటికి మా అబ్బాయి కాంట్రాక్టు
పూర్తయిపోవడంతో మరలా ఉద్యోగం పోయింది. అంతకు
ముందు వరకు మంచి హోదా ఉన్న ఉద్యోగాలు చేసి ఉండటం వల్ల ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం చేయడం
ఇష్టం లేకపోయింది. అందువల్ల ప్రైవేటు కంపెనీలలో
ఉద్యోగానికి ప్రయత్నం చేయలేదు. ఇక ఉద్యోగం
కోసం అక్కడికి ఇక్కడికి తిరిగి తిరిగి ప్రయత్నం చేసేకన్నా, మొత్తం భారమంతా బాబా మీదనే
వేసి శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తే ఫలితం ఉంటుందనే నమ్మకంతో ఉన్నాడు.
ఒక నెల తరవాత 1990 వ.సంవత్సరంలో
బాబా దయవల్ల గుంటూరులో ఉన్న చాలా పేరుపొందిన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అందులో ప్రవేశించి కుటుంబాన్ని గుంటూరుకు మార్చాడు. మొట్టమొదటిసారిగా పని వత్తిడి చాలా అధికమయి ఉద్యోగం
చాలా భారంగా అనిపించింది. ఉద్యోగాన్ని నిర్వహించడం కూడా విపరీతమయిన మానసిక ఆందోళన కలిగించేది. ఇక ఉద్యోగం చేయడం కష్టమని భావించి, ఉద్యోగాన్ని
వదలిపెట్టి హైదరాబాదుకు తిరిగి వచ్చేశాడు.
ఎంత ఓర్పుగా ఉన్నా ఉద్యోగం చేయడం చాలా కష్టతరమయింది.
అక్కడికీ ఎంత వత్తిడి
ఉన్నాగాని రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం చేశాడు.
పనివేళలు కూడా సక్రమంగా ఉండేవి కావు.
అందుకనే రాజీనామా చేసి వచ్చేశాడు. ఇంటికి
వచ్చి తన భార్య చి.సౌ. నివేదితకి తను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశానని చెప్పాడు. ఆవార్త విని ఆమె చాలా ప్రశాంతంగా ఉంది. అంతే కాదు తనేమీ ఆందోళన పడకుండా చాలా మంచిపనిచేశారని
భర్తను ఓదార్చింది.
ఉద్యోగానికి రాజీనామా
చేసిన తరువాత ఇంక మరో ఉద్యోగానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. మరొక ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఏమీ లేవు. బాబా మీదనే విపరీతమయిన నమ్మకం పెంచుకొన్నాడు. తన సమస్యకు పరిష్కారం బాబాయే చూపుతారనే స్థిరనిశ్చయంతో
ఉన్నాడు.
తను ఉద్యోగాన్ని వదిలిపెట్టానన్న
విషయం కూడా మాతో చెప్పలేదు. రాజీనామా చేసిన
రోజుననే విదేశంలో ఉన్న ఒక మల్టీనేషనల్ కంపెనీకి మంచి విద్యార్హతలు అనుభవం ఉన్న వ్యక్తి
కావలసి వచ్చింది. ఆ విషయం తెలిసి తన వివరాలన్నీ
ఆ కంపెనీవాళ్ళకి పంపించాడు. ఆ కంపెనీలో ఉద్యోగులను
చేర్చుకోవడానికి నిర్ణయం తీసుకునే అధికారి ఇంగ్లాండులో ఉన్నాడు. అందువల్ల ఉద్యోగంలోకి తీసుకోవడానికి జరిగే కార్యక్రమాలన్నీ
పూర్తవడానికి కొంత సమయం పట్టచ్చు.
అదేరోజు, మా అబ్బాయి
తన కుటుంబంతో సహా విశాఖపట్నం వెడుతూ దారిలో అన్నవరంలో ఆగాడు. అక్కడ కొండమీదకు నడిచి వెళ్ళి, శ్రీసత్యనారాయణస్వామిని
దర్శించుకుని సత్యనారాయణ వ్రతం చేసుకొన్నారు.
తనకి స్థిరమయిన ఉద్యోగం వస్తే మళ్ళీ స్వామిని దర్శించుకుంటానని మొక్కుకొన్నాడు. తరువాత విశాఖపట్నం వెళ్ళారు. అదే సమయంలో మేము కూడా హైద్రాబాదునుండి విశాఖపట్నం
వెళ్ళాము. మేమందరం మా అబ్బాయి మామగారింట్లో
కలుసుకున్నాము. అప్పటికీ మా అబ్బాయి తన ఉద్యోగం
గురించి మాతో ఒక్కమాటయినా చెప్పలేదు. మా అబ్బాయి
రెండురోజులుండి గుంటూరుకు తిరిగి వచ్చేశాడు.
విదేశంలో ఉన్న కంపెనీవాళ్ళు మా అబ్బాయితో మాట్లాడదామని అప్పటికే ప్రయత్నిస్తూ
ఉన్నారు. మరుసటిరోజే మా అబ్బాయికి, కంపెనీ
వైస్ ప్రెసిడెంట్ ఇంగ్లాండునుంచి గుంటూరుకు వస్తున్నారనే సమాచారం అందింది. మా అబ్బాయిని అతనిని కలుసుకోమని వర్తమానం వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ రాగానే మా అబ్బాయి ఆయనని కలుసుకున్నాడు. ఆయన మా అబ్బాయి వివరాలన్నీ పరిశీలించి, సంతృప్తి
చెంది, మంచి జీతం మీద ఉద్యోగం ఇచ్చాడు. అంత
తక్కువ సమయంలోనే తనకు అంత మంచి జీతంతో, మంచిమంచి అవకాశాలున్న పెద్ద కంపెనీలో ఉద్యోగం
వస్తుందని ఊహించలేదు. ఇది బాబా మా అబ్బాయికి
ప్రసాదించిన అత్యంత దివ్యమయిన అనుభవం. మా అబ్బాయికి
అంత తొందరగా మంచి ఉద్యోగం లభించినందుకు స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ అభినందనలు
తెలిపారు.
మా అబ్బాయికి ఉద్యోగం
రాగానే, అందులో అతను పొందిన సంతోషం ఈ క్రింద వివరించిన వివరణే ఒక ఉదాహరణ. ఎవడయినా సముద్రంలో తీవ్రమయిన తుఫానులో చిక్కుకుని
దిక్కులేకుండా ఉన్న సమయంలో సముద్ర కెరటాల సాయంతో బయటపడి సాఫీగా సాగరంలో ప్రయాణించి
ఒడ్డుకు చేరుకున్నపుడు అతను పొందే ఆనందం వర్ణనాతీతం. అదే విధంగా శ్రీసాయిబాబా తనే మా అబ్బాయిని ఒక ఒడ్డుకు
(ఉద్యోగం ఇవ్వడం ద్వారా) చేర్చారు.
ఈ సందర్భంగా శ్రీసాయి
సత్ చరిత్రలో బాబా ఇచ్చిన మాట, “నన్నాశ్రయించువానిని, నన్ను శరణుజొచ్చినవానిని నిరంతరము
రక్షించుటయే నాకర్తవ్యము. నా సహాయమును గాని,
సలహాను గాని కోరిన తత్ క్షణమే యొసంగెదను” .
బాబా అన్న ఈమాటలు పైన చెప్పిన సంఘటనలో నిజమయ్యాయి.
తనకు స్థిరమయిన ఉద్యోగం
లభిస్తే మరలా అన్నవరం వచ్చి స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్న మొక్కును మర్చిపోలేదు. కాని ఉద్యోగంలో ఉన్న పనివత్తిడి కారణంగా మా అబ్బాయి
అన్నవరం వెళ్ళలేకపోయాడు. ఒక రోజున ఒక వృధ్దుడు
మా అబ్బాయి ఆఫీసుకు వచ్చాడు. అతనికి తల,
గడ్డం నెరసిపోయి ఉంది. అతను కుర్తా పైజామా
ధరించి ఉన్నాడు. తనను ఖాజీబాబాగా మా అబ్బాయికి
పరిచయం చేసుకున్నాడు. అతను మా అబ్బాయితో “శ్రీసాయిబాబా
నీకు అన్నవరం యాత్ర గురించి నన్ను గుర్తు చేయమని పంపించారు” అని చెప్పి “అల్లా అచ్చా
కరేగా” అన్నాడు. మా అబ్బాయి ఇచ్చిన దక్షిణ
తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీసాయిబాబా మా అబ్బాయి
భారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని అన్నవరం మొక్కును కూడా గుర్తు చేశారు. మా అబ్బాయి బాబాకు నమస్కరించుకుని, బాబా ఆదేశానుసారం
అన్నవరం వెళ్ళి స్వామిని దర్శించుకున్నాడు.
సాగరంలోని అలలవలే బాబా లీలలు కూడా అనంతం.
చాలా ప్రమాదకరమయిన కారు యాక్సిడెంట్లనుండి కూడా బాబా మా అబ్బాయిని రెండు సార్లు
రక్షించారు.
మాకెల్లపుడూ రక్షణగా
ఉండే సాయికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మాటలు చాలవు.
మామీద ఎల్లపుడూ నీదయను
ప్రసరిస్తూనే ఉండమని ఆయనను ప్రార్ధించుకుంటున్నాము.
(రేపటి సంచికలో మనకు
కూడా అటువంటి లీలలు బాబా చూపిస్తే ఎంత అదృష్టవంతులమో కదా అనుకునేంతగా రావుగారి కోడలికి
బాబా చూపించిన అధ్బుతమైన లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment