12.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –43వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id : tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
రెండు రోజులుగా కొన్ని కుటుంబ బాధ్యతల వల్ల ప్రచురణ చేయలేకపోయాను. ఈ రోజునుండి యధావిధిగా సాయిలీలా తరంగిణి లోని మాధుర్యాన్ని చవిచూడండి.
గురుపూర్ణిమ రోజున శ్రీదత్తుని
రాక
మరునాడు గురుపూర్ణిమ
అనగా 1987వ.సంవత్సరం, జూలై, 11 వ. తారీకున గురుచరిత్ర పారాయణ పూర్తి చేశాను. గురుపూర్ణిమకు ముందు రోజు రాత్రి శ్రీదత్తాత్రేయులవారు
నాకు పటం రూపంలో కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో
శ్రీదత్తాత్రేయుల వారి పెద్ద సైజు పటాన్ని ఎవరో తీసుకుని వచ్చారు. ఆ పటాన్ని నాచేతులలోకి తీసుకుని అది చాలా అద్భుతంగా
ఉందని ఎంతో సంతోషంగా చెప్పాను.
నేనా పటాన్ని
తదేకంగా చూస్తూ ఉండగానే నాకు మెలుకవ వచ్చి కల కరిగిపోయింది. గురుపూర్ణిమనాడు శ్రీదత్తాత్రేయులవారి దర్శనం లభించినందుకు
నేనెంతో అదృష్టవంతురాలినని ఉప్పొంగిపోయాను.
శ్రీసాయిబాబా, హేమాడ్ పంత్ ఇంటికి పటం రూపంలో వచ్చిన సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. ఈ లీలను అనుభూతి చెందిన తరువాత శ్రీదత్తభగవానులే
స్వయంగా మాఇంటికి వచ్చారని హేమాడ్ పంత్ లాగే నేను కూడా భావించాను.
కొన్ని రోజుల తరువాత
నాసోదరి కుసుమ శ్రీదత్తాత్రేయులవారి పెద్దపటం తీసుకుని వచ్చి మా పూజాగదిలో పెట్టమని
చెప్పింది. ఆ పటం చాలా అందంగా ఉండటమే కాదు,
సరిగ్గా శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామీజీ వారు వర్ణించినట్లుగానే ఉంది. శ్రీదత్తాత్రేయులవారికి కుడి ప్రక్కన జపమాల, ఢమరుకం,
చక్రం, ఎడమ వైపున కమండలం, త్రిశూలం, శంఖువులతో అందంగా ఉంది.
శ్రీదత్త అవతారమయిన శ్రీసాయిబాబా
నామీద కురిపించిన అనుగ్రహానికి నేనెంతో కృతజ్ఞురాలిని. మరొక్కసారి ఆయనకు నా ప్రణామాలను అర్పించుకొంటున్నాను.
మాతాజీ హజ్రత్ బాబా జాన్ (పూనా) దర్శనమ్
1987వ.సంవత్సరం జూన్
26వ.తారీకు శుక్రవారం రాత్రి నాకొక కల వచ్చింది.
ఆ కలలో నేను ఒంటరిగా ఒక నిర్జన ప్రదేశంలో నిలబడి ఉన్నాను. అక్కడ ఎటువంటి జీవరాశి లేదు. పచ్చని ప్రకృతి మధ్య చాలా ఎత్తయిన ప్రదేశంలో నేను
నిలుచుని ఉన్నాను. దూరంగా నీలి రంగు కొండలు,
ప్రక్కనే ఒక నది కనపడుతున్నాయి. ఆ ప్రకృతి
సౌందర్యాన్ని తన్మయత్వంతో తిలకిస్తూ ఉన్నాను. ఇంతలో ఒక విమానంలాంటి వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. దానికి నాలుగు స్థంభాలు ఉన్నాయి. అది ఒక మండపం ఆకారంలో ఉంది. ఆశ్చర్యంతో నేను దానినే చూస్తూ నిలబడ్డాను. అందులో నాకు ఒక వృధ్ధుడు కనిపించాడు. అతని జుట్టంతా నెరిసిపోయి భుజాలమీద పడుతూ ఉంది. ఆవ్యక్తి ఆకుపచ్చని శాలువా కప్పుకుని ఉన్నాడు. ఆ విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండటం వల్ల
చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి ఎవరా
అని నేను ఆశ్చర్యంతో చూస్తున్నాను. నాకు ఆ వ్యక్తి
ముఖం సగం మాత్రమే కనపడుతోంది. బహుశ ఆవ్యక్తి
కబీర్ అయి ఉండచ్చనుకుని కబీర్ – కబీర్ అని చాలా గట్టిగా అరిచాను. వెంటనే ఆ విమానం వేగం తగ్గింది. వెనక్కి తిరిగి మెల్లిగా నావైపుకు రాసాగింది. అపుడు ఆ విమానంలోని వ్యక్తి నావైపు చూశాడు. ఎవరో బాబా జాన్ అని పిలవడం వినిపించింది. నేనున్న ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. మరి ఆ పిలుపు ఎక్కడినుంచి వచ్చిందో నాకర్ధం కాలేదు. హజ్రత్ బాబా జాన్ గారి దివ్య దర్శనంతో నేను స్థాణువునై
నిలబడిపోయాను.
(హజ్రత్ బాబా జాన్ దర్గా పూనె)
నేనామె నుంచి దృష్టిని మరల్చితే
ఆవిడ అదృశ్యమయిపోతుందేమోనని భయపడ్దాను. మెహర్
బాబా నుదుటిమీద చుంబించి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించిన దైవాంశ సంభూతురాలయిన అమ్మ బాబాజాన్
దర్శనం లభించడం గొప్ప అదృష్టం. సాయిబాబా వల్లనే
నాకు ఈ దర్శనబాగ్యాలన్ని లభించాయి.
శ్రీసాయిబాబా పటంలో శ్రీరాఘవేంద్రస్వామి
1983వ.సంవత్సరంలో విజయదశమినాడు
నేను షిరిడీలో ద్వారకామాయి మెట్లమీద కూర్చున్నాను. అక్కడ దగ్గరలో ఉన్న దుకాణంలో నాకు శ్రీరాఘవేంద్రస్వామి
వారి పటం కనిపించింది. ఇక్కడివారికి కూడా రాఘవేంద్రస్వామి
గురించి తెలుసని ఎంతో సంతోషం కలిగింది. ఆ తరువాత
నేను ఆ పటం కనిపించిన షాపుకు వెళ్ళాను. కాని,
ఆశ్చర్యం…అంతకు ముందు నాకు రాఘవేంద్రస్వామి కనిపించిన పటంలో ఇప్పుడు బాబా కనిపిస్తున్నారు. ఏమిటీ మాయ?
ఇందులో ఎటువంటి పొరబాటు జరగడానికి ఆస్కారం లేదు. నేను మెట్ల దగ్గర కూర్చుని చూసినప్పుడు ఆ పటంలో శ్రీరాఘవేంద్రస్వామి వారు ధ్యానముద్రలో
ఉన్నట్లుగా కనిపించారు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన శిరసుపైనుంచి భుజాలమీదకి ఒక వస్త్రం వ్రేలాడుతూ
ఉంది. ఆయన నుదుటిమీద నామం ఉంది.
ఆయన హృదయంపైన, ఆయనకు దర్శనమిస్తున్నట్లుగా శ్రీరాములవారు
ఆశీనులయి ఉన్నారు. నాకు స్వామి చాలా స్పష్టంగా
కనిపించారు. కాని, నేను పటం దగ్గరకు వచ్చి
చూస్తే పటంలో బాబావారు ‘అభయ హస్తం’ తో కనిపించారు. బాబా పసుపురంగు కఫనీ ధరించి ఉన్నారు.
రెండూ ఒకదానికొకటి పోలిక లేకుండా పూర్తి విరుధ్ధంగా
ఉన్నాయి. నేను పొరబాటు పడటానికి ఆస్కారమే లేదు. గురువులందరూ ఒకరే, అందరూ సమానమేనని బాబా ఈ లీలద్వారా
నాకు తెలియచేసారని అర్ధం చేసుకున్నాను.
షిరిడీనుంచి తిరిగివచ్చిన
కొన్ని రోజుల తరువాత నాభర్తకు కలలో శ్రీరాఘవేంద్రస్వామి దర్శనమిచ్చారు. తన మీద ఒక పుస్తకాన్ని రచించే కార్యాన్ని అప్పగించారు. కాని మావారికి తను ఆ పుస్తక రచనను సక్రమంగా నిర్వహించగలనా
లేదా అని సందేహించారు. కాని శ్రీరాఘవేంద్రస్వామి
మరొకసారి ఆయన కలలో దర్శనమిచ్చి, “నేను నీతోడుగా ఉంటాను, నా సహాయం నీకెల్లప్పుడూ ఉంటుందని”
అభయం ఇచ్చారు.
(రేపు మరికొన్ని)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment