13.05.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–44వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
శ్రీరాధాకృష్ణస్వామీజీ
దర్శనమ్
ఒకరోజున నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగివస్తున్నాను. నేను ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉండగా మాఇంటి వరండాలో
శ్రీరాధాకృష్ణస్వామీజీ గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు.
ఆయన నాకెప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా కనిపించారు. ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. నుదుటి మీద కుంకుమబొట్టు. ఆయన చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు.
ఆ నవ్వు ఎంతో మనోహరంగా ఉంది. ఆయన నాకు ఒక సిధ్ధపురుషునిలా కన్పించారు. వెంటనే ఆయనకు నమస్కరించుకొన్నాను. స్వామీజీ వచ్చారని నాభర్తతో చెప్పడానికి ఆనందంగా
ఇంటిలోకి వెళ్ళాను. నేను నాభర్తతో మాట్లాడుతూ
ఉండగానే మెలకువ వచ్చి కల పూర్తయిపోయింది. నాకు
వచ్చిన కల కొద్దిసేపు మాత్రమే ఉన్నదయినా అది నామనసులో ముద్రించుకునిపోయింది. స్వామీజీ జీవించి ఉండగా ఆయనను దర్శించుకోలేకపోయాము. ఆయనకు సేవకూడా చేసుకునే అవకాశం కూడా రాలేదు. కాని ఆయన సమాధి చెందిన తరువాత అదృష్టం కొద్దీ ఆయన
దర్శనం లభించింది. ఈ విధంగా ఆయన దర్శనం కలగడం
అంతా బాబా అనుగ్రహం వల్లనే.
అవధూత రామిరెడ్ది తాతగారి
అనుగ్రహమ్
శ్రీరామిరెడ్డి తాత దత్తాత్రేయుల
వారి అవతారం. కల్లూరు, హైదరాబాద్ లో నాకు ఆయన
దర్శనం చాలా సార్లు కలిగింది. ఆయన సమాధి చెందడానికి
కొన్ని నెలలముందు ఆయన మాయింటికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. ఆయన సోఫాలో కూర్చున్నారు. మేమంతా ఆయన పాదాల దగ్గర నేలమీద కూర్చున్నాము. కొంతసేపటి తరువాత శ్రీరామిరెడ్ది తాతగారు నాదగ్గరకు
వచ్చి నన్ను కౌగలించుకొన్నారు. దైవాంశసంభూతులయిన
ఆయన నావంటి సామాన్యురాలిని కౌగలించుకుని, తన దివ్య స్పర్శతో నాలోని పాపాలన్నిటినీ తుడిచివేసి
నన్ను పవిత్రురాలిని చేసారని అర్ధం చేసుకొన్నాను.
ఇదే ఆయన ఆఖరి దర్శనమని ఆ సమయంలో మాకు తెలీదు. సర్వంతర్యామియైన ఆస్వామి మామీద తన అనుగ్రహాన్ని
చూపించారు. ఆ తరువాత ఆయన సమాధి చెందారన్న వార్త
తెలిసి అక్కడికి వెళ్ళి కన్నీళ్ళతో ఆఖరిసారిగా ఆయనకు నమస్కరించుకొన్నాము.
శ్రీసాయినాధులవారి ఆగ్రహమ్
మేము షిరిడీ వెళ్ళినపుడు
ఒక రోజున నేను అక్కడ ఒక షాపుకు వెళ్ళాను. అక్కడ
ఎవరో అమ్మా, అమ్మా అని పిలుస్తూ ఉండటం వినిపించింది. షాపులో నేను బేరమాడుతూ ఉండటం వల్ల నన్ను ఎవరు పిలుస్తున్నారో
పట్టించుకోలేదు. నేను షాపునుండి బయటకు వెళ్ళిపోతూండగా,
శ్రీశివనేశన్ స్వామీజీ హడావిడి పడుతూ నావద్దకు వచ్చి బాబా ప్రసాదాన్నిచ్చారు. షాపులో ఉన్న జనం కోలాహలం, మాటల సందడిలో నాకు స్వామీజీగారి
పిలుపు సరిగా వినపడలేదు. నేనాయన మనసుకి కష్టం
కలిగించానేమోనని చాలా పశ్చాత్తాపపడ్డాను. కాని
స్వామీజీ ఇటువంటి భావాలకి అతీతులు. ఆ తరువాత
నేను ద్వారకామాయికి వెళ్ళాను. అక్కడ ద్వారకామాయిలో
బాబా ఎప్పుడూ కూర్చునే రాతిమీద ఉన్న బాబా ఫొటోకి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళాను. ఆ పటంలో బాబా ఎప్పుడూ మనోహరంగా చిరునవ్వు చిందిస్తూ
ఉంటారు. కాని ఈసారి ఆయన వదనంలో ఆగ్రహం కనపడుతూ
ఉంది.
నేను ఆయన ఫొటోని ఎన్ని సార్లో చూశాను. కాని ఎప్పుడూ కూడా బాబా ఈరోజు ఉన్నంత ఆగ్రహంగా ఎప్పుడూ
కనపడలేదు. ఆయన అగ్రహంతో ఉన్న ముఖాన్ని చూసి
నేను వణికిపోయాను. శ్రీశివనేశన్ స్వామీజీ అక్కడికి
రాగానే ఆయనకు క్షమాపణ చెప్పుకొన్నాను. కాని
ఆయన మామూలుగా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు.
బాబా నన్ను క్షమించు అని ఆయనని వేడుకొన్నా ఆయన నన్ను కనికరించలేదు. ఆయన వదనం ఇంకా ఆగ్రహంగానే కనిపిస్తూ ఉంది.
మేము షిరిడీకి ఎప్పుడు
వచ్చినా ఎక్కువ సమయం ద్వారకామాయిలోనే గడుపుతూ ఉంటాము. ఈ సంఘటన జరిగిన తరువాత, ఎప్పుడూ ద్వారకామాయిలోఉన్న
ఆయన ఫొటోను పరిశీలిస్తూ ఉండేదానిని. ఆయన నామీద
ఇంకా కోపంగానే ఉన్నారా అని పరీక్షగా చూసేదానిని.
నేను చేసిన తప్పుకి ఆరోజున బాబా నామీద మండే సూర్యునిలా కోపాన్ని చూపారు. ఆయన ఎప్పుడూ చాలా ప్రశాంతంగాను చల్లని చంద్రునిలా
కరుణతో కనిపిస్తూ ఉంటారు.
**********
ఇక్కడ సాయిభక్తులందరికీ
ఒక విషయం చెప్పదలచుకొన్నాను. మరోలా భావించవద్దని
మనవి. బాబాగారి ఆగ్రహం గురించి చదివారు కదా. ఆయన కోపానికి గల కారణం కూడా గ్రహించే ఉంటారు. భక్తులయినవారికి నిర్లక్ష్య భావం తగదు. అంతే కాదు పవిత్రమయిన బాబా వారి పుణ్యక్షేత్రంలో
మహొన్నత వ్యక్తి శ్రీశివనేశన్ స్వామీజి పిలిచినా వినిపించుకోకపోవడం. రెండవది బాబా ప్రసాదాన్ని స్వీకరించే క్షణాన్ని
కోల్పోవడం. అక్కడ తనను ఎవరు పిలుస్తున్నారో
అన్నది గమనించకపోవచ్చు, బాబా ప్రసాదాన్ని ఇస్తున్నారనే విషయం కూడా తెలియకపోవచ్చు. దీనిని బట్టి మనం గ్రహించవలసింది, మహాపురుషులు పిలిచినపుడు
వెంటనే స్పందించాలి, భగవంతుని ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
మనమంతా బాబా మందిరాలలో
గాని పుణ్యక్షేత్రాలను దర్శించినపుడు గాని స్థానికంగా ఉన్న దేవాలయాలలో గాని, ప్రసాదాలు
ఇస్తున్నపుడు మనం ఏవిధంగా స్వీకరిస్తున్నాము.
ప్రసాదం పంచే వ్యక్తి కూడా భక్తులకు హడావిడిగా పంచేస్తూ ఉంటాడు. మనం కూడా క్రమశిక్షణతో ఒక వరుసలో నిలబడకుండా ప్రసాదం
తీసుకుని ఎప్పుడు కాలు బయట పెడదామా అనే చూస్తాము.
ప్రసాదం ఇచ్చె వ్యక్తి ప్రసాదం ఇస్తాడు.
అది కిందా మీదా కాస్త పడిపోతూ ఉంటుంది.
భక్తులందరూ కూడా ఆవ్యక్తి చుట్టూ ఒకేసారి చేతులు చాస్తారు. ఎవరికని ఇస్తాడు. మనం తీసుకున్న ప్రసాదంలో కొంత కిందా మీదా పడుతూ
ఉంటుంది. భగవంతుని ప్రసాదాన్ని తీసుకునే ముందు
ఏదో మొక్కుబడిగా కళ్ళకి అద్దుకొని స్వేకరిస్తారు.
కాని కింద పడిన ప్రసాదాన్ని గమనించరు.
ఆ ప్రసాదాన్ని ఎంతో మంది తొక్కుతూ ఉంటారు.
ఉదాహరణకి తిరుపతి వెళ్ళినపుడు చూడండి.
ఎంత ప్రసాదం క్రిందపడి ఉంటుందో. కొంతమంది
ప్రసాదం తినలేక లేక ఇష్టం లేక అక్కడ స్థంభాలదగ్గర జాగా ఉన్నచోట పెట్టేస్తూ ఉంటారు. ఇది నేను గమనించి చెపుతున్నదే. మనమందరం కోరికలతో వెడుతూ ఉంటాము గుళ్లకి గోపురాలకి. మరి అటువంటప్పుడు భగవంతుని ప్రసాదాన్ని భక్తితో
సేవించకుండా కిందా మీదా పడేస్తే భగవంతుని అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది. ఆయనని ఎంత పూజించినా నన్ను కనికరించటల్లేదు అని
బాధపడితె ప్రయోజనం ఉంటుందా? ఒక్కసారి ఆలోచిద్దాము. నేను చెప్పేది ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా పడవేసే
వారి గురించి. అన్యధా భావించవద్దు. మనకి ఇచ్చిన ప్రసాదాన్ని భక్తితో కళ్ళకి అద్దుకుని
కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. ఒక్కొక్కసారి
ఎంత జాగ్రత్తగా తిన్నా కొంత కింద పడుతుంది.
అటువంటప్పుడు మనం ప్రసాదం తినగానే క్రింద పడ్డ ఒక్క మెతుకునయినా జాగ్రత్తగా
తీసి ఎవరూ తొక్కని చోట, మొక్కలో గాని, లేక ఎక్కడయినా గోడవద్ద మూలన గాని పడవేస్తే పక్షులు
గాని చీమలు గాని తింటాయి. మనలో ఎంత భక్తి ఉందో
భగవంతుడు గమనిస్తూనే ఉంటాడని చెప్పడానికే ఇదంతా చెప్పవలసి వచ్చింది. అంతే కాదు గుడికి
వెళ్ళినపుడు తెలిసిన వారు కనపడితే లోకాభిరామాయణం ముచ్చటించుకోవడానికి కాదు. కాస్తయినా భగవంతుని విషయాలను గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ల కాలం. గుడికి వచ్చిన ఆ కాస్త సమయమయినా సెల్ ఫోన్ ఆపుచెయ్యరు. ఫోన్ రింగ్ అయితే ఎవరు చేసారొ అని దాని మీదే దృష్టి, లేకపోతే పక్కకి వెళ్ళి మాట్లాడటం. మరి భగవంతుని మీదే మనకి దృష్టి లేకపోతే ఆయన దృష్టి
మనమీద ఉండాలా? మరి భగవంతుడు ఇవన్నీ గమనిస్తూనే
ఉంటాడు కదా? ------- త్యాగరాజు
(రేపటి సంచికలో "నువ్వు
నాకేమి సేవ చేసావని నీమీద నేను అనుగ్రహం చూపించాలి"
అని మణిగారితో అన్న అమ్మవారు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment