18.05.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నుండి సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు బాబా ఆదేశానుసారం రచించిన పుస్తకం "ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది" ప్రచురిస్తున్నాను. --- ఓమ్ సాయిరామ్
ఈనాటి
సమాజములో
మానవత్వము
ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస
నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ
: ఆత్రేయపురపు త్యాగరాజు
ముందుగా
ఒక మాట
సాయిబందువులకు నాప్రణామాలు
శ్రీసాయిసత్
చరిత్ర 10వ.అధ్యాయములో శ్రీసాయినాధులవారు స్వయంగా అన్న మాటలు. “నేను నా భక్తులకు బానిసను”. మరి నాయజమాని మీకు బానిస అయినపుడు నేను కూడా మీకు
బానిసనే. నా 73వ.జన్మదినము (24.04.2017) నాడు శ్రీసాయినాధులవారు నేను 1962 వ.సంవత్సరములో కాకినాడలో
చదివిన పి.ఆర్. కాలేజి ప్రిన్సిపాల్ గా దర్శనము ఇచ్చి “ఈనాడు మన సమాజములో మానవత్వము
చనిపోయే దశకు చేరుకొంది. సాయిమార్గములో ప్రయాణము
చేయదలచిన సాయిభక్తులకు మానవత్వ విలువలను తెలియచేసే విధముగా ఒక పుస్తకము వ్రాయమని" ఆదేశించారు.
నేను ఏవిధముగా ఈ సమాజానికి మానవత్వము గురించి చెప్పగలను
అని ఆలోచించసాగాను. దానికి సమాధానంగా శ్రీసాయినాధులవారు
నా జీవిత అనుభవాలను తోటి సాయిబంధువులతో పంచుకోమని ఆదేశించారు. శ్రీసాయి ఆదేశానుసారం నా నిజజీవితములో జరిగిన కొన్ని
అనుభవాలను ఈ పుస్తకము రూపములో మీకు అందించబోతున్నాను.
శ్రీసాయి
సత్ చరిత్రను ఎన్నిసార్లు పారాయణ చేసాము, షిరిడీకి ఎన్నిసార్లు వెళ్ళాము, శ్రీసాయి
సత్ నామావళి ఎన్నిసార్లు చదివాము, శ్రీసాయినామకోటి ఎన్ని పుస్తకాలు వ్రాసాము, సాయి
మందిరాలలో ఎన్నిసార్లు పాలాభిషేకాలు చేశాము అనేది అంత ముఖ్యము కాదు. శ్రీసాయి మార్గములో ఎంత దూరము ప్రయాణము చేశాము అనేది
ముఖ్యము.
శ్రీసాయి
మార్గములో ప్రయాణము చేయాలి అంటే ముందుగా శ్రీసాయిని ప్రేమించాలి, ఆయన చెప్పిన తత్వాన్ని
అర్ధము చేసుకొని మన నిజ జీవితములో ఆచరించాలి.
ఈ విధముగా ఆచరించే సమయములో మనము అనేక కష్టసుఖాలను అనుభవించవలసి వస్తుంది. ఆ కష్ఠాలు ఆ సుఖాలలో మనము మానవత్వము అనే దేవత యొక్క
అనుగ్రహాన్ని పొందగలము. బాబా అంటారు ఈ నాడు
సమాజములో మానవత్వము అనే దేవతని చాలా మంది వారి మనసులలో చంపివేసారు. కొద్దిమంది మాత్రము ఆ దేవతను ప్రేమించి ఆమెను ఆరాధిస్తున్నారు. బాబా అనుగ్రముతో ఆ దేవతను ప్రేమించి పూజించినవారిలో
నేను ఉన్నాను. శ్రీసాయినాధుల పాదాలపై నాలో
ఇంకా మిగిలి ఉన్న అహంకారమును పెట్టి శ్రీసాయినామ స్మరణ చేస్తూ ఈ పుస్తకము వ్రాయటం ప్రారంభించాను.
సాయి
బంధువులు అందరు ఈ సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది అనే భావనతో ఆలోచిస్తూ శ్రీసాయి
చూపిన మార్గములో ప్రయాణము కొనసాగించాలని కోరుతూ ఈ పుస్తకాన్ని చదవమని వేడుకొంటున్నాను. మానవతావాదాన్ని నమ్మే ప్రతిఒక్కరికి నాశిరస్సు వంచి
పాదాభివందనము చేస్తున్నాను.
శ్రీసాయి మరియు సాయిభక్తుల సేవలో
మీ సాయిబానిస రావాడ గోపాలరావు సెల్ నంబర్ : 8790862454
ఈ పుస్తకములో
చోటు చేసుకొనే ముఖ్య సంఘటనలు
1. దీపావళి – పనిపిల్ల కళ్ళలో నిజమైన వెలుగులు
2. మద్రాసులోని పెండ్లి మండపము – ఎంగిలి బ్రతుకులు
3. డిసెంబర్ నెల - రాత్రి చలిలో మాతృ ప్రేమ
4. తల్లిదండ్రుల ఆకలి తీర్చడానికి ఒక కన్నెపిల్ల
ఆరాటం
5. బక్రీదు పండుగ – ఒక మేక ఆకలి తీర్చుట
6. రాత్రి 10 గంటలకు ఆకలితో ఉన్న వ్యక్తి ఆకలిని
తీర్చుట
7. మానవసేవే మాధ సేవ
8. అనాధ ప్రేత సంస్కారములో పాల్గొనే అవకాశమ్
9. 24.04.2017 నాడు శ్రీసాయి ప్రసాదించిన ఒక
అనుభవమ్
10. తండ్రి తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలు
నామాట
గత
ఆరు సంవత్సరాలుగా నాకు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారితో పరిచయం ఉంది. ఆయనతో పరిచయాన్ని నాకు బాబా వారే కలిగించారు. కారణం ఆయన రచనలను పుస్తకరూపంలో వెలుగులోకి తీసుకుని
వచ్చి సాయిబంధువులందరికి అందచేసే బాధ్యతను బాబా నామీద మోపారు. ఇందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆయన రచనలు ప్రచురింపబడతాయని శ్రీసాయిబాబావారు దాదాపు
15 సంవత్సరాల క్రితమే ఆయనకి సందేశమిచ్చారు.
దాని ఫలితంగా ఆయన అనుభవాలను నేను తెలుగులోకి అనువదించే అదృష్టం బాబావారు నాకు
కలిగించారు. బాబా ఆయనకు ఇచ్చిన అనుభవాలను,
సందేశాలను ‘శ్రీసాయి పుష్పగిరి’ పుస్తకంగాను,
శ్రీసాయే రాముడు, శ్రీకృష్ణుడు, శివుడు అనే వివరణలతో ‘శ్రీసాయి మందారమకరందాలు’ పుస్తకంగాను
ప్రచురింపబడ్డాయి. మరలా బాబా ఆయన పుట్టిన రోజు (24.04.2017) సందర్భంగా మరొక పుస్తకాన్ని రచించమని ఆదేశం ఇవ్వగానే ఆయన కార్యాచరణలో పెట్టి
సంకలనం చేసే బాధ్యతను, ముందుగా బ్లాగులో ప్రచురించే బాధ్యతను నాకప్పగించారు. ఈ ఆధునిక యుగంలో మానవత్వం మరుగున పడిపోతోంది. మానవత్వమా నీవెక్కడా అని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్లనే బాబా గారు మనలో ఉన్న మానవత్వాన్ని మరలా
మేలుకొలిపే ఉద్దేశ్యంతో మనలని మంచి మార్గంలో నడిపించడానికి ఆయనకి మరొక పుస్తకం రాసే
బాధ్యతని అప్పగించారు. సాయిబానిస గారు సాయి
దర్బార్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వారు చేసిన సేవా కార్యక్రమాలను ఈ పుస్తకం ద్వారా
మనకందించారు. సాయిబానిస గారు చేసిన సేవా కార్యక్రమాలను
చదివినపుడు ఆయన శ్రీసాయి సత్ చరిత్రలోని విషయాలను, బాగా ఆచరణలో పెట్టినట్లుగా నాకనిపించింది. అందువల్లనే బాబావారు ఆయనకు ఎన్నో అనుభవాలను, అనుభూతులను,
సందేశాలను ప్రసాదించారు. వాటిని చదివిన తరువాత
మనం కూడా ఆవిధంగా ఆచరించలేమా, ఆచరించి బాబాకు దగ్గరగా ఉండగలము కదా అని అనిపించక మానదు. ఇది సాయిబానిస గారిని పొగడటం మాత్రం కాదు. ఆయనతో నాకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఉన్నది ఉన్నట్లుగా
నేను చెపుతున్న విషయాలు. ఈ పుస్తకంలో ప్రచురించిన
విషయాలు మీరు ఇంతకుముందు ఆయన అనుభవాలలో చదివి ఉండవచ్చు. కాని ఇప్పుడు మరలా ఇవ్వడానికి గల కారణం, మానవత్వం
అన్నది మన మన్సులోనుండి ఏవిధంగా వస్తుంది, దానికి అనుగుణంగా మన ప్రవర్తన ఎలా ఉండాలన్న
దానికి సమగ్ర వివరణ కోసమే. ఈ పుస్తకాన్ని చదివిన
తరువాత వాటిలోనివి మనం కొన్నయినా ఆచరణలో పెడితే క్రమక్రమంగా అన్నిటినీ అలవరచుకోవడానికి
ఆస్కారమేర్పడుతుంది. ఇక ఈ పుస్తకంలోని రెండవ
భాగంలో సాయిబానిస గారు శ్రీసాయి సత్ చరిత్రపై పూర్తి అవగాహన కలిగించడానికి అధ్యాయాల
వారీగా తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలు ఉన్నాయి.
అవి కూడా చదివితే మనకు శ్రీసాయి సత్చరిత్ర మీద పూర్తి అవగాహన ఏర్పడుతుండనడానికి
ఎటువంటి సందేహం లేదు.
నిజాంపేట, హైదరాబాద్ త్యాగరాజు
సెల్ 9440375411
18.05.2017
సెల్ 9440375411
18.05.2017
1. దీపావళి – పనిపిల్ల కళ్ళలోని నిజమైన వెలుగులు
నేను 1989 వ.సంవత్సరం జూలై నెలనుండి శ్రీసాయి
చూపిన మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించాను.
అది 1991వ.సంవత్సరం దీపావళి రోజు. ఉదయం
మా పనిమనిషి గంగమ్మ తన చిన్న కుమార్తె రేణుకతో వచ్చి వీధిలో ముగ్గులు వేయసాగింది. ఆ సమయంలో ఆ పనిపిల్ల రేణుకకు నాపిల్లలతో సమానంగా
టపాసులు కొని ఇవ్వాలని మనసులో తలచాను. ఆ పిల్లతో
ఈ రోజు మధ్యాహ్నము నీకు టపాసులు కొని నీ ఇంటికి తెచ్చిస్తానని మాట ఇచ్చాను. ఇది ఉదయము 7 గంటలకు జరిగిన సంఘటన. కాని నేను నా పిల్లలకు మధ్యాహ్నము టపాసులు కొని
ఇంటికి తెచ్చాను. పనిపిల్ల రేణుక విషయాన్ని
పూర్తిగా మర్చిపోయాను.
సాయంత్రం
6 గంటలకు నాపిల్లలు టపాసులు కాల్చుతున్న సమయంలో నేను పనిపిల్ల రేణుకకు ఇచ్చిన మాట గుర్తుకు
వచ్చింది. వెంటనే నేను నాపిల్లలకు కొన్న టపాసులలో
కొన్ని తీసుకొని నా స్కూటరుమీద రేణుక తండ్రి పనిచేస్తున్న కంపెనీ దగ్గరకు వెళ్ళి రేణుక
తల్లిదండ్రుల ఇంటి చిరునామా తెలుసుకొని కుషాయిగూడలోని వారింటికి వెళ్ళాను. వారు ఉంటున్నది ఒక చిన్న రేకులషెడ్. నేను వారి ఇంటికి వెళ్ళేసరికి చిన్నారి రేణుక నాగురించి
ఎదురు చూస్తూ ఉంది. నన్ను చూడగానే సంతోషముతో
తన తల్లితో “అమ్మా సారు వచ్చినాడే” అని గట్టిగా పిలిచింది. నేను ఆమెకోసం తెచ్చిన టపాసులను ఆమెకి ఇచ్చాను. ఆ సమయంలో చిన్నారి రేణుక కళ్ళలో నిజమైన దీపావళి
వెలుగులను చూసాను. ఆమె తల్లి గంగమ్మ నాకు నమస్కరిస్తూ,
ధన్యవాదాలు తెలియచేసింది.
ఈసంఘటన
తలచుకొన్నప్పుడు నాకు శ్రీసాయి సత్ చరిత్ర 20వ.అధ్యాయంలో బాబా, కాకాసాహెబ్ దీక్షిత్
యొక్క పనిపిల్ల ద్వారా దాసగణుమహరాజ్ కు ఈశావాస్యోపనిషత్తుకు అర్ధము తెలియచేసిన సంఘటనను
గుర్తు చేసుకొంటూ ఉంటాను. ఆనాడు కాకా పనిపిల్ల
దాసగణు మహరాజ్ కు ఈశావాస్యోపనిషత్తు బోధించింది.
ఈనాడు చిన్నారి రేణుక నాకు దీపావళి రోజున ఆమె కండ్లలో నిజమైన వెలుగులు చూపించింది. ఆమె తల్లి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో ఇంకా
మానవత్వము బ్రతికే ఉంది అనే భావన నాకు కలిగింది.
సమాజంలో
ఇంకా బ్రతికియున్న మానవతా దేవతకు నమస్కరించాను.
జైసాయిరామ్
(రేపటి సంచికలో మరికొన్ని మానవతా విలువలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment