07.07.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సురేష గారు పంపించిన బడేబాబా గురించి ఆఖరి భాగం తెలుసుకుందాము.
బడేబాబా - 2
అతిధి దేవోభవ
సాయిబాబా బడేబాబాను అతి గారాబంగా చూసుకునేవారు. బాబా అతనిని చాలా ప్రేమగా 'బడేమియ' అని పిలిచేవారు. అతన్ని అతిథిగా గౌరవించేవారు. మసీదులో బాబాకు కుడి వైపున కూర్చునేవాడు బడేబాబా. బాబా యొక్క దర్బార్ లో, అతనికి అతిధిగా ఎంతో గౌరవం యివ్వబడేది. ఉదయం అల్పాహారం నుండి మధ్యాహ్నం భోజనం వరకు బడేబాబా మసీదులో ఉండేవాడు. సాయిబాబా అతనిని తన దగ్గర కూర్చోబెట్టుకొని తన చేతులతో ఆహారాన్ని వడ్డించేవారు. సాయిబాబా అతనిని బుజ్జగిస్తూ తినిపించేవారు.
భక్తులందరూ బాబా ముందు వివిధ రకాలయిన భోజన పదార్ధాలు సమర్పించేవారు. ఆయన ఆ భోజన పదార్ధాలనుండి మొదట కొంత భాగాన్ని తీసి బడేబాబాకు యిచ్చేవారు. తరువాత మిగిలిన భక్తులకు పంచేవారు. భోజనం సమయంలో కూడా బడేబాబా మొదటగా ఆహారాన్ని తీసుకోకపోతే, బాబా తమ భోజనం ప్రారంభించేవారు కాదు. అయితే, దురదృష్టవశాత్తూ, బడేబాబాకు బాబా యిచ్చిన ప్రాముఖ్యత కారణంగా అతనిలో అహంకారం వచ్చింది. అందువల్ల భక్తులందరూ అతని ప్రవర్తనని అసహ్యించుకునేవారు.
భోజనం వడ్డించే సమయానికి ముందుగా, బడేబాబా వచ్చి దిగువ సభ మండపంలో కూర్చునేవాడు. ఈ విధంగా ప్రతిరోజూ జరుగుతూ వుండేది. బాబా 'బడే మియా' అని పిలవగానే, అతడు మశీదు మెట్లెక్కి బాబా కుడి వైపున తనకోసం వుంచిన భోజన పళ్ళెం ముందు కూర్చునేవాడు.
ఒకసారి దీపావళి పండుగరోజున కొన్ని కారణాలవల్ల బడేబాబా మనసు బాగుండక ఎప్పటిలాగే సభా మండపానికి రాలేదు. ఆ రోజు, అనేక మంది భక్తులు రకరకాల మధురపదార్ధాలను తీసుకొని వచ్చారు.. ఆహారాన్ని వడ్డించిన తరువాత, బాబా, బడేబాబాను పిలిచారు. కానీ, అతను ఎక్కడా కనిపించలేదు. బడేబాబా ప్రక్కన లేకుండా బాబా భోజనం చేయడానికిష్టపడలేదు. అందరూ వేచి చూస్తూ ఉన్నారు.
ఆఖరికి ఒక భక్తుడు బడేబాబా ఎక్కడ ఉన్నాడో వెతికి మశీదుకు తీసుకొని వచ్చి, బాబా కుడి వైపున అతని స్థానంలో అతనిని కూర్చుండబెట్టారు.
అప్పుడు భోజనం మొదలైంది. ఆహారాన్ని అవమానించిన వ్యక్తికి చాలా ప్రాముఖ్యత యివ్వబడిందని విడ్డూరంగా కనిపించవచ్చు. కానీ, బాబా తన భక్తులను చేరదీసే మార్గాలు చాలా ప్రత్యకమైనవి. బాబా ఆవిధంగా స్వయంగా చేసి చూపించారు.
తరువాతి సంవత్సరాలలో, బాబాకు నైవేద్యంగా సమర్పించడానికి ప్రతిరోజూ 100-125
పాత్రలదాకా షిర్డి మరియు యితర ప్రాంతాల నుండి భక్తులు తీసుకుని వచ్చే పదార్ధాలతో నిండిపోయేవి.
కొన్ని రోజులు, బాబా, బడేబాబాను చపాతీలను, భకారి వీటిని ముక్కలు చేసి రెండిటినీ కలపమని ఆదేశించేవారు. భక్తులందరూ దానిని బాబా ప్రసాదంగా భక్తితో స్వీకరించేవారు. అది ఎంతో రుచికరంగా ఉండేది. భక్తులు ఎంతో యిష్టంగా తినేవారు. కొన్ని సందర్భాలలో, బాబా భక్తులను మందలిస్తూ 'బడే బాబా చేత ముట్టబడిన ఈ ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు? అతడు ముస్లిం కదా!' అని అనేవారు. అప్పుడు భక్తులు ''బాబా ఈ స్థలం మరుయు ఈ ఆహారం సర్వశక్తిమంతుడైన దేవుడుకి చెందినవి'' అని చెప్పేవారు. దీనికి బాబా "అవును. ఈ స్థలం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతా అతనికి చెందినది. అందువల్ల, మీరు ఎప్పుడూ వివిధ మతాలను మరియు కులాలను భిన్నంగా చూడరాదు'' అని అన్నారు.
అత్యధికంగా యివ్వబడే దక్షిణ యొక్క ప్రాముఖ్యత
ప్రతిరోజూ, భక్తులు బాబాకు సమర్పించుకునే దక్షిణ రూ .400 నుండి రూ .500 దాకా ఉండేది. ఆ మొత్తాన్నిబాబా భక్తులకు పంచేసేవారు. సాయంత్రానికల్లా ఆయన జేబులు ఖాళి అయిపోయేవి. ఆయన లెక్కపెట్టకుండా జేబులో చేయిపెట్టి చేతికొచ్చినంత యిచ్చి వేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది. ఈ విధంగా బాబా నిత్యం దాదాకేల్కర్, బడేబాబా, సుందర్ బాయి, లక్ష్మిబాయి, తాత్యాపాటిల్ భాగోజీ మొదలైన భక్తులకు ప్రతిరోజూ నిర్దిష్టంగా కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. అయితే, గరిష్ట మొత్తాన్ని పొందే గౌరవం (రూ. 30 నుండి రూ. 55) బడే బాబాకు దక్కింది. (పవిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ప్రకారం బడే బాబా కి 50 రూపాయలు ముట్టేది).
'బాబా నుండి అంత పెద్ద మొత్తం పొందుతూ వున్న ఫకీర్ లాంటి బడే బాబా ఏమి చేసుకుంటాడు' అనే ప్రశ్న షిర్డీ గ్రామవాసుల మనుల్లో మెదిలింది. అందువల్ల వారు గ్రామానికి ప్రధాన ప్రవేశద్వారం నిర్మాణం కోసం డబ్బులు యిమ్మని బడేబాబాని అభ్యర్థించారు. అయితే, బడేబాబా వారి అభ్యర్థనను తిరస్కరించాడు. అందువల్ల, గ్రామస్తులు అతనిని గ్రామంలోనికి అడుగుపెట్టికుండా నిషేధించారు. అందుచేత అతను వెళ్ళి, నీంగావ్ లో నివసించాడు. ఈ సమస్యనుండి తప్పించుకోవటానికి బాబా ప్రతిరోజూ బడే బాబాను నల్లా ఏటి ఒడ్డున కలుసుకుని అతనికి రోజు తాను యిచ్చే డబ్బులు అందజేసేవారు. బాబాను చాలా అసౌకర్యానికి గురిచేస్తున్నామని గ్రామస్తులు గ్రహించి, మళ్ళి బడేబాబాను షిర్డీకి రప్పించారు.
బడేబాబా ప్రవర్తన
పైన జరిగిన సంఘటన తరువాత, గ్రామస్తులు బడేబాబా ముందు తలవంచుకుని వెడుతూవుండేవారు. గ్రామస్తులందరు తన దగ్గరకు చేతులు కట్టుకొనిరావడంతో అతనికి మరింత గర్వం పెరిగింది. బాబా మాత్రం ఎల్లప్పుడూ బడేబాబాను గౌరవంతో చూచేవారు. అయితే, బడేబాబా తను ఎంతో అధికుడిననే భావంతో చపలచిత్తంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను బాబా అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోనేవాడు. కనీసం యితరులతో బాబా గురించి మాట్లాడేటప్పుడయినా
జాగ్రత్తగాను, మర్యాదగాను బడేబాబా మాట్లాడితే బాగుంటుందని భక్తులు భావించేవారు. కానీ, అతను మాటలాడేమాటలు అహంకారంతో నిండి వుండేవి.
ఒకసారి, బాబా భక్తుడు శ్రీ రఘువీర్ భాస్కర్ పురందరే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధవలన రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. అదే స్థితిలో అతను బాబా వద్దకు వెళ్ళాడు. బాబాకు సమీపంలోని కూర్చున్న బడేబాబా బాబాతో కఠినంగా ''పురందరే తీవ్రమైన తలనొప్పితో రాత్రంతా బాధపడ్డాడు. అతన్ని చూడు. అతన్ని యింకా బాధపడేలా చేయకండి” అన్నాడు. ఇలాంటిదే మరొక సంఘటన. ఒకసారి, బాబా, పురందరే వలన చాలా కలత చెందారు. . అందువలన, పురందరే ప్రత్యేకంగా తీసుకువచ్చిన మంచి పరిమళాన్ని వెదజల్లే పూల మొక్కలను నాటడానికి బాబా ఒప్పుకోలేదు. దీనిని గమనించిన బడేబాబా ''పురందరేమీద మీకెందుకంత కోపం”? అతను మీ కోసం రాత్రి-పగలు పరితపిస్తున్నాడు.
మీ సేవలో అన్నపానీయాలు కూడా మరచిపోతాడు. మీరు కూడా అతనిని ఎప్పుడూ తలచుకుంటూ ఉంటారు. కానీ, అతను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు కలత చెందుతున్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ వింత ప్రవర్తన ఏమిటి?'' అని ప్రశ్నించాడు.
ప్రతిరోజూ భోజనమైన తరువాత బడేబాబా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా అతనితో కొంత దూరం నడిచి వెళ్లి సాగనంపేవారు. అతనిలో గర్వం పెరిగిన తరువాత, బడేబాబా 'అచ్చా. నేను యిప్పుడు బయలుదేరుతున్నాను.
మీరు వస్తున్నారా లేదా?'' అని కాస్త అహంకార దర్పంతో అనేవాడు. బాబా అతని మాటలలో ఎటువంటి తప్పు పట్టేవారు కాదు. కానీ మౌనంగా లేచి అతనిని సాగనంపేవారు.
ప్రారంభంలో, భక్తులు ఆరతికి సన్నాహాలు చేసేటప్పుడు, బడేబాబా లేచి క్రింద సభా మండపంలోకి వెళ్ళిపోయేవాడు. అతను అరతిలో పాల్గొనేవాడు కాదు. తరువాత, కాకాసాహెబ్ దీక్షిత్ నచ్చచెప్పిన తరువాతనుండి అతను సభా మండపానికి వెళ్ళేవాడు కాదు గాని ఆరతిలో మాత్రం పాల్గొనకుండానే గడిపాడు. చాలామంది హిందూ భక్తులకు అతని ప్రవర్తన యిష్టం లేకపోయింది. అయినప్పటికీ, కాకసాహెబ్ ప్రేమస్వభావంతో బడేబాబా యొక్క ప్రవర్తనను పట్టించుకోవద్దని హిందూభక్తులను అనునయించారు. “సాయిబాబా బడేబాబాని తన వానిగా అంగీకరించారు. అందువలన, అతను మనలో ఒకడు. అందువలన అతను మననుండివేరు అనే ప్రశ్న ఉదయించదు?' అని కాకా దీక్షిత్ అన్నారు.'
బడేబాబాలో పెరిగిన అహంకారం మిగతా భక్తులకు విసుగు తెప్పించింది. వారు అతన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల వారు బడేబాబా ఉండటానికి వారి గదులను కూడా యిచ్చేవారు కాదు. ఆఖరికి, కాకాసాహెబ్ వాడాలోని గదులలో ఒకదానిలో ఉండటానికి అనుమతి యిచ్చారు. కాబాసాహెబ్ "బాబా చేత అంగీకరించబడిన ప్రతివారిని మనలో ఒకరిగా చూడాలి" అని చెప్పారు.
సత్పురుషులతో సమయాన్ని గడపగలిగే అదృష్టం ఏకొద్దిమందికో లభిస్తుంది. కానీ, వారు కూడా అహంకారాన్ని అధిగమించడానికి కష్టపడి ప్రయత్నించాలి.
బాబా, బడేబాబాని తన ప్రియమైన వారిలో ఒకరిగా చూశారు. అతిధులు మరియు స్నేహితులకి యిచ్చే గౌరవాన్ని బాబా అతనికిచ్చారు. బడేబాబా కోసం బాబా తన ప్రక్కనే స్థానాన్ని కేటాయించి వుంచేవారు. చాలా ఎక్కువ మొత్తమే బాబా అతనికి యిస్తూ వుండేవారు. పరమేశ్వర ప్రాప్తికోసం కోసం బడేబాబాకు అనేక అవకాశాలు బాబా యిచ్చారు. కానీ, బడేబాబా తన అహం కారణంగా అన్ని అవకాశాలను వృధా చేసుకున్నాడు.
డబ్బు యిచ్చేటప్పుడు, బాబా ఎప్పుడూ ఈ విధంగా హెచ్చరిస్తూ వుండేవారు, '' ఈ డబ్బు అల్లాకి చెందినది. ఈ డబ్బుతో నీ ఆకలి బాధను తీర్చుకో. కాని అనవసరంగా ఖర్చుపెట్టకు.” సాయి బాబా యిచ్చిన డబ్బును మన స్వార్ధం కోసం ఉపయోగించుకోకూడదు.
ఇతరుల క్షేమం కోసం ఖర్చుపెట్టేవారు, అభివృధ్ధిలోకి వస్తారు. బడేబాబా జనవరి 1926లో నాగపూర్ లో మరణించారు.
భక్తులందరికీ ఒక గుణపాఠాన్ని తెలియచేయడానికే బడేబాబాను ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారు
సాయిబాబా.
ఆ కాలంలో శ్రీ సాయిలీలా మాసపత్రికకు సంపాదకునిగా ఉన్న శ్రీ కాకాసాహెబ్ మహాజని తన వ్యాసంలో ఈవిధంగా వ్రాశారు - "మహారాజు తన బోధనలను తెలియచేయడానికి ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన పధ్ధతులు వున్నాయి. అటువంటి పద్దతిలో ఫకీర్ బాబా(బడే బాబా) షిర్డీలో నివాసం వుండటం మరియు అతనియందు బాబా యొక్క ప్రవర్తన. ఈ ఉదాహరణ నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు.''
(Source: Shri
Sai Satcharitra Chapter 23 and Shri Sai Leela Magazine September-October 2008
and November-December 2008)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment