03.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయి బంధువులకు తొలి
ఏకాదశి శుభాకాంక్షలు
ఈ రోజు మరొక అధ్భుతమయిన
సాయి మహిమను తెలుసుకుందాము. తెలుసుకునే ముందు
రేపు తొలిఏకాదశి సందర్భంగా దాని గురించి కూడా కొంత తెలుసుకుందాము. దీనికి సంబంధించిన సమాచారమ్ వికీపీడియా నుండి గ్రహింపబడినది.
తొలిఏకాదశి
ఏ మంచిపని ప్రారంభించినా
దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ
శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం
కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది
తొలి ఏకాదశి.
పురాణ నేపథ్యం
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు.
స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని
నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే "ఏకాదశి"
అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
సాంఘిక అంశం
ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బధ్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.
నామ జప మహిమ
ఈ అధ్భుతమైన లీల సాయి
లీలా మాసపత్రికలో ప్రచురింపబడిన సాయిభక్తుల అనుభవాలలోనిది.. సాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడినది. శ్రీ డి. శంకరయ్యగారు ఆంగ్లంలో వ్రాసిన దానికి తెలుగు అనువాదం మీకు అందిస్తున్నాను…ఓమ్ సాయిరామ్
1982 వ. సంవత్సరంలో,
గుంటూరులోని సాయిభక్తులు షిరిడీలో సాయినామ సప్తాహాన్ని పూర్తిచేసిన తరువాత
11.12.1982 లో గుంటూరులోని ఆర్. అగ్రహారంలోని సాయిమందిరంలో సాయి అఖండనామ సప్తాహాన్ని
నిర్వహించారు.
ఆ సాయి నామ సప్తాహంలో
పాల్గొన్న భక్తులందరి మీద వారిలో ఉన్న శ్రధ్ధాభక్తులను బట్టి సాయిబాబా తమ దయను, అనుగ్రహాన్ని
కురిపించారు. అటువంటి రెండు సంఘటనలను యిప్పుడు
వివరిస్తాను.
గుంటూరులో సాయిభక్తురాలయిన
శ్రీమతి వరలక్ష్మమ్మగారు క్రమంతప్పకుండా సప్తాహంలో పాల్గొంటు ఉండేవారు. అఖండనామ సంకీర్తన జరుగుతూ ఉంది కాబట్టి బాబా స్వయంగా
తన నామసంకీర్తనకు తప్పకుండా వచ్చే ఉంటారని భావిస్తూ ఉండేది ఆమె. ఆమెకు బాబామీద అంత
గట్టి నమ్మకం. ఎక్కడయితే నా నామసంకీర్తన జరుగుతూ
ఉంటుందో అక్కడ తానుంటాననే విషయాన్ని శ్రీమహావిష్ణుమూర్తి నారదమహామునికి చెప్పిన విషయం
ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. మన సాయినారాయణుల
వారు కూడా ఎక్కడయితే తన నామ జపం జరుగుతూ ఉంటుందో అక్కడ తానుంటాననే విషయాన్ని ఋజువు
చేశారు. ఒకరోజు విరాళాలు యిచ్చినవారి పేరు మీద
పూజ జరిగింది. సప్తాహంలో సమర్పించిన ప్రసాదం
నాలుగు పొట్లాలు ఆమెకు యివ్వడం జరిగింది. బాబా ఆమె ముందు ప్రత్యక్షమయి తనవంతు ప్రసాద
భాగాన్ని యిమ్మని అడిగారు. ఆమె వెంటనే తన ప్లాస్టిక్
బ్యాగులో వేసుకున్న నాలుగు పొట్లాలలోనుండి ఒక పొట్లం తీసి ఆయనకు యిచ్చారు. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అకస్మాత్తుగా సాయి అదృశ్యమయ్యారు. ఆ తరువాత ఆమె తన బ్యాగులో ఉన్న పాకెట్లను లెక్కచూస్తే
మూడే వున్నాయి.
(శ్రీమతి పూలమ్మగారు)
ఆవిడ వెంటనే మాతృశ్రీ
పూలమ్మగారి వద్దకు వెళ్ళింది. ఈ పూలమ్మగారు
ఆంధ్రదేశమంతటా సాయిప్రచారాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చిన సాయిసేవిక. ఆవిడ పూలమ్మగారికి జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. పూలమ్మగారి అసలు పేరు చుండూరు కామేశ్వరమ్మ. ఆమె సాయిపూజ చేస్తున్నప్పుడెల్లా ఆమె చేతిలోని పూలు
రెట్టింపు అవుతూ ఉండేవి. అందువల్లనే భక్తులందరూ
ఆమెను ప్రేమతో పూలమ్మ అని పిలుస్తూ వుండేవారు.
ఆమె తన స్వగ్రామమయిన నందూరులో సుదరమయిన సాయిమందిరాన్ని నిర్మించింది. నీ ఆలోచనలకు భావాలకు అనుగుణంగానే బాబా నీకు దర్శనమిచ్చారని
పూలమ్మగారు వరలక్ష్మమ్మతో చెప్పారు.
మరొక భక్తురాలయిన శ్రీమతి
కన్న రంగనాయకమ్మ శ్రీసాయినిలయ, శ్రీనివాసరావు తోట, గుంటూరులో ఉన్న వారి యింటిలో గోడకు
తగిలించి వున్న బాబా ఫొటోలో నీటి బిందువులు కనిపించాయి. మరునాడు మాలో కొంతమందిమి ఆమె యింటికి వెళ్ళి చూశాము. బాబా ఫొటోకు, పైన ఉండే గాజు పలకకు మధ్య నీటి బిందువులు
కనిపించాయి. దానికి కారణమేమిటని నేను అడిగాను. అపుడామె “ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి” అనే నామ
సప్తాహానికి బాబా సంతోషించి కార్చిన ఆనందభాష్పాలని వివరించారు.
అందువల్ల సాయిభక్తులందరికీ
నేను చేసే మనవి ఏమిటంటే మీరు మీ మీ గృహాలలో బాబావారి ఏకనామ సప్తాహాన్ని నిర్వహించండి. వారంరోజులపాటు జరిగే ఆనామ జపంలో సాయి ఏవిధంగా ప్రకటితమవుతారో
మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ‘ఓమ్ సాయి
శ్రీసాయి జయజయ సాయి’ అనే నామాన్ని ప్రయత్నించి చూడండి.
డి.శంకరయ్య
హైదరాబాద్ - 500004
(నా ఉద్దేశ్యం ప్రకారం సాయి నామాన్ని ఏ విధంగా జపించినా సమానమైన ఫలితమే ఉంటుంది. కాని నామ జపం చేసేటప్పుడు మనం ఏమి ఉఛ్ఛరిస్తున్నామో వినేవాళ్ళకి స్పష్టంగా వినపడాలి. ... త్యాగరాజు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment