21.09.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
ఈ రోజు 1918 వ.సంవత్సరానికి ముందు బాబా లీలల గురించి శ్రీ కృష్ణశాస్త్రి భీష్మ గారు తన ఉత్తరంలో వ్రాసిన విషయాలను ప్రచురిస్తున్నాను. దీనిని షిర్డి సాయి సేవా ట్రస్ట్ , చెన్నై వారి నుండి గ్రహింపబడింది.
దసరా సందర్భంగా ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమ్
1918 కు ముందు శ్రీ బాబా లీల – భీష్మ ఉత్తరమ్ - 1
శ్రీ సద్గురు సాయినాధ
సగుణోపాసన శ్లోకాలను రచించిన శ్రీ వేదశాస్త్రి కృష్ణ శాస్త్రి భీష్మ గారు
11.07.1921 న వ్రాసిన ఉత్తరంలోని కొన్ని సారాంశాలు.
శ్రీసాయి మహరాజ్ తో నాకు
కలిగిన అనుభవాలు నా సన్నిహితులందరికీ బాగా తెలుసు. అందువల్ల నేను రాసే ఈ ఉత్తరంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఒకవేళ భక్తులందరికీ ఈ అనుభవాలు తెలిసి ఉన్నా లేక
చదివే ఉన్నా వీటిని ప్రచురించవద్దు.
సాయినాధ్ మహరాజ్ కు దివ్య
దృష్టి, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. నేను దీనిని
భూతకాలంలో రాస్తున్నప్పటికీ అది నశ్వరమయిన శరీరానికి సంబంధించి మాత్రమే. నాకు మాత్రం సాయినాధులవారికి మరణమనేదే లేదని నమ్ముతాను. ఆయన సజీవులు, దానికి కారణం ఆయన నాకు నిరంతరం దర్శనాలను
అనుగ్రహిస్తూ ఆయన కోరుకున్నట్లుగా నడిపిస్తూ ఉన్నారు. నేను చెప్పేదంతా అబధ్ధం కాదు.
ఒకరోజు సాయంత్రం మేము
సాయినాధులవారి దగ్గరే కూర్చుని ఆఖరి ఆరతి శేజారతిని కూడా జరిపాము. కాని ఆ మరుసటిరోజు మేము ఆయనని దర్శించుకోవడానికి
వెళ్ళినపుడు సాయిబాబా “నిన్న సాయంత్రం నేను నడకకి వెళ్ళాను” అన్నారు. బాబా అన్న మాటలకి మాకు నమ్మకం కలగలేదు. ఆయన నిన్న సాయంత్రం నుంచి శేజారతి వరకు మాతోనే ఉన్నారు.
ఆ తరువాత కొద్ది నిమిషాలలోనే షిరిడీకి దక్షిణం వైపు
ఉన్న గ్రామంనుండి ఒక వ్యక్తి వచ్చాడు. “నిన్న
సాయంత్రం సాయి మహరాజ్ మా గ్రామంలోనే ఉన్నారు” అని చెప్పాడు. సాయిబాబాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయనీ ఆయన ఒకే
సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాలలో ఉండగలరనే విషయం మాకర్ధమయింది.
ఒకసారి బల్వంతరావు ఖాపర్దే
యింటిలో అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో
సాయి అతని కలలో కన్పించి అతనితో కలిసి భోజనం చేసి, ఊయల మీద కూర్చుని కిళ్ళీ వేసుకుని
ఆతరువాత నిష్క్రమించారు. అపుడు బల్వంతరావుకు
మెలకువ వచ్చి లేచాడు. మరుసటిరోజు ఉదయం తనకు
వచ్చిన కలగురించి నాకు చెప్పారు. అపుడు నేను
“నీకు వచ్చిన కల గురించి మరెవరికీ చెప్పకుండా తిన్నగా సాయిమహరాజ్ వద్దకు వెళ్ళు. సాయిబాబా నీకు ఈ విధంగా దర్శనమిస్తే కనక ఆయన నీకు
ఏదో ఒక సూచన చేస్తారు. ఒకవేళ నీకు అది మామూలుగా
వచ్చిన కలయితే సాయిబాబా దీనిగురించి ఏమాటా మాట్లాడరు” అన్నాను. బలవంతరావు సాయిబాబా వద్దకు వెళ్ళాడు. అపుడు సాయిబాబా "నువ్వు నిన్నరాత్రి నాకు భోజనం పెట్టావు
గాని, నాకు దక్షిణ ఏమీ యివ్వలేదు” అన్నారు.
బల్వంతరావు నిర్ఘాంతపోయాడు. దక్షిణ
ఎంత యిమ్మంటారని వెంటనే అడిగాడు. 25/- రూపాయలు
ఇమ్మని అడిగారు బాబా. కొంతమంది ఈ కధలన్నీ అవాస్తవాలు అనుకుంటారు. కాని, యశ్వంత్ వెంకటేష్ కొధాట్కర్, B.A.L.L.B గారు
తాను రచించిన పుస్తకం ‘శ్రీమధ్భాగతార్ధ్ దర్శన్' లో ఆత్మ ఎన్నో అధ్భుతాలను చేయగలదని
నిరూపించారు.
ఆత్మకి నాశనం లేనపుడు,
మేలుకొని ఉన్నపుడు గాని స్వప్నంలో గాని దర్శనమివ్వడం బాబాకు అసాధ్యమెందుకవుతుంది? “జాగత్ రామా, సోవత్ రామా, సప్నోంమే దేఖో రామా హి
రామా “ అని సంత్ ఏకనాధ్ చెప్పినట్లుగా సాయినాధులవారు తను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు
దర్శనమివ్వగలరు. ఛాందోగ్య ఉపనిషత్ 8 వ.అధాయం
వాల్యూమ్ 3, నాలుగవ శ్లోకంలో, పరమానందాన్ని పొందిన ఈ ఆత్మ కొన్ని సార్లు శరీరాన్ని విడచి
ఆత్మసాక్షాత్కారాన్ని పొంది పరబ్రహ్మతో ఏకమవుతుంది. కాని ఆత్మ అపస్మారకస్థితిలో శరీరాన్ని విడిచివెళ్ళవలసినవసరం లేదు. సాయిమహరాజ్ గారికి ఆయన భావాలు,
కోరికలు పూర్తిగా ఆయన నియంత్రణలోనే ఉంటాయి.
అందువల్లనే ఆయన నిరంతరం ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అయన నిద్రించే స్థలం నుండి మసీదుకు వెళ్ళేటపుడు
చేతిలో సటకా పట్టుకుని తిట్లు తిడుతూ ఉండేవారు.
ఆసమయంలో ఎవరికీ ఆయన ఎదుట నిలిచే ధైర్యం ఉండేది కాదు. కాని బాబా హెచ్చు స్వరంతో బిగ్గరగా యిటువంటి నిరర్ధకమయినవాటిని
పలుకుతున్నపుడెల్లా ‘అల్లా నీకు మేలు చేస్తాడు’ అనే మృదువయిన మాటలు వినిపిస్తూ ఉండేవి. అటువంటి ఆగ్రహంతో ఉన్నప్పుడు కూడా ఏ మానవుడు అటువంటి
ఆశీస్సులను అందచేస్తాడు? అందువల్లనే ఆయన చూపించే
కోపం అంతా పైపైనే అని నా అభిప్రాయం. కాని ఆయన
మనసులో ఎంతో దయ ప్రశాంతత నిండి ఉంటాయి.
తుకారాం గాధలోని
4274 వ.శ్లోకంలో భగవంతుడు తన భక్తుల కష్టాలన్నిటినీ తానే భరించి, వారికి ఎల్లపుడు చేరువగా
ఉంటాడని చెప్పబడింది.
ఒకరోజున మేమంతా సాయిమహరాజ్
ప్రక్కనే కూర్చుని ఉన్నాము. అపుడు మధ్యాహ్న
ఆరతికి సమయం అయింది. ఆరోజుల్లో సాంప్రదాయం
ప్రకారం బాపూ సాహెబ్ ఆరతిని సిధ్ధం చేశాడు.
అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండానే సాయిమహరాజ్ నృసింహావతారాన్ని ప్రదర్శించారు. ఆరతి పళ్ళాన్ని ప్రసాదాన్ని విసిరేసారు. భక్తులందరినీ తన సటకాతో కొడుతూ తరిమేసారు. ఆయన తన ఆసనంనుండి లేచి కింద వరండాలో కూర్చున్నారు. బాబాకి ఆరతిని ఇవ్వడం సాధ్యపడలేదు. అప్పటికి సాయంత్రం 3 గంటలయింది. భక్తులందరూ చాలా ఆకలితో ఉన్నారు. బాబా కూర్చునే ఆసనానికే ఆరతినిస్తే బాగుంటుందని
ఎవరో సలహా యిచ్చారు. కాని దాదా సాహెబ్ ఖపర్దే
దానికి అంగీకరించక ఆరతిని బాబాకే యివ్వలని చెప్పాడు. కాని బాపూ సాహెబ్ చేత కాకుండా వఝే చేత యిప్పిస్తే
బాగుంటుందని అన్నాడు. ఆవిధంగా ఆరతిని వఝే చేతిలో
పెట్టారు. అంతలోనే అకస్మాత్తుగా బాబా తన ఆసనంలో
కూర్చున్నారు. బాబాకు ఆరతినిచ్చారు. కాని బాబా కోపానికి గల కారణమేమిటో ఎవరికీ అర్ధం
కాలేదు.
(రేపటి సంచికలో బాబా కోపానికి కారణమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment