03.02.2019 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల
సరాలు – 2 వ.భాగమ్
16. డబ్బు ఎక్కువగా ఉన్నవాడు ఇంట్లోవాళ్ళకి, బయటవాళ్ళకి
భయపడతాడు. మనకు డబ్బు మీద ఆకర్షణ ఉన్నప్పుడు
దేవుడు అసత్యం, లోకం సత్యం అనిపిస్తుంది. ఏవిధమైన
ఆకర్షణ లేదనుకోండి, దేవుడు సత్యం, లోకం అసత్యం అని మనకు అనిపిస్తుంది.
17. కష్టాలనుంచి బయట పడటానికి భగవంతుడిని ప్రార్ధించినవాడూ భక్తుడె, డబ్బుకోసం ఇబ్బందిపడి ప్రార్ధించినవాడూ భక్తుడె. జ్ఞాని కూడా భక్తుడె. కానీ, నిజమైన భక్తుడు జ్ఞాని మాత్రమే. మిగతావారు కోరికలతో భగవంతుని ప్రార్ధిస్తారు.
18. మనందరికీ భక్తి అవసరం. జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఆపదలు అన్నీ వస్తూ ఉంటాయి. మనం ఊహించని పరిణామాలు వస్తూ ఉంటాయు. వీటిని అన్నింటిని తట్టుకోవడానికి భక్తి అవసరం. మనం ధనాన్ని, విద్యని ఎలా సంపాదించుకొంటున్నామో అలాగే భక్తిని సంపాదించుకోవాలి. ఎందుచేత అంటే భక్తి అనే నదీ జలం ఉన్నప్పుడు, నదికి వరద వచ్చినప్పుడు దుంగలు ఎలా కొట్టుకొని పోతాయో అలా మనకి వచ్చే కష్టాలు పైన ఉపరితలంలో అలా తేలి వెళ్ళిపోతాయి.
భక్తి ఉన్నప్పుడు అవి ఇబ్బంది పెట్టవు. ప్రతీవారికీ భక్తి అవసరం. జ్ఞానం అవసరం, వివేకం అవసరం. ప్రాణం పోయేటప్పుడు భగవంతుని నామస్మరణ మనసులో ఉంటే పునర్జన్మ ఉండదు.
19. ధర్మార్ధ, కామాలను నియంత్రించుకోవడం కోసం పూజ, జపం,
ధ్యానం అని మహాఋషులు నియమాలను ఏర్పరచారు.
20. ఆధ్యాత్మిక మార్గంలో అభివృధ్దిలోనికి రావాలంటే పునాదిగా కొంత వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా జ్ఞానం రాదు.
21. కర్మ అనుభవించడానికే దేహం వచ్చింది. దేహ ప్రారబ్ధాన్ని బట్టి లాభం వస్తూ ఉంటుంది. నష్టం వస్తూ ఉంటుంది. అదృష్టం వస్తే ఏనుగు మీద కూర్చున్నట్లు ఉంటుంది. దురదృష్టం వస్తే క్రింద పాతాళంలోకి పడిపోయినట్లు ఉంటుంది. ఇదంతా మాయ.
22. మనము ఏదయినా అతిగా తింటాము అనుకోండి, కడుపునొప్పి వస్తుంది. తినేటప్పుడు సంతోషంగానే తింటాము. బాధ అనుభవించినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాము. అప్పుచేసినప్పుడు సంతోషంగా చేస్తాడు. ఇవ్వగలిగి ఉండి కూడా, అప్పు తీర్చేటప్పుడు కష్టంగా తీరుస్తాడు. ఇదే మాయ.
23. సహనంలో సుఖం ఉంది. శాంతి ఉంది. కానీ డబ్బులో సుఖం, శాంతి లేవు. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే పరిసరాలు కూడ ప్రశాంతంగా ఉంటాయి. నీమనస్సులో శాంతి లేనప్పుడు పరిసరాలు అల్లకల్లోలంగా ఉంటాయి.
24. సామాన్య మానవుడు జ్ఞానం పొందాలంటే,
ఒక మహాత్ముని ఆశ్రయించి ఆయనకు సేవచేసి ఆయన అనుగ్రహానికి
పాత్రుడై ఆయన చెప్పిన మార్గం అనుసరించాలి.
భగవంతుడు మనకు దేనిని అనుగ్రహిస్తే దానినే తాను
అనుభవిస్తూ ఇతరులతో కలసి పంచుకోవాలి.
ప్రతీ సంవత్సరం 10 రోజులైనా తానున్న పరిస్థితులకి,
వ్యక్తులకి దూరంగా ఏదయినా పుణ్యక్షేత్రంలో గడపాలి. దాని వలన మనకి దేనిమీద మమకారం ఉందో తెలుస్తుంది.
ఈ విధంగా
జీవించడం వలన జ్ఞానాన్ని పొందగలరు.
నాలుగు రోజులు శాంతిగా ఉంటుంది, నాలుగు రోజులు అశాంతిగా ఉంటుంది ఎందువల్ల.
శరీరంలో
కొన్ని గుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉన్నప్పుడు శాంతిగా ఉంటుంది. రజో, తమో గుణాలు విజృంభిస్తే
అశాంతిగా ఉంటుంది.
25. ప్రాణికోటి అంతా ఆహారంలోకి వస్తాయి. ఆహారం తిని జీవిస్తాయి. ఆహారం తిని చనిపోతాయి. చనిపోయిన తరువాత ఎక్కడెక్కడ జన్మించాలో అది ఎవరి ఇష్టమూ కాదు. ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఎవరి ఇంటి దగ్గర జన్మించాలో, ఆ తల్లిదండ్రులు తినే ఆహారంలో ప్రవేశిస్తాడు. వారి కడుపులో పడతాడు.
26. మనం వంద మాటలు శ్రవణం చేస్తే అందులో ఒక్క మాట మన గుండెకు పట్తుకొంటే చాలు, మనం బాగుపడటానికి జ్ఞానం వస్తుందా? రాదా? అని సందేహం పెట్టుకోనక్కరలేదు. గురువు అనుగ్రహం ఉంటే అంతా సాధ్యమే అవుతుంది.
27. దేహ ప్రారభ్దాన్ని ఇష్టంతో అనుభవించండి. ఇష్టంతో ప్రారబ్ధం అనుభవించడం వలన పునర్జన్మ హేతువులు అన్నీ కాలి బూడిద అవుతాయి.
28. మనం మంచివారం అని అనుకోకూడదు. అలాగే చెడ్డవారము అని కూడా అనుకోకూడదు. మన గురించి మనం ఏమీ అనుకోనప్పుడే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది.
(ఇంకా ఉన్నాయి)
(రేపటి సంచికలో సత్సంగం గురించిన ముత్యాల సరాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment