18.03.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –14 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన సాయి భక్తుల అనుభవాలు - 3
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ
వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ
గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని
ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
ఒక అజ్ఞాత
భక్తుడు వివరించిన అధ్భుతమయిన సంఘటన.. మిని ఫారెస్ట్ జె.పి.నగర్ బాబా మందిరమ్
ప్రభాతవేళ
మందిరానికి వెళ్ళి తలుపులు తెరిచాను. మందిరాన్నంతా
శుభ్రం చేయడానికి పనివాళ్ళు ఎవరయినా వచ్చారేమోనని చుట్టూ చూసాను. కాని, ఆరోజు పనివాళ్ళు ఎవరూ ఇంకా రానట్లుగా ఉంది. ఇక పనంతా నేనే చేసుకోవాలి. కాని నేను నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాను. అందుచేత నేలంతా తుడవాలంటే వంగుని చేయాల్సిందే. బాధపడుతూనే నేల తుడవసాగాను.
కాని భరించలేనంతగా బాధ పెడుతున్న నడుమునొప్పి పని చేయనివ్వటల్లేదు. ఎవరన్నా పనివాళ్ళు సహాయం కోసం వస్తారేమోననే ఆశతో
బయటకు చూసాను. బయట ఒక చిన్న పిల్ల కనిపించింది. ఆ పిల్లకి 8 లేక 9 సంవత్సరాల వయసు ఉండవచ్చు. పరిశుభ్రమయిన మంచి తెల్లటి గౌను వేసుకుని ముచ్చటగా ఉంది. బయట స్థిమితంగా కూర్చుని ఉంది. మందిరమంతా తుడవడానికి
నాకేమన్న సహాయం చేస్తావా అని అడిగాను. ఆ పాప
వెంటనే చేయడానికి ఒప్పుకుంది.
అడిగిన వెంటనే
ఆ పాప పని మొదలు పెట్టింది. ఆ పాప ఎంత చక్కగా
చేసిందంటే పనిమీద ఎంతో శ్రధ్ధ పెట్టి చాలా వేగంగా చేసింది. ఆ పాప పనితనం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. ఎంతో సంతోషమయింది. ఆ పాప చేసిన పనికి తగినంతగా ప్రతిఫలం ఇద్దామనుకున్నాను. కాని ఆమె చేసినట్లుగా అంకితభావంతోను, పరిశుభ్రంగాను.
పరిపూర్ణంగాను ఇంతవరకు ఎవరూ చేయలేదు.
బల్లమీద రెండు
అరటిపండ్లు తీసి ఆమె చేతిలో పెట్టాను. ఆమె
చేసినదానికి ఇంకా కొంత డబ్బు ఇద్దామని ప్రక్కకు తిరిగి బల్ల సొరుగులో వెతుకుతున్నాను. ఆ తరువాత చూస్తే ఆ అమ్మాయి ఎక్కడా కనపడలేదు. అంత
వెంటనే ఆమె ఎలా మాయమయిందో నాకర్ధం కాలేదు.
అది ఊహించడానికే సాధ్యం కాదు. మందిరంనుండి బయటకు వచ్చి చూసాను. బయట ఎక్కడయినా ఉందేమోనని
అన్ని చోట్లా వెతికాను. కాని ఎక్కడా కనపడలేదు. అంత వేగంగా కనపడకుందా వెళ్ళిపోవడం మానవమాత్రుడికి
సాధ్యం కాదు.
మందిరంలోకి
ప్రవేశించడానికి బయట ఆరుబయలు ప్రదేశం ఉంది.
ఒకవేళ ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళినా గాని అంతవెంటనే కనపడకుండా వెళ్ళడం కూడా
సాధ్యపడే విషయం కాదు. అపుడు నామనసుకు తట్టింది. ఆపాప తెల్లటి గౌనులో ఎంతో ముద్దుగా ఉంది. ఆమెకు అప్పగించిన పనిని ఎంతో అంకిత భావంతోను, పరిశుభ్రంగాను చాలా
వేగంగాను పూర్తిచేసింది. డబ్బు ఇద్దామని చూస్తే
ఏమీ ఆశించకుండా మాయమయిపోయింది. తన మందిరంలోనే
బాలిక రూపంలో వచ్చినది బాబా కాక మరెవ్వరు?
నేను నడుము నొప్పితో క్రిందకు వంగి ఏపనీ చేయలేనని బాబా నాకు సహాయపడటానికి ఆరూపంలో ఏతెంచి
తన మందిరాన్ని తనే శుభ్రం చేసుకున్నారు. ఎంతటి
దయామయుడు. ఆయనకు తెలియనిదేముంది. నా ఎదుటనే ఆయన విగ్రహరూపంలో ఆశీనులయి ఉన్నారు. ఆయన ఏరూపంలో కనిపించదలచుకుంటే ఆరూపంలో ప్రత్యక్షమవడానికి
ఒక్క క్షం కూడా పట్టదు. ఆవిధంగా ఆయన తన భక్తులను
కనికరించడానికి, వారిని సంతోషపెట్టడానికి నిరంతరం తన దృష్టిని ప్రసరిస్తూనే ఉంటారు.
అజ్ఞాత భక్తుడు
వివరించిన మరొక అధ్భుతమయిన లీల.
మహాశివుని
గుడిప్రక్కనే జె.పి.నగర్ లో బాబా మందిరం ఉంది.
ప్రతిరోజు బాబాకి కాకడ ఆరతి పూర్తి కాగానే, ప్రక్కనే ఉన్న పరమశివునికి ఆరతి ఇవ్వడం ప్రారంభమవుతూ
ఉంటుంది.
(జె.పి. నగర్ బాబా మందిరం వీడియో)
ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. ఒక రోజు గ్రహణం వచ్చింది. ఆరోజున పూజారిగారు శివునికి అనుకున్న సమయానికి ఆరతి
పూర్తి చేయాలనుకున్నారు.
ఇక్కడ బాబా మందిరంలో కాకడ ఆరతి సి డి పెట్టారు. ఆరతి దాదాపు
పూర్తయింది.
చివరిగా బాబాకు జయకారాలు (శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజి కి జై) అని జయజయద్వానాలు పలకాలి. సరిగ్గా ఆక్షణంలోనే కాకడ ఆరతి సి డి ఆగిపోయింది. అక్కడ ఉన్న భక్తులు, పూజారిగారు సి డి ప్లేయర్ ని మరలా ప్లే చేయడానికి ప్రయత్నించారు. కాని ఎంతకూ
అది ప్లే అవలేదు. బహుశ సాంకేతికంగా ఏదయినా
సమస్య కలిగి ఉండవచ్చని అనుకున్నారు. అదే సమయంలో శివునికి ఆరతి మొదలయింది. శివునికి ఆరతి పూర్తవగానే
బాబా ఆరతి సి డి మరలా ప్రారంభమయింది. బాబా
చూపిన ఈ మహత్యానికి అక్కడ ఉన్న భక్తుల కళ్ళు చెమర్చాయి. ఇది ఆయన చూపించిన లీలా విలాసం.
(సర్వం శ్రీ
సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment