11.04.2019 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –19 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 8
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఈ రోజు అర్చన, సేలం గారు
వివరించిన లీల
దాదాపు 20 సంవత్సరముల క్రితం
జరిగిన ఒక సంఘటన నాకిప్పటికి బోధ పడింది.
అప్పట్లో నావయస్సు 4 లేక 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకరోజు నేను మా అమ్మమ్మగారితో కలిసి చెన్నై మైలాపూర్ లో ఉన్న
సాయిబాబా మందిరానికి వెళ్ళాను. మందిరంయొక్క గర్భాలయం షిరిడీలోని సమాధిమందిరానికి తగ్గట్లుగా నిర్మింపబడింది.
మందిరంలో ఇరుప్రక్కలా రెండు గాజు పెట్టెలలో దీపాలు వెలిగించబడి ఉన్నాయి.
ఆరెండింటిలో ఒక దానిలొ బహుశ కుడివైపున ఉన్న గాజు పెట్టెలో
నాకు బాబావారి వదనం చాలా స్పష్టంగా కనిపించింది. ఇపుడు మనం ఫొటోలలో
చూస్తున్నట్లుగా బాబా తన రెండు చేతులను పైకెత్తి దీవిస్తున్నట్లుగా కనిపించారు. ఆ దృశ్యం కొద్ది సెకనులు మాత్రమే
కనిపించింది. కాని అపుడు నేను చిన్నదాన్నయినా
ఆదృశ్యం నాకళ్ళముందు కాస్త చెప్పుకోదగ్గ సమయమే కనిపించింది.
ఆ సమయంలోనే నేను చూస్తున్నది బాబానే అని అర్ధం
చేసుకున్నాను. బాబా ఎంత నెమ్మదిగా
దర్శనమిచ్చారో అంతే నెమ్మదిగా అదృశ్యమయ్యారు.
మా అమ్మమ్మ, తాతగారి ఇల్లు
మైలపూర్ లోని శ్రీసాయిబాబా మందిరానికి అతి దగ్గరలోనే ఉంది. అందువల్లనే మేము క్రమం తప్పకుండా
మందిరానికి వెడుతూ ఉండేవాళ్ళం. నాకు ఊహ తెలిసినప్పటినుంచి నేనెప్పుడూ బాబాని దర్శించుకుంటూ ఉండేదానిని.
మరొక మాటలో చెప్పాలంటే ఆయనను దర్శించుకుంటూనే నేను పెరిగి పెద్దదానినయ్యాను.
చాలా సంవత్సరాలు గడిచాక కూడా నేను నాచిన్నతనంలో గాజుపెట్టెలో
దర్శించుకున్న బాబా గారి వదనం మరలా కనపడుతుందేమోననే ఆశతో చాలా సార్లు గమనిస్తూ
వచ్చాను. కాని
అప్పట్లో నాకు ఆవిధంగా కనిపించిన బాబా మరలా కనపడలేదు.
ఇపుడు 20 సంవత్సరాలు గడిచాక నాకు బాబా
అంటే ఏమిటో, ఆయన చేసే లీలలు అధ్భుతాలు నాకర్ధమయ్యాయి. ఆయన ఇంకా ఉన్నారనీ, ఆయన ఇంకా తన లీలలను ప్రదర్శిస్తున్నారనే
నమ్మకం నాలో కలిగింది.
గత
సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో అనుభవాలనిచ్చారు. అవన్నీ వివరించాలంటే ఒక పెద్ద
గ్రంధమే అవుతుంది. వాటిలో
ఒకటి రెండు వివరిస్తాను.
ఆగస్టు – 2007
ఆరోజు
బుధవారం ఉదయం. నేను ఆఫీసుకు వెడుతూ అనుకోకుండా బాబా మందిరానికి
వెళ్ళాను. ఆరోజున
ఎందుకనో నాకు కాస్త నీరసంగా అనిపించింది.
బాబా పాదాలముందు శిరసువంచి నమస్కారం చేసుకుంటూ నాకు
శక్తినిమ్మని బాబాకు విన్నవించుకుంటూ నన్ను పూర్తిగా నీస్వాధీనంలోకి తీసుకో బాబా
అనికూడా ప్రార్ధించుకున్నాను. రెండు నిమషాల తర్వాత కూర్చున్నాను. కూర్చోగానే నాలో ఒక వింతయిన
అనుభూతి కలిగింది. నాకాళ్ళలో
ఒక విధమయిన వణుకు, ప్రకంపనలు కలిగాయి. నేను బాబాను
ప్రార్ధించుకున్నదానికి ఫలితంగా బాబా నన్ను స్పృశిస్తూ నన్ను దీవిస్తున్నట్లుగా
నాకు నమ్మకం కలిగింది.
ఆ రోజున
ఏమీ తోచక అనుకోకుండా ఆన్ లైన్ లో బ్రౌజ్ చేస్తుంటే నేనెప్పుడూ గమనించని ఒక బ్లాగు
కనిపించింది. అందులో ఒక
సాయి భక్తుడు తనకు కలిగిన అనుభవాన్ని వివరించాడు. అతను షిరిడీ వెళ్ళినపుడు
మందిరంలోకి ప్రవేశించగానే అతనికి కాళ్ళలో ఒక వింతయిన ప్రకంపననలు కలిగాయని
వివరించాడు. ఇదేమయినా
కాకతాళీయమా?
అటువంటి
అనుభూతి మరలా కలగవచ్చనే ఆశతో మరుసటిరోజే మళ్ళీ మందిరానికి వెళ్ళాను. కాని మందిరానికి వెళ్ళాక ఆరోజు
గురువారం అని తెలిసింది. ఇక కాసేపట్లో ఆరతి మొదలవబోతూ ఉంది. ఆరతి చూడటానికి చాలా మంది
భక్తులు వేచి చూస్తున్నారు. నేను లోపలికి వెళ్లగానే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం చూసి నేను
వెంటనే హాలునుంచి బయటకు వచ్చేసాను.
ఒక వాలంటీరు నన్ను దగ్గరకు పిలిచి, బాబాను
పూజించుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించాడు. నాకు ఆఫీసుకు వెళ్ళడం ఆలశ్యం
అవుతుంది అందుకనే వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేశాను. గేటు దగ్గర ఉన్న బాబా పాదాలకు
నమస్కారం చేసుకుని క్రితం రోజు ఆయన ఇచ్చిన అనుభూతికి ధన్యవాదాలు తెలుపుకొన్నాను. నన్నెప్పుడూ వదిలి ఉండవద్దని
బాబాను ప్రార్ధించుకున్నాను.
రోడ్డు
మీదకు వచ్చి ఆటోని పిలిచాను. ఆటో డ్రైవరు ఒక విధమయిన తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. మా ఆఫీసు కిలోమీటర్ దూరంలో ఉంది. ఆటోకి కనీస చార్జీ అవుతుంది. నేను ఆటో ఎక్కి నా ఆలోచనలలో
మునిగిపోయాను. డ్రైవర్
వెనక్కి తిరిగి ఏదో చెబుతున్నాడు. ఆసమయంలో రోడ్డుమీద విపరీతమయిన రద్దీ కారణంగా ఆటో ఆగుతూ నెమ్మదిగా వెడుతూ
ఉంది. అతని మాటలను
నేను అంత శ్రధ్ధగా ఆలకించటంలేదు. నా ఆఫీసుకు దగ్గరగా చేరుకొన్నాను.
నేను ఆటోనుండి దిగుతూ ఉండగా అతను స్వచ్చమయిన ఆంగ్లంలో మేము
ఏదారిలోనయితే వచ్చామో ఆ దారివైపు తన చేతితో చూపిస్తూ, “నా
సోదరుని ఇల్లు అక్కడే ఉంది. నేను ఆటోని వెనక్కి త్రిప్పుకుని అటువైపే వెళ్లాలి” అని
అన్నాడు. ముందర నాకు
అతను చెప్పేదేమీ అర్ధం కాలేదు. అందుచేత అతను మళ్ళీ చెప్పాడు.
మేము వచ్చిన రోడ్డు వన్ వే. అందువల్ల విపరీతమయిన రద్దీగా
ఉంది. అతను ఇంకా
ముందుకు వెళ్ళి యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళాల్సి ఉంటుందని అది తనకు ఇబ్బంది
అని ఆవిధంగా చెప్పాడనుకున్నాను. నేనతనితో ‘సారీ’ అన్నాను అంతే. “నువ్వు ఆఫీసుకు వెళ్ళాలా సరే
అయితే” అని అన్నాడు.
అతను అన్న మాటలు ఎలా ఉన్నాయంటే నేను మందిరంలో వాలంటీర్ నన్ను
ప్రశ్నించినదానికి సమాధానంగా ఎలా అన్నానో సరిగా అలాగే ఉన్నాయన్నట్లుగా అనిపించింది
నాకు. నేనా ఆటో
అతనికి 12 రూపాయలిచ్చి ధాంక్స్ చెప్పాను. ఇదంతా కొద్దిసేపు మాత్రమే
జరిగినా ఆకాసేపటి సమయంలోనే నేనతనిలో గమనించినది అతను ధరించిన దుస్తులు. అతను తలకి కట్టుకున్న తలపాగా మీద
నాదృష్టి పడింది. అతను
తన తలకి తెల్లని గుడ్దను ఎందుకు కట్టుకున్నాడో నాకు తెలీలేదు. అతను కట్టుకున్న గుడ్డ మంచి
తెల్లని తెలుపులో ఉంది. తలకు ఎంతో ఒద్దికగా కట్టుకున్నాడు. నేనతనికి ఎడమవైపున నిల్చుని
ఉన్నాను. తలగుడ్డను
చెవికి వెనుకవైపున ముడి వేసాడు. అతను ‘గాడ్ బ్లెస్ యూ’ అని
చిరునవ్వుతో అన్నాడు. నేను కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి రోడ్డు దాటడానికి వేచిచూస్తున్న
వారితో కలిసి నుంచున్నాను. నేను ఆటో దిగి అక్కడికి నడిచి వెళ్ళడానికి ఎంతో సేపు పట్టలేదు. కొద్ది సెకండ్ల లోపే అయి ఉంటుంది. ఎందుకనో నాకు ఆ ఆటో డ్రైవర్ ని
మరొక్కసారి చూడాలనిపించింది. ప్రక్కకి చూసాను. కాని అతను కనపడలేదు. అక్కడ చాలా మంది ఆటో డ్రైవర్ లు కాకీ దుస్తులలో ఉన్నారు. గాని తెల్లటి దుస్తులతో ఎవరూ లేరు. ‘గాడ్ బ్లెస్ యూ’ అని అతను నాతో ఎందుకని అన్నాడో నాకు చాలా చిత్రమనిపించింది. అప్పుడు వెంటనే నాకొక సంగతి
గుర్తుకు వచ్చింది. అతను
పొడవాటి తెల్లని చొక్కా గాని అంగీలాంటిది గాని వేసుకున్నాడు. తెల్లని ధోవతీ కట్టుకున్నాడు. బెంగళూరురో ఆటో డ్రైవర్ లు ఎవరూ
అటువంటి దుస్తులు ధరించరు. తలకి తెల్లని గుడ్డ ఎంతో చక్కగా కట్టుకున్నాడు. ఎడమ చెవి వెనుక ముడి వేసి ఉంది. వస్త్రం చివర వేలాడుతూ ఉంది. తెల్లని గడ్డం, బుగ్గల మీద కొద్దిగా ముడతలు కనిపించాయి. అతని వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది. అతను కాస్త ముసలివాడిలా ఉన్నాడు. ఆరోజు గురువారమ్.
అతని రూపాన్ని
నేను మరలా గుర్తుకు తెచ్చుకోగానే ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను. ఆవ్యక్తి మనం ఎప్పుడు ఫొటోలలో
చూసే అచ్చు గుద్దినట్లుగా సాయిబాబా లాగానే ఉన్నాడు. అతను తను వెళ్ళవలసిన దారి ఏదో
చేతితో ఎందుకని చూపించాడో దాని అర్ధం నాకు బోధపడింది. అతను మేము వచ్చిన దారినే వెనుకవైపు
చూపిస్తూ తన సోదరుడి ఇంటికి వెళ్ళాలని అన్నాడు. బహుశ తను వెళ్లవలసినది బాబా
మందిరానికి అనే ఆలోచన నాలో కలిగింది.
నిజంగా నేనెంతో అదృష్టవంతురాలిని.
అప్పటి
వరకు నేను షిరిడీ బాబావారి లీలలు ఏమీ చదవలేదు. భక్తులు
పిలిచినంతనే ఆయన పరుగెత్తుకుంటూ వస్తారనే విషయం కూడా నాకు తెలీదు. ఆఫీసు గేటు వద్దనుంచి నేను
చేరుకునే భవనం వరకు నాకళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.
ఆరోజు
వరకు నేనెప్పుడూ సాయి సత్ చరిత్రను చదవలేదు. యధాలాపంగా నేను కంప్యూటర్ లో
బ్రౌజర్ ఓపెన్ చేసినపుడు బుక్ మార్క్ లో శ్రీసాయి సత్ చరిత్ర 18 – 19 అధ్యాయం కనిపించింది. అది బుక్ మార్క్ లో ఎందుకని ఉందో అదే ఇపుడు నాకంట ఎందుకని పడిందో నాకే
తెలీదు. ఇపుడు
కంప్యూటర్ తెరమీద కనపడుతున్న సాయి సత్ చరిత్రను ఆ అధ్యాయం నుండె చదవడం మొదలు పెడదామనే
ఆలోచన నాలో కలిగింది. ఆ అధ్యాయం ద్వారా బాబా నాకు సందేశమిస్తున్నట్లుగా అనిపించింది.ఆ అధ్యాయంలో నది ఒడ్డున ఉన్న తాబేలు అవతలి ఒడ్దున ఉన్న తన పిల్లలపై తన
దృష్టిని ఏవిధంగా సారిస్తుందొ వివరింపబడి ఉంది.
“తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును.
బిడ్ద తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు
ఆహారము పెట్టుట గాని, పాలిచ్చుట గాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని
పోనిచ్చును. పిల్లలెదిగి
పెద్దవి యగును.”
నువ్వు
నన్నెప్పుడూ వదిలి ఉండవద్దు. ఎల్లప్పుడూ నాతోనే ఉండమని నేను బాబాని ప్రార్ధించినదానికి అది సమాధానం కాదా? ఆరోజున నేను రెండు నాణాలు (10
+ 2) ఎందుకని ఇచ్చానో నాకే ఆశ్చర్యం కలిగింది. నేను చదువుతున్న అధ్యాయం ప్రకారం
బాబా మనలనుంచి కోరేది రెండు పైసలు మాత్రమే. అవే శ్రధ్ధ, సబూరి. నాప్రశ్నలకు
సమాధానాలు లభిస్తున్నాయి.
ఆవిధంగా
తెల్లటి దుస్తులు ధరించిన ఆటో డ్రైవర్ మరలా ఒక్కసారి కూడా కనపడలేదు.
తెల్లని
దుస్తులు ధరించిన ఆ ఆటో డ్రైవర్ నిజంగా బాబాయేనా అని నేను చాలా కాలంపాటు
ఆశ్చర్యపడుతూనే ఉన్నాను. ఆవిధంగా 14
నెలలపాటు నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఒక రోజున నాకొక కల వచ్చింది. ఆ కలలో నాకొక ఆటో కనిపించింది. అందులో బాబా డ్రైవర్ సీటులో తన పాదాలను బయటకు కనిపించేలా కూర్చుని ఉన్నారు. ఆయన నవ్వుతూ ఉన్నారు.
మా
అమ్మమ్మగారి అనుభవమ్….
1996/97
వెనుకటి సంవత్సరాల
ప్రాంతంలో మా అమ్మమ్మ గారికి చాలా జబ్బు చేసింది. రాత్రి వేళల్లో
మా మేనత్త ఆమెకు ప్రక్కనే రాత్రి చాలా సేపటి వరకు ఆమె శరీరాన్ని మెల్లగా మర్ధనా
చేస్తూ ఉండేది. ఒకరోజున
మా అమ్మమ్మగారు “రాత్రి చాలా సేపయింది. ఇక నువ్వు వెళ్ళి పడుకో, అవసరమయితే పిలుస్తాను అని చెప్పి మా మేనత్తను పంపించేశారు. మా మేనత్త తన గదిలోకి వెళ్ళి
పడుకుంది. కొంతసేపయిన
తరువాత మా అమ్మమ్మ గారికి తన చాతీ మీద మృదువుగా అంతకు ముందులాగానే రుద్దుతూ ఉన్నట్లుగా
అనిపించింది. మా
మేనత్తే ఆవిధంగా రుద్దుతూ ఉందనుకుని, “నువ్వింకా నిద్రపోలేదా?
నువ్వు వెళ్ళిపోయావనుకున్నానే” అని మా
అమ్మమ్మగారు అన్నారు. ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల మా
అమ్మమ్మగారి ప్రశ్నకు సమాధానం రాలేదు.
కాని ఆమెకు ఇంకా అదే విధంగా రుద్దుతూ ఉన్నట్లుగా తెలుస్తూనే
ఉంది. ఆమె కళ్ళు
తెరిచే ముందు, నిద్రలో బాబా కనిపించినట్లుగా అనుభూతి
కలిగింది. ఆవిడ
కళ్ళు తెరవగానే గదిలో ఆమెకు ఎవరూ కనిపించలేదు. మా మేనత్త కూడా గదిలో లేదు. ఇక ఆవిడ బాబాను తలచుకొని
ప్రశాంతంగా నిద్రపోయింది.
అదే
రోజు రాత్రి మా మేనత్త మా అమ్మమ్మగారి ఆరోగ్యం గురించి ఆందోళనపడుతూనే ఉంది. ఆమె నిద్రపోతున్న సమయంలో ఏమీ
ఫరవాలేదు, ఆందోళన పడవద్దు అంతా సవ్యంగా జరుగుతుందని ఎవరో
చెప్పినట్లుగా అనిపించింది. ఆవిధంగా ఎవరు అన్నారో ఆమెకు అర్ధం కాలేదు. మరునాడు ప్రొద్దున్న ఇద్దరూ తమకు
కలిగిన అనుభవాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ రోజునుంచి మా అమ్మమ్మగారి
ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగు పడి ఆరోగ్యవంతురాలయింది. మా మేనత్త డాక్టరు. ఆమె కూడా ఇది ఎంతో అధ్బుతమయిన
లీల అని వర్ణించింది.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
సాయి భక్తులకు ఒక విన్నపమ్...పైన కొంత పేరా క్రింద అండర్ లైన్ వచ్చింది. వర్డ్ లో టైపె చేసినప్పుడు అటువంటి లైన్ లేదు. పేస్టె చేసి కాపీ చేసినప్పుడు కొంత పేరా క్రింద ఆవిధంగా వచ్చింది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. అది ఎలా పోతుందో ఎవరయినా తెలిస్తే చెప్పండి...సాయిరామ్ tyagaraju.a@gmail.com
0 comments:
Post a Comment