21.09.2020 సోమవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ఒక అధ్భుతమయిన లీలను మీకు అందిస్తున్నాను. ఈ సంఘటన బాబా వారు
జీవించి ఉన్న రోజులలో జరిగింది. సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు 2010 సంవత్సరము
నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదం -
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
వాసుదేవ్ సీతారాం రతన్ జన్ కర్ హైదరాబాద్ వాస్తవ్యులు ఆ రోజులలో
ఆయన వ్రాసిన ఉత్తరంలో ఈ సంఘటన గూర్చి వివరించడం జరిగింది.
బాబా తన భక్తులను మరణాన్నించి కూడా తప్పించగలరు
నేను మొట్టమొదటిసారిగా 1908 వ.సంవత్సరంలో కుశాభావ్ (వేదశాస్త్ర సంపన్న క్రుష్ణనాధ్ బువా మిరజ్ గావంకర్) గారి ద్వారా సాయిబాబా గురించి ఆయన లీలల గురించి విన్నాను. ఎంతోమంది ఆయనను తమ ఇంటిలో జరిగే పూజలకి ఆహ్వానించి ఆయనను సన్మానిస్తూ ఉండేవారు. గ్రామంలో ఈవిధంగా ఎన్నోరోజులపాటు సాగింది. ఒకసారి వేదశాస్త్ర సంపన్న సీతారాం భట్ జీ ఘాట్ గారి ఇంటిలో పూజా కార్యక్రమం జరిగింది.
ఆయన నా మేనమామ. అందువల్ల నేను కూడా ఆపూజా కార్యక్రమం చూడటానికి
వెళ్ళాను. అక్కడ జరిగే కార్యక్రమంలో సాయి కధలను
విన్న తరువాత మాయింటిలో కూడా సాయి పూజ నిర్వహించడానికి ఆయన వస్తే బాగుంటుందనుకున్నాను. సరిగా అదే సమయంలో మహరాజ్ “నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను”
అన్నారు. పూజా కార్యక్రమాలకు ఏవిధంగా ఏర్పాట్లు
కావించాలి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఈవిషయం ఇంటిలోని వారందరికీ చెప్పాను.
ఉదయాన్నే మా అమ్మగారు గంగాబాయికి ఒక కలవచ్చింది. ఆ కలలో కాషాయాంబరాలను ధరించిన ఒక సన్యాసి నేరుగా
మాయింటిలోకి వస్తూ కనిపించారు. మా అమ్మగారు
ఆయనకు ఆసనం చూపించి కూర్చోమని చెప్పారు. కాని
ఆయన తను ఉన్న చోటనే నిలుచుండి పోయారు. మా అమ్మగారు
క్రిందకు వంగి ఆయన పాదాలవద్ద తన శిరసును ఆనించింది. అంతలోనే ఆమెకు మెలకువ వచ్చేసింది. ఆమె తనకు వచ్చిన కల గురించి మాకందరికీ చెప్పింది. కాని ఎవరూ ఆమె కలని అంతగా పట్టించుకోలేదు.
అదే రోజు నేను మా మేనమామ ఇంటిలో పూజ జరుగుతుంటే చూడటానికి
వెళ్ళాను. పూజ పూర్తయిన తరువాత మహరాజ్ తీర్ధ
ప్రసాదాలను ఇస్తూ నాకు సాయిఫోటోని ఇచ్చి, దానిని పూజామందిరంలో పెట్టుకుని ప్రతిరోజు
పూజించుకోమని చెప్పారు. నేను ఇంటికి వచ్చిన
తరువాత మహరాజ్ నాకు ఇచ్చిన ఫొటోని అందరికీ
చూపించాను. మా అమ్మగారికి వచ్చిన కల గురించిన
విశేషం అందరికీ అప్పుడు తెలిసింది. ఆ తరువాత
నేను మహరాజ్ ని (శ్రీ క్రుష్ణనాధ్ మహరాజ్) మా ఇంటికి భోజనానికి రమ్మని, మాఇంటిలో కూడా
పూజ నిర్వహించమని ఆహ్వానించాను. ఈ విధంగా నాకు
సాయి గురించి తెలిసింది.
భక్తులందరూ సాయితో తమకు కలిగిన అనుభవాలను చెబుతూ ఉండేవారు. అవి వింటుంటే నాకు కూడా సాయిని దర్శించుకోవాలనీ,
ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనే బలీయమయిన కోరిక కలిగింది. కాని నా కోరిక రెండు మూడు సంవత్సరాల తరువాత అంటే
1912 వ.సంవత్సరంలో నెరవేరింది.
బ్రిటిష్ చక్రవర్తిగారు బొంబాయి వస్తున్నారని తెలిసి ఆయనను
చూడటానికి బొంబాయి వెడదామనుకున్నాను. కాని
ఒకరోజు ఉదయాన్నే శ్రీ శివదాస్ థాటే వచ్చి నాకు షిరిడీ వెళ్ళడానికి టికెట్ ఇచ్చాడు. అది బాబా ఆశీర్వాదంగా భావించి తీసుకున్నాను. ఇక బొంబాయి ప్రయాణం రద్దు చేసుకుని అదే రోజు సాయంత్రం
షిరిడీకి ప్రయాణమయ్యాను. అక్కడ నాకు ఎన్నో
అధ్బుతాలు అనుభవాలు కలిగాయి. నాకు సాయిమీద
కొన్ని పద్యాలు రచించాలనిపించింది. నేను ఒక
‘పద్యమాల’ ను రచించాను.
షిరిడీలో జరిగిన ఎన్నో అధ్భుతాలలో ఒక దానిని వివరిస్తాను.
మా పిన్ని కూతురు కీ.శే. శ్రీమతి మాలన్ బాయి, కీ.శే. శ్రీదామోదర్
రంగనాధ్ జోషి దేగాంన్ కర్ గారి కుమార్తె కి కలిగిన అనుభవం.
ఆమె ఎప్పటినుంచో జ్వరంతో బాధ పడుతూ ఉంది. చివరికి అది క్షయవ్యాధిలోకి దింపింది. ఎంతోమంది వైద్యులు ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. చివరికి మేము మందులతోపాటుగా బాబా ఊదీని కూడా ఇవ్వడం
మొదలుపెట్టాము. వీటన్నిటితో విసిగిపోయి మాలన్
బాయి “నన్ను బాబా దగ్గరకు తీసుకువెళ్ళండి.
అపుడే నాకు నయమవుతుంది” అని చెప్పింది.
కాని ఆమె చాలా నీరసంగా బలహీనంగా ఉండటం వల్ల కూర్చోలేని స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఆమెను తీసుకుని ప్రయాణం చేయడం
కూడా చాలా కష్టం, ప్రమాదకరం కూడా. కనీసం షిరిడీలోనయినా
ఆమెకు మానసిక ప్రశాంతత లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఆఖరికి వైద్యులు కూడా ఆమెను షిరిడీకి
తీసుకువెళ్లడానికి అంగీకరించారు. మరొక ఇద్దరి
ముగ్గురి సహకారంతో ఆమెని షిరిడీకి తీసుకుని వెళ్ళారు.
బాబా ఆమెని చూసిన వెంటనే తిట్లు తిట్టడం ప్రారంభించారు. “ఆమెని ఆ దుప్పటిలోనే చావనివ్వండి. ఆమెకు త్రాగడానికి ఆ కుండలోని నీళ్ళనే ఇవ్వండి”
అన్నారు. ఆమె కేవలం మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ
అక్కడే ఏడు ఎనిమిది రోజులపాటు పడుకుని ఉంది.
అన్ని రోజులూ ఆమె బాబాయే తనకు నయం చేస్తారని అంటూనే ఉంది.
ఏడు ఎనిమిది రోజుల తరువాత బాబా నిద్రనుంచి లేచే సమయమయినా
ఇంకా లేవలేదు. కాకడ ఆరతికి వచ్చిన భక్తులందరూ
బాబా ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
బాబా ఈరోజు ఇంకా లేవకపోవడానికి కారణమేమిటి అని అందరూ ఆశ్చర్యంతో ఉన్నారు.
కాని ఇక్కడ మాలన్ బాయి మరణించింది. ఆమె బంధువులందరూ ఆమె అంతిమయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె తల్లి, నేను మాలన్ బాయి పక్కనే విచారంగా కూర్చుని
ఉన్నాము సాఠే కాకా (ఒక భక్తుడు) ఓదార్చడానికి
ప్రయత్నిస్తునాడు. అకస్మాత్తుగా మాలన్ బాయిలో
కదలిక వచ్చింది. ఒక్కసారిగా ఆవలించి కళ్ళు
తెరచి చూసింది. ఆమె భయంగా చుట్టూ చూడసాగింది ఆమె చుట్టూ ఉన్నవాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం. ఆమె తనకు కలిగిన అధ్భుతమయిన అనుభూతిని చెప్పసాగింది.
“నల్లగా ఉన్న ఒకతను నన్ను తనతో తీసుకుని వెడుతున్నాడు. అప్పుడు నేను బాబా అని ఆయన సహాయం కోసం రోదించాను.
అపుడు బాబా వచ్చి తన సటకాతో ఆ మనిషిని కొట్టారు.
నన్ను అతనినుంచి రక్షించి నన్ను చావడిలోకి తీసుకుని వెళ్ళారు.” ఆమె ఎప్పుడూ అంతవరకూ చావడిని చూడకపోయినా చావడిని
వర్ణించి చెప్పింది.
ఇక్కడ చావడిలో బాబా ఇంకా లేవలేదేమిటి అని భక్తులందరూ చర్చించుకుంటున్నారు. అకస్మాత్తుగా బాబా నిద్రనుంచి మేల్కొని తన సటకాతో
నేలమీద కొడుతూ ఆమె పడుకున్న చోటకి (దీక్షిత్ వాడా) పరుగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్న భక్తులందరూ ఆయనను అనుసరిస్తూ వెళ్ళారు. మాలన్ బాయి తిరిగి బ్రతికిందనే అధ్భుతమయిన విషయాన్ని
చెప్పడానికి వస్తున్నవారు వారికెదురు పడ్దారు.
ఆ విధంగా బాబా తన భక్తులను మరణాన్నించి కూడా తప్పించి వారిని రక్షించగలుగుతారన్న
దానికి సాక్ష్యమే ఈ సంఘటన. చెప్పాలంటే ఇంకా
ఎన్నో అధ్భుతాలు ఉన్నాయి. కాని స్థలాభావం వల్ల
వివరించలేకపోతున్నాను.
శ్రీ వాసుదేవ సీతారాం రతన్ జన్ కర్
హైదరాబాద్, ఇంటి నెంబరు - 163
శ్రీ సాయిలీల పుష్యమాసం 1845 వాల్యూం 2
ఆంగ్లానువాదం. జ్యోతిరంజన్
రౌత్
8/6 కాకడ్ ఎస్టేట్, 106, సీఫేస్ రోడ్
వర్లి, ముంబాయి – 400 018
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment