02.02.2021 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 40 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
(నిన్నటి ప్రచురణకి తరువాయి భాగమ్….ప్రాధమిక లక్షణాలయిన జంతు
మానవ లక్షణాలను వెంటనే తొలగించుకోవాలి….ఆ తరువాత ప్రశ్న)
ప్రశ్న --- క్రమక్రమంగా తొలగించుకోవాలా?
జవాబు --- అవును. ఎవరికి వారే తొలగించుకోవాలి. శుధ్ధిచేసిన బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది శుధ్ధిచేయబడని బంగారంలో మకిలి ఉన్న విధంగానే మనలో ప్రతి ఒక్కరిలోను రజోగుణం, తమోగుణం, సత్త్వగుణం అనే విభిన్నమయిన గుణాలున్నాయి.
అందుచేత నేను చెప్పేదేమిటంటే రజోగుణాన్ని తమోగుణాన్ని
ఈ రెండిటినీ తొలగించుకొవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఎప్పుడయితే సత్త్వగుణమే మానవునిలో మిగిలి ఉంటుందో
అతను అసాధారణమయిన దైవాంశసంభూతునిగా మారతాడు.
మీకర్ధమవుతోందా? అందువల్ల నేను చెప్పేదేమిటంటే
ఆధ్యాత్మిక సాధనలు చాలా అవసరం. ఇక్కడికి అందరూ
జపం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కాని అవన్నీ అయిన తరువాత వారి జీవితం ఇతరులను హింసించడంతో
ముగుస్తుంది. వారు చేసిన జపాలకి, సాధనలకి ఎటువంటి
ఉపయోగం ఉండదు. హింసించడమే కాదు, ఒకరిపై ఒకరు
ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటారు. వారు చేసిన
సాధనలన్నీ నిరర్ధకం. అందుకనే మాతాజీ ఏమని చెప్పారంటే,
ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తాము ఇక్కడికి వస్తున్నకారణంగా తాము ఎంతో పవిత్రులమయిపోయినట్లు,
సాధుపుంగవులయినట్లు తమకు తామే భావించుకుంటారు.
అటువంటివారిని భక్తులు అనేకంటే దొంగభక్తులు అని అంటాను” అని మాతాజీ అనేవారు. మాతాజీ ఈమాటలను చాలా అరుదుగా అనేవారు. కానీ ఇవన్నీ వాస్తవమయిన విషయాలు. దీని అర్ధమేమిటంటే ప్రజలు తప్పుదారిలో వెళ్ళవచ్చని
వారు భావిస్తారు. అంతేకాకుండా తాము సాధువులను
దర్శించుకోవడానికి వెళ్ళామని, వారితో కలిసి జీవించి జపాలు చేసామని, అందువల్ల తామే ఎంతో
మంచి భక్తులమని తమకుతామే అనుకుంటూ ప్రజలను కూడా తప్పుదారిలో నడిపిస్తారు. కాని మనం పరిగణలోకి తీసుకోవలసినది హృదయ పరివర్తన. ఇది ఒక్కటే మనం గమనించతగ్గది. మొత్తం ప్రపంచమానవాళినంతటిని, విశ్వాన్నంతటినీ ప్రేమించగలిగే
దైవాంశసంభూతమయిన ప్రేమను కలిగి ఉండాలి. ప్రపంచ
మానవాళినే కాదు అన్ని జంతుజాలాల మీద కరుణ, దయ చూపించాలి. అంతర్గతంగా పురోగతిని సాధించారన్నదానికి ఇదే గుర్తు.
ప్రశ్న --- ఇక్కడ కన్యలందరూ పసుపురంగు దుస్తులనే ధరించడానికి
గల కారణమేమిటి? పసుపు రంగు ప్రత్యేకించి దేనికయినా సంకేతమా?
జవాబు --- ఇది వారియొక్క ఏకరూప దుస్తులు ధరించే పధ్ధతి. అధ్యాత్మికతకి, వైరాగ్యానికి పసుపురంగు సంకేతం. పూజలు చేసే సమయంలో వారందరూ ప్రత్యేకంగా వీటినే ధరిస్తారు. ఈ పధ్ధతి ద్వారా వారు గృహస్థులనుండి, ఇతర స్త్రీలనుండి
వేరుగా స్పష్టంగా తెలుసుకోగలిగేలా కనిపిస్తారు.
పసుపురంగు చీరలు ధరించకుండా వారు ఎటువంటి యజ్ఞాలను గాని, పూజలు, సత్యనారాయణస్వామి
పూజ మొదలయినవి ఏమీ చేయరు. మహారాష్ట్రలో వీటిని
దేశినీవస్త్రాలు అని అంటారు. సిల్కు దుస్తులు. వీటిని బ్రాహ్మణులు ధరిస్తారు. ప్రాపంచిక సాధనలకోసం వీటిని ఎప్పుడూ ధరించరు. వీటిని ధరించడంలో గల ముఖ్యమయిన ప్రేరణ ఏమిటంటె పవిత్రతను
పరిరక్షించడం. ఈ కారణం వల్లనే పసుపురంగు దుస్తులను
మిగతా దుస్తులతోపాటు కలపకుండా వేరుగా ఉంచుతారు.
పవిత్రతను కాపాడటం కోసం వాటిని మతాచార సాంప్రదాయ వ్యవహారాలలోనే ధరిస్తారు.
ప్రశ్న --- ఒక బాలిక కన్యగా అయినపుడు ఇక్కడ ఏవిధంగా జరుగుతుంది? అంటే ఒక కన్యగా ఇక్కడ జీవితం ఆరంభించడానికి శిక్షణాకాలం
ఏమయినా పూర్తి చేయాల్సి ఉంటుందా?
జవాబు --- ఇదంతా చాలా ఆకస్మికంగాను, సహజంగాను జరుగుతుంది. నిజానికి మీరు చాలా ముఖ్యమయిన ప్రశ్న వేసారు. కన్యగా ఎవరినీ వెంటనే స్వీకరించరు. మీకు చాలా విపులంగా చెబుతాను. ఎన్నో కుటుంబాలవారు సాకోరీ ఉపాసనీ బాబా ఆశ్రమానికి
సవత్సరాలుగా వస్తూ ఉన్నారు. వారు ఇక్కడికి
ముఫై, నలభై సంవత్సరాలుగా వస్తున్నారు. అందువల్ల
వారి కుమార్తెలు కూడా వారితోపాటే వచ్చి ఇక్కడే చాలా రోజులపాటు ఉండిపోతూ ఉంటారు. ఆవిధంగా ఉండిపోవడం వల్ల సహజసిధ్ధంగానే వారిలో దైవికగుణాలు,
భక్తి ఇవన్ని వారసత్వంగా సంక్రమిస్తాయి. ఒక్కోసారి
ఆడపిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చినపుడు వారు ఇక్కడ ఉన్న ఇతర కన్యలతో కలిసి ఇక్కడే
ఉండిపోతామని అంటారు. వారిలో అంతర్గతంగా ఉన్న
కోరిక ఇంకా ప్రజ్వరిల్లుతుంది. సరిగా ఆ క్షణంలో
ప్రారంభదశలో ఉన్న కన్యకు ఇక్కడే నివస్తిస్తున్న కన్యల జీవిత విధానం, అలవాట్లు అన్నీ
గనించి వారిలాగా శాశ్వతంగా ఇక్కడే స్థిరపడిపోదామనే ఆలోచన మొదలవుతుంది. కాని ఈ దశలో కూడా అమ్మాయిని వెంటనే కన్యగా ఇక్కడ
ఉండటానికి అనుమతించరు. ఆమె మాతాజీతో తను శాశ్వతంగా
ఉండిపోదామనే కోరికను వెల్లడించినపుడు మాతాజీ ఆమె తల్లిదండ్రులతో. “ఆమెని ఇక్కడే ఉండనివ్వండి. కాని కొంతకాలంపాటు మాత్రమే” అని చెప్పేవారు. ఆవిధంగా అమ్మాయిని వెంటనే కన్యగా స్వీకరించరు. “ఆమెని
కొంతకాలంపాటు మాత్రమే ఇక్కడ ఉంచండి” అని మాతాజీ అనేవారు. ఈ అర్హతానిర్ణయకాలం (probatin period) సాధారణంగా
మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment