29.03.2021
సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 62 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – శుక్రవారమ్
– అక్టోబర్, 25, 1985
నా డైరీలోని
ముఖ్యాంశాలు
ఉదయం గం. 8.30 కి. నా హోటల్ గదిలో. ఈ రోజు ఉదయం గం. 8.10 కి నిద్రనుండి లేచాను. నేను, స్వామి శేఖరరావు ఇద్దరం, ఇక్కడ స్థానికులను కలుసుకుని వారినుండి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ తరువాత ఉధ్ధవరావు గారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి. షిరిడిలో కొనుక్కోవలసినవి కొన్ని ఉన్నాయి.
మళ్ళీ ఒకసారి తిరిగి సంస్థానానికి వెళ్ళి ఆఖరిసారిగా
(బషీర్ బాబా మొదలయినవారి గురించి) వివరాలు సేకరించుకుని వారికి వెళ్ళివస్తానని చెప్పిరావాలి. ఆఖరిసారిగా కొన్ని ఫోటోలను కూడా తీసుకోవాలి. ధునిలోని ఊదీని కొంత నాతోకూడా తీసుకుని వెళ్ళే
భాగ్యం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ షిరిడీలో
నా పరిశోధనా క్రమంలో ఈ రోజుతో ఆఖరు.
మధ్యాహ్నం గం. 1.15 ని.
ఈ రోజు మంచి శుభదినం. తాత్యాకోతే పాటిల్
కుమారుడయిన శ్రీ ఉత్తమరావు పాటిల్ గారిని కలుసుకుని మాట్లాడే అవకాశం కలిగింది. ఆయనకు 60 సంవత్సరాల వయస్సు. మేము చాలా బాగా మాట్లాడుకున్నాము. ఆతర్వాత మేము మార్తాండబాబా గారిని రెండవసారి కలుసుకుని
మాట్లాడాము. మేము చాలా సేపు ఎంతో అధ్భుతంగా
అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. వారినుంచి
ఎన్నో ఆసక్తికరమయిన విషయాలు తెలుసుకున్నాను.
ఆయన ఇంటిలో శ్రీమతి దేవకీదేవన్ అనే భక్తురాలితో కూడా క్లుప్తంగా మాట్లాడాము. ఆతరువాత ఉధ్ధరావుగారిని మూడవసారి ఇంటర్వ్యూ చేసిన
తరువాత ఆయన ఇంటిలో భోజనం చేసాము.
నేను కొన్ని
పుస్తకాలు, ఇంకా ఇక్కడ స్థానికంగా జరుపపబడే భజనలు, ఆరతులు గల క్యాసెట్లను కొన్ని కొన్నాను. నా మినీ క్యాసెట్ ఏడవదానిలో రికార్డింగ్ ప్రారంభించాను. ఇంతవరకు పదకొండు గంటల దాకా సాగిన ఇంటర్వ్యూల విశేషాలన్నీ
రికార్డు చేయడం జరిగింది. అన్ని గంటలపాటు రికార్డింగు
జరుపగలనని నేను కూడా ఊహించలేదు. నా పరిశోధన
కూడా ఇంత విజయవంతంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు.
ఈ మధ్యాహ్నం
నేను కొనుక్కోవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి.
మరికొన్ని ఫోటోలు తీసుకోవాలి. కొంత
ఊదీని కూడా తీసుకుని సంస్థానం వారితో కూడా మాట్లాడాలి. చెప్పుకోదగినంత జ్ఞానసంపదని మోసుకుని షిరిడీ వదిలి
వెడతాను. నాకు కొత్త స్నేహితులు దొరికారు. భవిష్యత్తులో వీరి పరిచయం నాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ షిరిడిలో ఉన్నన్ని రోజుల్లో నాకు ఉన్న సమయాన్ని
నాకు ఎంత వీలయితే అంతగా ఉపయోగించుకున్నాననే నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువగా చేసానని నేను అనుకోవడంలేదు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకి నేరుగా నా హోటల్ నుండే
బస్సులో బొంబాయికి బయలుదేరతాను.
సాయంత్రం – గం. 6.15 కి. స్వామి శేఖరరావు నాకోసం కొన్ని కానుకలు తీసుకువచ్చాడు. అతని అభిమానానికి నామనస్సు ఆనందంతో ఉప్పొంగింది. అంతేకాకుండా ఉత్తమరావు పాటిల్ గారు నాకొక సంచీని చూపించారు. చూడటానికి అది ఒక మేజోడు లాగ ఉంది. ఆసంచీని సాయిబాబా వారు వారి తండ్రిగారయిన తాత్యాకోతే పాటిల్ గారికి కానుకగా ఇచ్చారని చెప్పారు. దానియొక్క చిన్న ముక్కను ఆయన ఎంతో దయతో నాకు ఇచ్చి, అత్యంత విలువయిన జ్ఞాపక చిహ్నంగా భద్రపరుచుకోమని చెప్పారు. ఆయన ఎంతో దయతో నాకు ఇచ్చిన అమూల్యమయిన బహుమానం. మసీదు ముందర సాయిబాబా వారు, తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి, అబ్దుల్ బాబాలతో కలిసి ఉన్న అరుదయిన ఫోటోను కూడా తీసుకున్నాను.
(మసీదు ముందర కూర్చుని ఉన్న సాయిబాబా, ఆయన ప్రక్కన అబ్దుల్ బాబా, చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చున్నవారు తాత్యాకోతే పాటిల్, ప్రక్కన చివర నానావలి)
స్థానికంగా ఉన్న దుకాణాలలో కొన్ని వస్తువులను కొనుక్కున్నాను. ఇంకా ముఖ్యమయిన విషయం ఏమిటంటె మసీదులోని పవిత్రమయిన
ధునిలోని ఊదీని కాస్త ఎక్కువగానే అడిగి మరీ తీసుకున్నాను.
నేను ఇక్కడ
షిరిడిలో ఉన్నన్ని రోజులు నాకు తోడు నీడగా ఉంటూ, చుట్టుప్రక్కల ప్రాంతాలకి కూడా నన్ను
దగ్గర ఉండి మరీ తీసుకువెళ్ళి నాకెంతగానో సహాయపడిన స్వామి శేఖరరావుకి ధనరూపేణా మంచి
పారితోషికం ఇవ్వాలి. అతని సహాయం నాకెంతగానో
ఉపయోగపడింది. అతనే లేకపోతే నేనసలు ఏమీ చేయలేకపోయేవాడిని. అతనికి తగినట్లుగా నేను బహుమతి ఇవ్వాలి.
రేపు ఉదయాన్నే
గం. 4.30 కి లేచి కాకడ ఆరతికి వెళ్లాలి. అన్నీ
నేను అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతున్నాయి.
ఈ రోజు చాలా శుభదినం. రేపు సంస్థానానికి
వెళ్ళి అక్కడ ప్రతివారికి నా ధన్యవాదాలు తెలుపుకుని వెళ్ళివస్తానని చెప్పాలి.
(తరువాత ఉత్తమరావు పాటిల్ గారితొ జరిపిన ఇంటర్వ్యూ)
(బాబా తాత్యాకోతే పాటిల్ గారికి సంచీ ఎందుకని ఇచ్చారు?)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment