05.02.2011 శనివారము
ఓంసాయి శ్రీ సాయి జయజయసాయి
సత్సంగము - రెండు చిన్న కథలు
మనము అప్ప్డప్పుడు కాస్త కాస్త సత్సంగము గురించి చెప్పుకుంటున్నాము. ఈ రోజు కూడా సత్సంగము మీద చిన్న కథ, భగవంతుడు మనని అనుసరించుట, చిన్న కథ తెలుసుకుందాము. సత్సంగము మనము సజ్జనులతోనూ, భక్తిభావం ఉన్నవారితోనూ చేయాలి. అంటే మీకు యింతకుముదు సత్సంగము యెలా చేయాలో వివరించడం జరిగింది. సత్సంగములో మనము ఒకరికొకరం మన అనుభవాలని, అనుభూతులని, బాబా వారి తత్వాన్ని చర్చింకుటూఉండాలి. అప్పుడే మనమనసులో భక్తిభావం పెంపొందుతుంది.
సాయి భక్తులమైన మనము యేది తిన్నా కూడా, తినేటప్పుడు సాయికి నివేదించి తీసుకోవాలి. ంఅనం తినేటప్పుడుకూడా, సాయినాథారపణమస్తు అనుకుంటూ తినాలి. నేను యేది తింటున్నా, లేక ఆఖరికి మంచినీరు తాగుతున్న సాయినాథార్పణమస్తు అనుకుంటూ తీసుకుంటాను. ప్రతి ముద్దకి అన్నం తినేటప్పుడు, సాయినాథార్పణమస్తు, అంటే సాయియే తింటున్నారు అనే భావం.
బాబా లీలలు కాకుండా ఇటువంటి మిగతా విషయాలు రుచిస్తునాయో లేదో తెలియ చేస్తే వీటిని అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటాను. లేదా లీలలనె యిస్తూ ఉంటాను.
సత్సంగమహాత్మ్యం
ఒకసారి ఒక ముముక్షువు కి నారదుల వారు యెదురయ్యారు. ఆయన నారదులవారిని ముక్తికి మార్గం చూపమని అడిగారు. నారదుల వారు సత్సంగము చేయమన్నారు. (ముముక్షువు - సత్యాన్వేషి) ముముక్షువు " సత్సంగము అంటే యెమిటి" అని అడిగాడు. అప్పుడు నారదులవారు, కింద పాకుతున్న పురుగును చూపించి అదిగొ ఆ పాకే పురుగుని అడుగు అన్నారు. ఆ ముముక్షువు "పురుగా పురుగా, సత్సంగము అంటే యేమిటి "అని అడిగాడు. ఆ మాట వింటూనే ఆ పురుగు చచ్చిపోయింది. ముముక్షువు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదులవారు "అదిగో ఆ యెగిరే పక్షిని అడుగు" అన్నారు. యెగిరే పక్షిని చూసి, "పక్షీ, పక్షీ, సత్సంగము అంటే యేమిటీ" అని అడగ్గానే, ఆ పక్షి ఠపీమని నేలమీద పడి మరణించింది. ఆ ముముక్షువు నిరాశతో "యెమిటిది స్వామీ" అని అడిగాడు. "కంగారు పడకునాయన, కొంచెం సేపట్లో యిక్కడికి దగ్గిరలో ఉన్న ఒక రైతు ఇంటిలో ఆవు ఈనడానికి సిథ్థంగా ఉంది, ఆ పుట్టే దూడని అడుగుదువుగాని పద" అన్నారు నారదులవారు. "వద్దు నారదా, ఆ దూడకూడా మరణిస్తే నాకు గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. నేను వెళ్ళిపోతాను" అన్నాడు ముముక్షువు.
"అదెమిటి, సత్సంగము అంటే యేమిటో తెలిసికోకుండానే వెళ్ళిపోతావా? ఒకవేళ ఆ దూడ మరణిస్తే ఆ గోహత్యాపాతకమేదో నేను తీసుకుంటాను సరేనా" అని బయలదేరదీశారు నారదులవారు. రైతు యింటి పశువుల కొట్టంలొ అప్పుడే ఈనిన దూడని "సత్సంగం అంటే నీకు తెలుసా" అని ముముక్షువు అడగగానే ఆ దూడ కాస్తా మరణించింది. ముముక్షువు చాలా బాథ పడ్డాడు. అప్పుడు నారదుల వారు, "ఈ రాజ్యన్నేలే రాజుగారి పట్టమహిషికి కొంచెం సేపటిలొ శిశువు జన్మించబోతున్నాడు. ఆశిశువుని అడుగుదువుగాని పద" అన్నారు. "అమ్మో! రాజ భవనంలోకా? పైగ అంతహ్ పురంలోకా? అడుగడుగునా రాజ భటులు ఉంటారు" యెలా సాథ్యమవుతుంది అనగానే , నారదులవారు, యేమీ ఫరవాలేదు, నన్ను తలుచుకుని ప్రవెశించు అని చెప్పారు. తరువాత జరిగేది తనకి చెప్పమన్నారు.
ఇద్దరూ రాజభవనం దగ్గిరకి వెళ్ళారు. ముముక్షువు నారదులవారిని తలుచుకుని నిరాటంకంగా అంతహ్ పురంలోకి వెళ్ళాడు. అక్కడ మహారాణీ వారు మగ శిశువుని ప్రసవించింది. ముముక్షువు ఆ బాలుడుని, సత్సంగము అంటే యెమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుని మొహం వింత కాంతితో మెరిసింది. బోసినోటితో చక్కగా నవ్వాడు. తరువాత ముముక్షువు వచ్చి జరిగినదంతా నారదులవారికి చెప్పాడు.
అప్పుడు నారదుల వారు "అదే నాయన సత్సంగ మహత్యం. ఆ బాలుడు యెవరనుకున్నావు? ముందర నువ్వు సత్సంగము అంటే యెమిటి అని పురుగుని అడిగావు చూడు, అదే పురుగు సత్సంగము అనే మాట వినగానె పక్షిగా, దూడగ జన్మించి ఆఖరికి ఉత్తమమైన మానవ జన్మ లభించింది దానికి. అదీ కూడా మహరాజ వంశంలో జన్మించింది. సత్సంగం మాట వింటేనె యింతటి దుర్లభమైన మానవ జన్మ లభించిందే, అటువంటిది సత్సంగము చేస్తే యింకెంత పుణ్యమో అలోచించు" అని నారదులవారు సత్సంగ మహత్యాన్ని వివరించారు.
---- @@@ ---
84 లక్షల జీవరాసులలో మానవ జన్మ అత్యుత్తమమైనది. మరి దీనిని సార్థకం చేసుకోవాలంటే మనము యేమి చేయాలొ అలోచించండి.
పాద ముద్రలు
ఒకరోజు ఒకానొక వ్యక్తికి ఒక కల వచ్చింది. అతను సముద్రపు ఒడ్డున భగవంతుడితో కలిసి నడుస్తున్నట్లుగా కల గన్నాడు. ఆకాశంలో తన జీవితంలో జరిగిన దృశ్యాలన్నీ కనుల ముందు సాక్షాత్కరించాయి. ఒక్కొక్క దృశ్యంలో అతనికి రెండు జతల పాద ముద్రలు కనిపించాయి. ఒక జత తనది, మరియొక జత భగవంతుడిది.
ఆఖరి దృశ్యం కనిపించినప్పుడు, అతను తన వెనుక యిసుకలో తన వెనుక పాద ముద్రలని చూచాడు. తన జీవిత గమ్యంలో చాలా సార్లు ఒక జత పాద ముద్రలే ఉండటం గమనించాడు. అది తన జీవితంలో నిరాశతోను, దుఖంతోను ఉన్న సమయాలలొ ఉన్నట్లు గమనించాడు.
ఇది అతనిని చాలా కలవరపరిచింది. భగవంతుడిని అడిగాడు.
"ఓ దేవా! ఒకసారి నిశ్చయించుకున్నాక నాకు తోడుగా నాతోనే జీవితమంతా నడుస్తానని చెప్పావు, కాని, నా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఒక జత పాద ముద్రలే ఉన్నాయి. అటువంటి అత్యవసర సమయాల్లో నన్నెందుకు విడిచి వెళ్ళిపోయావొ నాకర్థమవడం లేదు" అన్నాడు. అప్పుడు భగవంతుడన్నాడు " భక్తా ! నువ్వంటే నాకిష్టం, నేను నిన్నెప్పుడూ వదలలేదు, నీకష్ట సమయాల్లో నువ్వు బాథలు పడుతున్నప్పుడు నువ్వు ఒక జత పాద ముద్రలే చూశావు, ఆ సమయంలో నేను నిన్ను యెత్తుకుని మోశాను." అని చెప్పాడు.
ఇది కథే కావచ్చు. కాని దీనినుంచి మనము తెలుసుకోవలసినది యేమిటి అని అలోచిస్తే, భవంతుడిని నమ్ముకుంటే ఆయన మనలని యెప్పటికీ విడిచిపెట్టడు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, అనన్యమైన భక్తిభావంతో సాయినే మనసారా నమ్ముకుని ఆయన నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే, అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనే చెప్పారు కదా, మీభారమంతా నామీద వేయండి, నేను మోస్తాను అని.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు