30.03.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు
మన బ్లాగులో ప్రచురణ జరిగి నెల రోజులు అయింది. మన్నించాలి. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాను. వ్యక్తిగతంగా కొన్నికొన్ని పనులవల్ల, మనవళ్ళని చూసుకోవడంలోను వీటివల్ల ప్రచురణకు సాధ్యపడటంలేదు.
ఇక ఈరోజు శ్రీసాయితో మధురక్షణాలలోని ఒక మధురక్షణం తెలుసుకుందాము.
శ్రీసాయితో మధురక్షణాలు - 35
సమస్త జీవరాశిలో బాబా ఉన్నారు
శ్రీ సాయిబాబా భక్తుడైనవానికి కులమత భేదాలు ఉండవు. క్రిష్టియన్ కుటుంబంలో జన్మించిన నాకు దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. భగవంతుడిని అనేకమంది అనేక పేర్లతో కొలుస్తూ ఉంటారు.
కాని నా దైవం షిరిడీ సాయిబాబా. నాలుగు సంవత్సరాల క్రిత్రంవరకూ సాయిబాబా ఎవరో నాకు తెలీదు. నాజీవితం అనేక కష్టాలతో ఒడిదుడుకులతో ఉండేది. ఎటువంటి నిబంధనలు లేకుండానే నాకు సాయిబాబా పై నమ్మకం కలిగింది. ఆయన మీద ఎంతో భక్తి విశ్వాసాలు కలిగాయి. నేనిప్పుడు ఎంతో ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉన్నాను. బాబా వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. నాజీవితంలో ఎంతో మార్పు వచ్చిందని నాకు అర్ధమయింది.
aarOju ఆగస్టు 7వ.తేదీ 1979వ.సంవత్సరం. సాయంత్రం 6.30 కు నాభార్య అప్పుడే రాత్రి కి వంట చేయడం పూర్తిచేసింది. ఆసమయంలో మాయింటికి వెనుకనున్న తలుపు బయట ఒక ముసలివాడు అన్నం పెట్టమని అడగడం వినపడింది. చుట్టుప్రక్కలవారు అతనికేమీ yiవ్వకపోగా అతని ముkhamమీదే తలుపు వేసేశారు. నాభార్య అతనికి పెట్టడానికి కొన్ని చపాతీలు, బెండకాయ కూర తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. కాని ఆవ్యక్తి ముందుకు వెళ్ళిపోయాడు. అతనిని ఏమని పిలవాలో తెలీక నాభార్య 'బాబా' (తండ్రీ) అని పిలిచి అతనికి తను తెచ్చినవన్ని యిచ్చింది. ఆముసలివాడు ఆనందంగా అవితీసుకుని పాత చొక్కా ఏమన్న ఉంటే యిమ్మనమని అడిగాడు. నాభార్య అతనికి పాత చొక్క ఒకటి తెచ్చి ఇచ్చింది. ఆముసలివ్యక్తి దానిని తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు.
నేను రాత్రి 7 గంటలకి యింటికి రాగానే నా భార్య జరిగిన విషయమంతా చెప్పింది. నేను లేని సమయంలో ముసలి వ్యక్తి రూపంలో బిక్ష కోసం శ్రీసాయిబాబా వారే వచ్చారని గాఢంగా నా మనసుకు అనిపించింది. ఆ సమయంలో నేను యింటిలో లేనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. శ్రీసాయిబాబాయే స్వయంగా వచ్చారని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన వచ్చినప్పుడు నేను లేనందుకు బాధపడి, నాకు దర్శనం కలుగ చేయమని బాబాని ప్రార్ధించాను. బరువెక్కిన హృదయంతో బాబాకు సంధ్యా హారతినిచ్చి, నాభార్య, పిల్లలు, మరదలు అందరితో కలిసి భోజనం చేశాను. భోజనమయిన తరువాత ఎప్పటిలాగే నేను బాబా నామాన్ని పలుమార్లు రాయసాగాను (నామ జపం).
8.30 కి వరండాలో ఉన్న నాభార్యకి ఎదురుగా ఎక్కడినించి వచ్చిందో ఒక తెల్లటి కుక్క వచ్చి నిలుచుంది.
నాభార్య లోపలినించి ఒక కప్పులో పెరుగు తీసుకొని వచ్చి ఆ కుక్క ముందు పెట్టింది. పిల్లలు ఆ కుక్కని చూడటానికి వరండాలోకి వెళ్ళారు. నేను సాయి నామం ఎన్నిసార్లు రాసానో లెక్కపెట్టడంలో మునిగిపోయాను. మా పెద్దబ్బాయి రాజు 5 సంవత్సరాలు వయసు. నాదగ్గిరకు వచ్చి ఆ కుక్కని చూడమని నన్ను చికాకు పెట్టసాగాడు. నేను బయటకు వచ్చి ఆకుక్కకేసి చూశాను, కాని అది వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది. మేమంతా యింటిలోకి వచ్చేశాము. కొంతసేపయిన తరువాత నాభార్యతో ఆకుక్క యింకా అక్కడే ఉందేమో చూడమని చెప్పాను. కాని అది అప్పటికే అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆ కుక్కని ముట్టుకోనందుకు నేను చాలా విచారించాను. విశ్రాంతిగా కూర్చున్నా గాని జరిగిన సంఘటనని నేను మర్చిపోలేకపోయాను.
ఆశ్చర్యకరంగా 10 నిమిషాల తరువాత అదేకుక్క మళ్ళీ వచ్చింది. నేను దానిని పిలవగానే అది మూడు సార్లు తల ఆడించింది. నేను నాభార్య యిద్దరం మాట్లాడుకుంటూ, ఆ కుక్కని గమనిస్తూ ఉండమని నా మరదలికి చెప్పాను. ఆ కుక్క ఎక్కడినుండి వచ్చిందో, మరలా ఎక్కడికి వెడుతుందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. కొంతసేపటి తరువాత ఆకుక్క యింటిలోకి వెళ్ళిందని నా మరదలు చెప్పింది. వెంటనే నేను యింటిలోపలికి వెళ్ళాను. కుక్క నామీద పడుతుందేమోననే భయం వెంటాడింది నన్ను. నేను ఆకుక్కను పిలుస్తూనే ఉన్నాను కాని దాని జాడ ఎక్కడా నాకు కనపడలేదు. ఆకుక్క క్షణంలో మాయమయిపోయింది.
సాయిబంధువులారా, శ్రీ సాయినాధులమీద సంపూర్ణ విశ్వాసం భక్తి కలిగి ఉండండి. ఆయన ఏరూపంలో ఎప్పుడు ఏవిధంగా మనలని అనుగ్రహిస్తారొ మనకు తెలీదు. మనం ఆయనని వివిధ నామాలతో పిలిచినా ఆయన అన్నిచోట్లా, అందరిలోను ఉన్నారు. అందరికీ కూడా భగవంతుడంటే భయం ఉండాలి. జీవులందరి ఎడల ప్రేమానురాగాలు కలిగిఉండాలి. గత నాలుగు సంవత్సరాలుగా నాకెన్నో అనుభవాలు కలిగాయి. అందులో పైన చెప్పినది అపూర్వమైనది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
శ్రీసాయిలీల
డిసెంబరు 1979
యాంటొనీ డేవిడ్
కొత్త ఢిల్లీ