11.05.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 41
నేను నిన్ను మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు
ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో మరొక మధుర క్షణం తెలుసుకుందాము. వ్యాధి గ్రస్తులకు వ్యాధిని తగ్గించడంలో బాబా చేసే చర్యలు, వైద్యం చాలా వింతగా ఉండేవి. కాని ఆయన చేసినట్లుగా భక్తులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి వికటిస్తూ ఉండేవి. ఈ లీలలో బాబా వ్యాధిని ఏ విధంగా తగ్గించారో చూడండి.
నేను నిన్ను మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు
ఇప్పుడు వివరింపబోయే ఈ లీల ఒక ప్రముఖ సంగీత కారునిది. ఆయన తన గాన మాధుర్యంతో బాబాని ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ఆయన పేరు అబ్దుల్ కరీం ఖాన్. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని కైరన గ్రామంలో నవంబరు 11 వ.తేదీ 1872వ.సంవత్సరంలో జన్మించారు.
ఆయన కుటుంబం కైరానాలోని సున్నీ కుటుబానికి సంబంధించి దానిలో ఒక అంతర్గత భాగం. వారికి చిస్టీ సూఫీ సన్యాసులంటే ఎంతో గౌరవభావం. ముఖ్యంగా మధ్య ఆసియా ద్వారా ప్రయాణించి రాజస్థాన్ అజ్మీర్ లో స్థిరపడిన పెర్షియన్ సన్యాసి మౌనుద్దీన్ చిస్టి పట్ల వారికెంతో గౌరవ భావం.