15.06.2015 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవం
నే ఒస్తున్నా...
ఈ రోజు శ్రీషిరిడీసాయి వైభవం లో సాయిబాబా వారి మరొక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకొందాము. ఈ వైభవం 17.డిసెంబరు, 2009 వ.సంవత్సరం సంచికనుండి గ్రహింపబడినది. ఇపుడు అందులో ప్రచురింపబడిన ఒక సాయి భక్తుని అనుభవాన్ని చదవండి.
చిన్నతనం నుంచీ నాకు సాయిబాబా అంటే ఎంతో భక్తి. (నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నా సద్గురువు పరమ పూజ్యులయిన శ్రీభక్తరాజ్ మహరాజ్ గారి అనుగ్రహం). నాలాగే మూడున్నర సంవత్సరాల వయసున్న మా అబ్బాయి జయ్ కి కూడా బాబా అంటే భక్తిప్రపత్తులు. వాడు కూడా నాబాటలోనే నడుస్తున్నాడు. ప్రతిరోజూ బాబాని పూజిస్తాడు. బాబాకు సంబంధించి నాకెన్నో చెప్పలేనన్ని అనుభవాలున్నాయి. వాటిలో కొన్ని అనుభవాలు చాలా అద్భుతమైనవి. ఎవరితోనయినా నా అనుభవాలను పంచుకుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది.
ఏమయినప్పటికీ యిపుడు నేను చెప్పబోయే అనుభవం చాలా అద్భుతమయినది. ఈమధ్యనే చికాగోలో మంచు తుఫాను వచ్చింది. అప్పుడు జరిగింది ఈ సంఘటన. అది చాలా భయంకరమయిన తుఫాను. ఒక్క రోజులోనే 18 అంగుళాల మేర మంచు పేరుకొనిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోజు నా కారులో నేను, మా అబ్బాయి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి యింటికి వస్తూండగా యింటికి దగ్గరలోనే నాకారు దట్టంగా పేరుకొన్న మంచులో కూరుకొనిపోయింది.
కారును బయటకు తీద్దామని నాశాయశక్తులా ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. మా అబ్బాయి కారులోనే మౌనంగా చూస్తూ కూర్చొన్నాడు. ఇక కారును కదల్చలేని స్థితిలో ఉన్నాను. ఆసమయం లో మా అబ్బాయి "నాన్నా, బాబా యిప్పుడే నాతో మాట్లాడారు. ఏమీ కంగారు పడద్దు. నేనొచ్చి సాయం చేస్తాను" అన్నారు అని చెప్పాడు. అలా అని నాకారు డాష్ బోర్డులో ఉన్న బాబా ఫోటోవైపు వేలితో చూపించాడు. ఇక కారుని అక్కడే వదిలేసి మా అబ్బాయిని తీసుకొని యింటికి వెళ్ళిపోయాను. నేను మళ్ళీ తిరిగి వచ్చి చూసేటప్పటికి ఒక అమెరికన్ వ్యక్తి తన 4 x 4 చక్రాల ట్రక్కుని నాకారు వెనకాలే ఆపి ఉంచాడు. ఈ దృశ్యం నాకెంతో ఆశ్చర్యాన్ని కలుగచేసింది. ఏమీ మాట్లాడకుండా అతను తన ట్రక్కుకి నాకారుని కట్టడానికి ఒక తాడు తీశాడు. (అమెరికాలో ఎవరయినా కారులో తాడు ఉంచుకుని ఏమీ మాట్లాడకుండా ఈ విధంగా చేయడం అసాధారణం) అతను నాకారుని, తన ట్రక్కుతో తాడుతో కట్టి, కొద్ది నిమిషాలలోనే నాకారుని బయటకు లాగాడు. నేనతనికి కృతజ్ఞతలు చెప్పగానే అతను తిరిగి "సంతోషం" అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. అటువంటి భయంకరమయిన మంచు తుఫానులో అతనెక్కడినుండి ఎలా వచ్చాడా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు అర్ధమయింది. మా అబ్బాయి జయ్ తో బాబా అన్నమాటలు. నిజంగానే బాబా స్వయంగా నాకు సహాయం చేయడానికి ఆ రూపంలో వచ్చారు.
సాయీ! నువ్వు సర్వాతర్యామివి.
ప్రబోధ్ తెలాంగే - చికాగో
ఈ అనుభవాన్ని చదివారు కదా? బాబాతో అనుభవాలు అనుభవించినవారికే తెలుస్తుంది. సాయి భక్తులందరికీ కి అర్ధమవుతుంది. పైన చెప్పిన అనుభవంలో చిన్న పిల్లవాడు బాబా మాట్లాడారు అన్నది కల్పన కాదు. చిన్న పిల్లలు బాబా మాటలాడారు అని అసత్యం పలుకరు. దీనిబట్టి బాబా సర్వాంతర్యామి అని, పిలిచితే పలుకుతారని, సహాయం చేస్తారని, ఒక్కొక్కసారి పిలవకుండానే సహాయం చేస్తారనీ ఈ సంఘటనని బట్టి మనకి అర్ధమవుతోంది. ఓం సాయిరాం...
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)