31.07.2011 ఆదివారము
బాబా వారి చందనపు మందిరం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి భక్తులందరికీ బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు బాబా వారి చందనపు మందిరాన్ని గురించిన విశేషమైన లీల తెలుసుకుందాము.
ఒక సవరణ
శ్రీ సాయితో మొదటి కలయిక (పరిచయం) అన్న అథ్యాయంలో జ్యోతీంద్ర గారి కుటుంబాన్ని గురించి చెపుతూ ఆయన మామయ్య కూడా వైద్యుడుఅని రాయడం జరిగింది. మామయ్యకు బదులుగా బాబాయి, లేక పెదనాన్న అని గ్రహించమని కోరుతున్నాను. జ్యోతీంద్రగారు రాసిన దానికి ఆంగ్ల అనువాదంలో (బహుశా ఆయన మరాఠీలో రాసి ఉంటారు) అంకుల్ అని రాయడం జరిగింది. అందు చేత పొరపాటున తల్లివైపు అని భావించి మామయ్య అని రాయడం జరిగింది. గ్రాండ్ మదర్ ని నానమ్మ గా చదువుకోవలసినదిగా కోరుతున్నాను. ఈ పొరపాటుని సాయి బంథువులలో ఒకరు నిన్ననే నా దృష్టికి తీసుకుని వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తరువాత ప్రచురించేవాటిలో దీనికణుగుణంగా రాయడం జరుగుతుంది. పొరపాటుకు మన్నించమని కోరుతున్నాను.
ఓం శ్రీ సాయినాథాయ నమహ
యింతకు ముందు వివరించినట్లుగా తార్ఖడ్ కుటుంబంవారికి షిరిడీ దర్శనాలు యెక్కువయాయి. బాబాపై వారి ప్రేమ పూర్ణచంద్రోదయంలాగా వృథ్థి పొందుతూ వచ్చింది. షిరిడీలో ఉన్నపుడెల్లా వారు, తాము బాబా వారి పాదాల వద్దే ఉంటున్నామని అనుకుంటున్నప్పటికీ, ప్రతిసారి అది సాథ్యం కాదు. బాంద్రాలోని తమ యింటిలో ఉంచుకుని పూజించుకోవడానికి ఒక పెద్ద సైజు బాబా ఫోటో ఉంచుకోవాలనే కోర్కె వారిలో బలంగా పెంపొందింది. దీని వెనుక వున్న ఆలోచన యేటంటే, వారు షిరిడీ నుంచి వచ్చాక, బాబా వారిని తమ దృష్టి పథం నుండి, మనసులోను, మరచిపోకుండా ఉండటానికి. తండ్రీ, కొడుకులిద్దరిదీ కూడా ఒక విచిత్రమైన మనస్తత్వం. వారెప్పుడూ కూడా బాబా మీద తమకున్న ప్రేమని ఒకరికొకరు చర్చించుకునేవారు కాదు. వారికి బాబా మీద అపరిమితమైన నమ్మకం. తమ మనసును తెలుసుకొని, సరియైన సమయంలో తమ కోరికలను తప్పక తీర్చడానికి యేర్పాటు చేసే సర్వాంతర్యామి అని వారికి తెలుసు. అందు చేత బాబా వారు చెప్పిన రెండు ముఖ్యమైన విషయాలు శ్రథ్థ, సబూరి.
ఒకరోజు తెల్లవారుఝామున బాబా సాహెబ్ గారికి, జ్యోతీంద్రగారికి, కల వచ్చింది. వారు అందంగా చెక్కబడిన మందిరంలో బాబా కూర్చుని ఉండటం చూశారు. ఆ కల వారి మనసులో గాఢమైన ముద్ర వేసింది. వారిద్దరూ మంచి చిత్రకారులు కాబట్టి, లేచిన తరువాత తాము కలలో చూసిన మందిరం చిత్రం గీశారు. వారిద్దరూ పలహారం చేయడానికి బల్ల వద్దకు వచ్చినప్పుడు యిద్దరూ కూడా ఒకరి ఆలోచనలను ఒకరు చెప్పుకుని ఉదయాన్నే తమకు వచ్చిన కలల గురించి కూడా చర్చించుకున్నారు. యిద్దరూ వారు వేసిన చిత్రాలను పట్టుకుని వచ్చి చూసి, రెండూ కూడా ఒక్కలాగే ఉండటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు వెంటనే అటువంటి మందిరం తమ యింటిలో ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వారిద్దరూ అన్వేషణ చేసి చందనపు కలపని కొన్నారు. ఒక మంచి వడ్రంగిని నియమించి తాము వేసిన చిత్రాలను చూపించి అటువంటిది ఒకటి చెక్కి యిమ్మని పురమాయించారు. వారు ఉన్న బాంద్రా యింటికి చిన్న డాబా వుంది. అక్కడ మందిరం నిర్మాణపు పని ప్రారంభం అయింది. మందిరం పూర్తవడానికి సంవత్సరం పైన పట్టిందనుకుంటాను. చివరికి చందనపు మందిరం 9 అ. పొడవు, 2. 1/2, 2 1/2 చ..అ. తో మందిరం తయారయింది. యిపుడు వారికి ఒక సందేహం వచ్చింది, మందిరంలో పెట్టి పూజించడానికి బాబా పటాన్ని యెక్కడనించి తేవాలి.
ప్రియ పాఠకులారా, బాబాగారెప్పుడూ తనని కెమేరాతో ఫోటో తీయనిచ్చేవారు కాదని మీకందరకూ తెలుసు. అందు చేత ఆయన ఫోటో సంపాదించడమనేది కష్ట సాథ్యమయిన విషయం. కాని తమకు వచ్చిన కల కూడా బాబాగారి సృష్టే కాబట్టి, అంతా ఆయనే చూసుకుంటారనే థీమాతో, నమ్మకంతో ఉన్నారు.
వారి అలవాటు ప్రకారం ఒక శుక్రవారమునాడు మథ్యాన్నం బొంబాయిలోని చోర్ బజార్ కి వెళ్ళారు. వారెప్పుడూ వేసుకునే దుస్తులు అంటే బాబా సాహెబ్ కోటు, పైజామా, ఆంగ్ల టోపీతో, జ్యోతీంద్ర గారు కోటు, పైజామా నలుపురంగు గాంథీ టోపీ థరించి ఉన్నారు. వారిద్దరూ చోర్ బజార్ సందులలో తిరుగుతూ వెడుతున్నప్పుడు ఒక అద్వితీయమైన సంఘటన జరిగింది. ఒక ముస్లిం షాపు యజమాని గట్టిగా అరుస్తూ వచ్చి "యేయ్ ! దొరలూ , యిన్ని రోజులుగా మిమ్మలిని కసుకోవాలని యెదురు చూస్తున్నాను. నా దుకాణంలో మీకొక పార్శిల్ ఉంది" అన్నాడు. బాబా సాహెబ్, జ్యోతీంద్రగారు ఉలిక్కిపడి, ఆ షాపతను తమకేదో దొంగిలించిన సరుకు అంటగట్టాల్ని చూస్తున్నాడని ఆందోళన పడ్డారు. యింతమంది జనం ఉండగా మమ్మల్నే యెందుకు పిలిచారని ప్రశ్నించారు. ఆ షాపతను అంతా వివరంగా చెబుతాను షాపులోకి రండి అని కోరాడు. షాపులోకి వచ్చిన తరువాత, "కొద్ది రోజుల క్రితం సాథువులా ఉన్న వయసుమళ్ళిన పెద్ద మనిషి వచ్చి తనకు ఒక పార్శిల్ యిచ్చినట్లు చెప్పాడు. ఆయన, ఒక శుక్రవారమునాడు ఒక హిందూ తండ్రి, కొడుకు ఈ ప్రదేశానికి వస్తారని చెప్పాడు. వారికోసం ఒక పార్శిల్ యిచ్చి, ఈ పని చేసి పెట్టినందులకు గాను రూ.50/- కూడా యిచ్చినట్లు చెప్పాడు.
అందు చేత జంటగా వచ్చే మనుషులందరినీ తాను జాగ్రత్తగా గమనిస్తున్నాననీ, యిప్పుడు తమని సరిగా గుర్చించినట్లు చెప్పాడు. అప్పుడతను ఆ పార్శిల్ని తీసుకు వచ్చి వారికందించాడు. అది దొంగిలించిన సొత్తేమోనని వారికింకా అనుమానంగా ఉంది. అందుచేత తీసుకునేముందు అతని చేతనే ఆ పార్శిల్ విప్పించారు. షాపతను పార్శిల్ విప్పాడు. అది చక్కటి చెక్క ఫ్రేములో బిగించబడి ఉన్న నలుపు, తెలుపు రంగులలో ఉన్న బాబా చిత్రపటం.
వారిద్దరికీ కళ్ళలో నీళ్ళు నిండి, ఆ పార్శిల్ తమకు వుద్దేశించినదే అని నిర్థారించారు. వారు అతనికి యెంతో కృతజ్ఞతలు చెప్పి, కొంత డబ్బు యివ్వ చూపారు. ఆ పార్శిల్ యిచ్చిన వ్యక్తి ఖండితమైన ఆజ్ఞ ఇవ్వడం వల్ల తాను యేవిథమయిన డబ్బు తీసుకోనని నిరాకరించాడు. వారెప్పుడూ స్టుడ్ బేకర్ కారులో ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వారా ఫోటొని జాగ్రత్తగా బాంద్రాకు తీసుకుని వెళ్ళగలిగారు. వారికి యింకొక ఆనందకరమైన, ఆశ్చర్యకరమైనదొకటి కలిగింది. అదేమిటంటే ఆ ఫోటో ఫ్రేము యెటువంటి మార్పులు చేయబడకుండానే మందిరంలో సరిగా సరిపోయింది. తార్ఖడ్ కుటుంబమంతా సంతోషంతో పొంగిపోయింది. వారి సంతోషానికి అవథులు లేవు. వారా సాయిబాబా ఫోటోని చందనపు మందిరంలో ప్రతిష్టించారు.
మా నాన్నగారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం 5 గంటలకే నిద్ర లేచి బాబా నుదిటిమీద చందనం అద్ది, దీపం, అగరువత్తులు వెలిగించి పూజ చేస్తూ ఉండేవారు. పంచదార పలుకులు నైవేద్యం పెట్టి, మధ్యన్నం భోజన సమయంలో తీసుకుంటూ ఉండేవారు. వారంతా యిప్ప్పుడు తమ తరువాతి షిరిడీ యాత్ర కోసం ఆత్రుతగా యెదురు చూస్తున్నారు.
మామూలుగా వారు ద్వారకామాయిలోకి ప్రవేశించి, బాబా గారికి సమర్పించేవి కానుకగా ఇచ్చారు. ఆయన వారిని అక్కడ కూర్చోమని చెప్పారు. షిరిడీలో ఉన్న సాయి భక్తులలో ఒక భక్తుడు, గత కొద్ది రోజులుగా బాబాని ఫోటో తీయడానికి విఫల ప్రయత్నం చేస్తూ, తీయలేకపోయి ఆఖరి ప్రయత్నంగా బాబాని కోరాడు. బాబా వెంటనే కోపగించి అతనితో గట్టిగా అరుస్తూ "ఏయ్ నువ్వు నా ఫొటోని యెందుకు తీస్తున్నావు? నువ్వు నా భావూ ఉన్నచోటకి వెళ్ళు, అక్కడ మందిరంలో ఉన్న ఫొటోలో నువ్వు నన్ను సజీవంగా చూడచ్చు" అన్నారు. యిది విన్న వెంటనే మా నాన్నగారు వెంటనె లేచి బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. మా నాన్నగారు, తాను సాయిని మరచిపోగలిగే దుష్టపు ఆలోచన రాకుండాను, ఆయన పాటలనే ఆయన మీద ప్రార్థన చేసేటట్లుగా వరమివ్వమని మనసులోనే ప్రార్థంచారు. (హేచి దాన్ దేగా దేవా తుఝా వీసర నా వ్హవా)
ఈ విథంగా షిరిడీ సాయిబాబావారు తమంత తాముగా తార్ఖడ్ గాయి యింటిలోని చందనపు మందిరంలోకి
ప్రతిష్టింపబడ్డారు.
స్వర్గీయ నా సోదరుడు రవీంద్రగారి వాసిలో ఉన్న యింటిలో ఈ మందిరాన్ని దర్శించవచ్చు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు