03.06.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీషిరిడీసాయి వైభవంలోని మరొక వైభవం తెలుసుకుందాము. ఈ నాటి ఈ వైభవం డిసెంబరు, 3, 2009 సం.సంచికలోనిది. సాయి భక్తుల అనుభవాలలోని ఒక సాయి భక్తుని అనుభవం ఈ రోజు చదవండి.
శ్రీషిరిడీ సాయి వైభవం
సాయి నాకు తోడు
బాబా నావద్దనే నాకు సన్నిహితంగా ఉన్నారనేంతగా ఎన్నో మధురమైన సంఘటనలు నాకెన్నో అనుభవమయ్యాయి. అటువంటివాటిలో ఒక దానిని మీకు వివరిస్తాను. నేను కాలేజీలో చదువుకునే రోజులలో, ఒక రోజు ఆదివారం నాడు, ఎక్స్ ట్రా క్లాసు అయిపోయిన తరవాత కారులో యింటికి తిరిగి వస్తున్నాను. దారిలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో హటాత్తుగా నాకారు ఆగిపోయింది.
కొన్ని కిలోమీటర్ల లోపల పెట్రోల్ బంకు గాని గ్యారేజీ గాని, కనీసం టెలిఫోన్ బూత్ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను చాలా నిస్సహాయంగా ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాని బాబా నాకు తోడుంటే నేనెప్పటికీ నిస్సహాయుడుని కాను. నాకళ్లనుండి కన్నీరు కారుతున్న సమయంలో ఆనిర్మానుష్యమయిన రోడ్డు మీద, యిద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెడుతూ నాకారు ప్రక్కనే ఆగారు. వారిద్దరూ తాము మెకానిక్ లమని, ఏమయినా సహాయం కావాలా అని అడిగారు. ఇక ఏమీ సందేహించకుండా నాకారు ఆగిపోయిందనీ ఒకసారి చూడమని చెప్పాను. వారు కారంతా పరీక్షించి ఒక స్పేర్ పార్టు పోయిందని చెప్పారు. వారిలో ఒకతను నాదగ్గరే ఉండి, రెండవ వ్యక్తి స్పేర్ పార్టు తీసుకొని రావడానికి దగ్గరలో ఉండే షాపుకు బయలుదేరి వెళ్ళాడు. తరువాత అతను స్పేర్ పార్ట్ తెచ్చి వేసి, కారును బాగుచేశాడు.
అంతా పూర్తయిన తరువాత వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి స్పేర్ పార్ట్ కి ఎంతయిందో చెప్పమని అడిగాను. కాని నావద్ద అంత డబ్బు లేకపోవడంతో, ఇవ్వవలసిన మిగతా సొమ్ము తరువాత ఇస్తానని చెప్పి, వారి ఫోన్ నెంబరు, వారు పనిచేసే మెకానిక్ షాపు చిరునామా తీసుకున్నాను. ఇంటికి చేరుకున్న తరువాత నేను యింట్లో అందరికీ జరిగిన విషయం చెప్పి, ఇక్బాల్ ను కలుసుకోవడానికి మెకానిక్ షాపుకు వెళ్ళాను. విచిత్రం! ఆ గంగా మెకానిక్ షాపులో ఇక్బాల్ పేరుతో ఇంతకు ముందు ఎవరూ, ఎప్పుడూ పనిచేయలేదని చెప్పారు. తరువాత నేను వసంత్ కుంజ్ లో ఉన్న మరొక మెకానిక్ షాపుకు వెళ్ళాను. అక్కడ ఇక్బాల్ అనే పేరుతో ఒకతను ఉన్నాడు కాని, అతను నాకు సహాయం చేసిన వ్యక్తి కాదు. ఈరోజువరకు నాకు ఆవ్యక్తి నాకు తారసపడలేదు. ఇక్బాల్ రూపంలో వచ్చి నాకు సహాయం చేసినది బాబా తప్ప మరెవరూ కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆరోజు నేను మరచిపోలేని రోజు. బాబాకు నాప్రగాఢమయిన కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
( ది గ్లోరి ఆఫ్ శిరిడీ సాయి సౌజన్యంతో )
ఈ సంఘటనని బట్టి మనకేమి అర్ధమవుతోంది? శ్రీసాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయంలో బాబా అన్నమాటలు. “మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను."
బాబా సర్వాంతర్యామి. ఆయనకు తెలియని విషయాలు లేవు. మనకు కావలసినదల్లా ఆయనపై మనకు ప్రగాఢమయిన నమ్మకం.
ఓం సాయిరాం