17.12.2014 బుధవారం
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కానీ ఖర్చులేని వైద్యం - వెలకట్టలేనిది
ఈ రోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2008 సంచికలోని మరొక లీల తెలుసుకుందాము.
శ్రద్ధ, సబూరి, నమ్మ, విశ్వాసం ఇవన్నీ మనకు బాబా మీద ఉండాలే కాని, బాబా అధ్బుతమైన లీలలని ప్రదర్శిస్తారు.
సంగమేష్ హీరేమథ్ (సుభాగన్ ఈ సాయి నికేతన్ మాన్షన్, 87/701, ఏ వింగ్, పూనం సాగర్ కాంప్లెక్స్, మీరా రోడ్ (తూర్పు) బొంబాయి.
13 సంవత్సరాలుగా నేను బాబాని పూజిస్తూ ఉన్నాను. ఉద్యోగాన్వేషణలో నేను బొంబాయికి వచ్చినపుడు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. కొద్దిపాటి దుస్తులతో వచ్చాను. ఒక సాయిభక్తుడి ప్రభావం వల్ల నేను కూడా సాయిభక్తుడిగా మారి బాబాని పూజించసాగాను. బాబా ఆశీర్వాదం వల నాకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇపుడు నేను స్వంతంగా వ్యాపారం చేసుకొంటూ, వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నాను. మా అన్నయ్య శరణ్ బసవ హీరేమథ్ కి ఐశ్వర్య అనే 10సంవత్సరాల వయసుగల కుమార్తె ఉంది. ఆమె గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది. బొంబాయిలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో పరీక్ష చేయించాము. అందులో ఆమెకి గుండెలో 10 మిల్లీ మీటర్ల రంధ్రం ఉందనీ అది యింకా పెద్దదవుతూ ఉందనే విషయం బయటపడింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి దక్కదని చెప్పారు. మాబంధువు ఒకరు అమ్మాయిని బెంగళూరులో జై దేవ్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ కార్డియాలజీ లోను, నారాయణహృదయాలయాలోను చూపించమని చెప్పారు. అక్కడ కూడా డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయడం తప్ప గత్యంతరం లేదని చెప్పారు. ఆపరేషన్ కి లక్షలలో ఖర్చవుతుంది. మా అన్నయ్యకి అంత ఖర్చు భరించే స్థోమత లేకపోవడంతో, భారమంతా బాబా మీదే వేసి ప్రతీరోజు నిష్టగా బాబాని పూజిస్తూ ఈ కష్టాన్నుండి గట్టెక్కించమని ప్రార్ధిస్తూ ఉండమని సలహా యిచ్చాను.
నేను చెప్పినట్లుగానే క్రమం తప్పకుండా శ్రధ్ధాభక్తులతో బాబాని ప్రార్ధించడం మొదలుపెట్టారు. దాని ఫలితంగా ఐశ్వర్య ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనిపించింది. ఆరోగ్యం బాగా మెరుగు పడింది. సంవత్సరం తరువాత ఆస్పత్రిలో పరీక్ష చేయించాము. గుండెలోని రంధ్రం పెద్దదవడం ఆగిపోవడమే కాకుండా 10 మిల్లీమీటర్లు ఉన్న రంధ్రం 5 మిల్లీమీటర్లకి తగ్గిపోయింది. అమ్మాయి ప్రమాదం నుండి బయటపడింది. ఈమధ్య కాలంలో మేము అమ్మాయికి యిచ్చిన మందు బాబావారి పాద తీర్ధం, ఊదీ.
కానీ ఖర్చులేని వైద్యం.. (ఈ వైద్యానికి వెల కట్టగలమా?)బాబా మీద పూర్తి విశ్వాసంతో మా అన్నయ్య యిప్పుడు తమ యింటిని ఒక సాయి దేవాలయంగా మార్చేశారు. బాబా అనుగ్రహంతో వారు ఆయురారోగ్యాలతో హాయిగా ఉన్నారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)