15.05.2023 సోమవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –21 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
(శ్రీమద్భగవద్గీత 10 వ అధ్యాయములోని శ్లోకాలనే వేణుగోపాలస్వామి దేవాలయంలో వింటున్నప్పుడు
నాకు శ్రీ సాయి సత్ చరిత్రలోని విషయాలు గుర్తుకు వచ్చాయి. )
శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 10 విభూతి
యోగము
శ్లోకమ్ – 9
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్
కధయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి
చ
నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును
నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా
నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కధలు కధలుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు. మఱియు వారు సంతతము నాయందే రమించుచుందురు.
శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ –
10
షిరిడీ జనులు ధన్యులు. సాయియే వారి ఆరాధ్య దైవం. భోజన శయన వేళలందు కూడా నిరంతరం సాయి నామస్మరణలో
ఉండేవారు. వారు పొలాలలో పని చూసుకుంటున్నా,
ఇంటిలో ధాన్యం దంచుతున్నా, చెరుగుతున్నా, కూర్చుని ఉన్నా, బాబా మహిమను గానం చేసేవారు. సాయి వినా వేరు దైవాన్ని వారెరుగరు.
శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ –
10 శ్లోకమ్ – 20
అహమాత్మా గుడాకేశ సర్వ భూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ
ఓ! అర్జునా! సమస్త ప్రాణుల హృదయమందున్న ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు అంతము
నేనే. (ప్రాణులయొక్క సృష్టిస్థితి లయములకు
కారణము నేనే)
శ్లోకమ్ – 32
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్
ఓ! అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు
నేను. (సృష్టిస్థితి లయ కారకుడను నేనే) విద్యలలో అధ్యాత్మ విద్యను. అనగా బ్రహ్మవివ్యను నేను. పరస్పర వివాదములలో తత్త్వ నిర్ణయమునకై చేయు వాదమును
నేను.
శ్లోకమ్ – 39
యచ్చాపి సర్వ భూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్
ఓ! అర్జునా! సర్వ ప్రాణుల ఉత్పత్తికి
కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచర
ప్రాణి యేదియును లేదు.
అనగా సమస్తము భగవత్స్వరూపమే అని శ్రీకృష్ణపరమాత్మ
చెప్పుచున్నారని మనం గ్రహించుకోవచ్చు. ప్రాణుల
ఉత్పత్తికి కారణము అనగా బీజము తానే అని భగవానుడు చెప్పాడు. బీజము పరమాత్మ అయినపుడు మొలక మరియొకటి అవదు కదా. అదికూడా పరమాత్మే. ఈ విధంగా సమస్త జీవరాశులు భగవత్స్వరూపులే అని స్పష్ట
పడుతోంది.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 3
బాబా అన్న మాటలు…”మీరెక్కడున్నా సరే,
ఏం చేస్తున్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణముగా తెలుస్తాయనే విషయాన్ని ఎప్పుడూ
గుర్తుంచుకోండి. నేను నేను అని చెప్పే నేనే
అందరిలోనూ ఉన్న అంతర్యామిని. ఆ నేనే అందరి
హృదయాలలోనూ ఉన్నాను. అందరి స్వామిని నేనే. సర్వ భూతాలలోను, చరాచరాలలో బాహ్యాంభ్యంతరాలలో నిండి
ఉన్నాను. ఈ సకలం ఈశ్వరుని సూత్రం. నేను అతని సూత్రధారుణ్ణి. నేను సకల ప్రాణులకు మాతను. నేను త్రిగుణాల సామ్యావస్థను. కర్తా భర్తా సంహర్తా నేనే. సకలేంద్రియాలను నడిపించువాడను నేనే. నాయందు లక్ష్యమున్నవారికి ఏ కష్టాలుండవు. నన్ను మరచిపోయినవారిని మాయ బాధిస్తుంది. ఈ దృశ్యప్రపంచమంతా నా స్వరూపం. చీమలు, దోమలు పురుగు, పుట్ర, రాజు, పేద, సకల చరాచర
విశ్వమంతా నా రూపం”.
(శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 15 లో
కూడా బాబా ఇదే విధంగా చెప్పారు.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)