08.12.2015 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు 'ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి' 26 నవంబరు సంచికలో ప్రచురించిన ఒక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను.
ఈ లీలలో 'ఝుంకా భకార్, బాబా కి నైవేద్యం పెట్టినట్లు మీరు చదవబోతున్నారు. ఝుంకా భకార్ అనేది మహారాష్ట్రలోని వారు చేసుకునే వంటకం. భకార్ అనేది జొన్న పిండితో చేసే జొన్న రొట్టె. ఝుంకా అనేది ఆ రొట్టెలలో నంచుకుని తినేందుకు చేసే చట్నీ. ఝుంకా చట్నీ ని మన ప్రాంతంలో 'చింతామణి చట్నీ' అంటారు. ఈ చట్నీని శనగపిండితో చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది.
దీనికి సంబంధించిన వీడియో లింకులు కూడా ఇస్తున్నాను చూడండి. ఇక బాబా లీలను అందరం ఆస్వాదిద్దామా? తరువాతి సంచికలొ యధావిధిగా శ్రీ జీ.ఎస్. కపర్డే డైరీ ప్రచురిస్తాను. మధ్య మధ్యలో బాబా లీలలను ప్రచురిస్తూ ఉంటాను.
ఝుంకా భకార్ కి సంబంధించిన వీడియో లింకులు
షిరిడీ సాయి వైభవం - బాబా మహిమ అమోఘం
కేశవ్ ఎం.గవాంకర్ తన తల్లిదండ్రులతో బొంబాయిలో ఉన్నప్పుడు, అతనికి 7 సంవత్సరాల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎంతో మంది వైద్యులకి చూపించి మందులు వాడినా ఏమాత్రం తగ్గలేదు. జ్వర తీవ్రత చాలా హెచ్చుగా ఉంది. చాతీ అంతా ద్రవం, రసిలతో నిండిపోయింది. చావుకు దగ్గరగా ఉన్నాడు. వారింటికి దగ్గరలోనే ఉన్న సాయిభక్తుడయిన గాల్వంకర్ (ధబోల్కర్ గారి అల్లుడు), బాబాని ప్రార్ధించి మొక్కుకోమని అతని తల్లిదండ్రులకి సలహా ఇచ్చాడు. వారింటి ప్రక్కనే ఉన్న అతని మేనత్త, తన మేనల్లుడికి నయమయితే అందరం కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు పాలకోవాలు సమర్పించుకుంటానని మొక్కుకుంది.