11.12.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ. జీ.ఎస్.కపర్డే డైరీ - 10
ఈ రోజు శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ లోని మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము
18.12.1911 సోమవారం
నిన్నటికన్నా నా గొంతు ఈ రోజు కాస్త నయంగా ఉంది. ప్రార్ధన తరువాత షింగ్లే, వామనరావు పటేల్, దర్వేషి సాహెబ్, ఇతని పూర్తిపేరు దర్వేష్ హాజీ మహమ్మద్ సద్దిక్, కళ్యణ్ ప్రాంతవాసి వీరితో మాట్లాడుతూ కూర్చున్నాను. సాయిమహరాజ్ బయటకు వెళ్ళటం చూశాను. ఆయన తిరిగి వచ్చాక మసీదుకు వెళ్ళాను.
"నేను ఇక్కడ అన్ని కష్టాలు పడుతూ నిద్ర లేకుండా ఉంటే నువ్వేమో నీ బకెట్ పూర్తిగా నింపుకుని వేప చెట్టు క్రింద చల్లని గాలులను ఆనందంగా అనుభవిస్తూ సంతోషంగా ఉన్నావు" అని అన్నారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయనను పూజించుకోవడానికి చాలా మంది వచ్చారు. నా భార్య కూడా వచ్చింది. మధ్యాహ్న ఆరతి అయిన తరువాత తిరిగి వచ్చాము. భోజనమయిన తరువాత హాజీ సాహెబ్, బాపూ సాహెబ్ జోగ్ ఇంకా మరికొందరితోను మాట్లాడుతూ కూర్చున్నాము. సాయంత్రం అవబోతుండగా మేము మసీదుకు వెళ్ళి సాయి మహరాజ్ వద్ద కూర్చున్నాము. ఇక పొద్దు పోతుండగా ఆయన మాకు సెలవిచ్చారు. యధాప్రకారంగా చావడి ముందు నిలబడి ఆయనకు నమస్కారం చేశాను. బసకు తిరిగి వచ్చిన తరువాత భీష్మ భజన వింటూ కూర్చున్నాను.
పి.ఎస్.
సెంట్రల్ ప్రెస్ లో పనిచేసే ఉద్యోగి ఒకతను తన భార్య, కూతురుతో ఈ రోజు వచ్చాడు. తను అంతకు ముందు నన్ను బొంబాయిలోను, మరలా నేను నాకుంటుంబంతో సహా మా మూడవ అబ్బాయి పెళ్ళికి వెడుతున్నపుడు పూనా రైల్వే స్టేషన్ లోను చూసినట్లు చెప్పాడు. అతను మంచి మనిషి, భక్తి తత్పరుడు. బాసీన్ ప్రాంతానికి చెందిన గోవిందరావు గండ గోల్ అతనితో వచ్చాడు. అతను నాతోపాటే ఉంటాడు. అతను అమరావతి వెళ్ళకుండా అకోలా నుండి వచ్చాడు. అతను వంటరిగానే ఉంటున్నాడు. అతనితో ఎవరూ లేరు.
19.12.1911 మంగళవారం
ఉదయం పెందరాడే నిద్ర లేచాను. స్నానం కానిచ్చి ప్రార్ధన చేసుకున్నాను. హాయిగా అనిపించింది. నేను ప్రార్ధన చేసుకునే సమయంలో సాయి మహరాజ్ బయటకు వెళ్ళారు. అందుచేత ఆయన దర్శనం చేసుకోలేకపోయాను. తరువాత నేను మశీదుకు వెళ్ళాను. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన ఒక కధ చెప్పారు. "ఒక ధనికుడు ఉన్నాడు. అతనికి అయిదుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు ఆస్తి పంపకాలు చేసుకున్నారు. నలుగురు కొడుకులు స్థిర చరాస్థులను పంచుకున్నాను. అయిదవ వానికి, కుమార్తెకు వాటా దక్కలేదు. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ సాయిబాబా వద్దకు వచ్చారు. వారి వద్ద ఆరు బళ్ళనిండా ఆభరణాలున్నాయి. ఆరు బళ్ళలో రెండింటిని దొంగలు దోచుకున్నారు. మిగిలిన నాలుగింటిని మఱ్ఱిచెట్టు క్రింద ఉంచారు." ఈ విషయం చెబుతున్నపుడే బాబా మారుతి అని పిలిచే త్రయంబకరావుని పిలవడంతో కధకి అంతరాయం కలిగి కధ ప్రక్క దారి పట్టింది. మధ్యాహ్న హారతి తరువాత బసకు తిరిగి వచ్చాను. భోజనమయిన తరువాత దర్వేష్ సాహెబ్ తో మాట్లాడుతూ కూర్చున్నాను. అతను మంచి సరదా అయిన వ్యక్తి. ఈ రోజు వామనరావు వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ కూడా తను వెళ్ళేముందు వెడుతున్నానని చెప్పేవాడు కాదు. మధ్యాహ్నం రామ మారుతి బువా వచ్చాడు. భజన చేసే సమయంలో అతను బాగా ఎగురుతూ నాట్యం చేశాడు. సాయంత్రం, మరలా రాత్రి శేజ్ ఆరతి సమయంలోను సాయి మహరాజ్ ను దర్శించుకున్నాము.
భీష్మ భజన చేసేటప్పుడు రామమారుతి ఎగురుతూ నాట్యం చేశాడు. మధ్యాహ్నం సాయిమహరాజ్, డేంగలేను చూడటానికి నీం గావ్ వెళ్ళి, చెట్టు కొట్టి తిరిగి వచ్చారు. అనేకమంది వాయిద్యాలు మ్రోగిస్తూ సాయి వెంట వెళ్ళారు. నేను వెళ్ళలేదు. సాయికి నమస్కారం చేసుకోవటానికి రాధాకృష్ణమాయి మా వాడా దగ్గరకు వచ్చింది. ఆమెను మేలు ముసుగు లేకుండా చూడటం నాకదే మొదటిసారి.
(మరికొన్ని విశేషాలు మరుసటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment