30.04.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి భక్తులైన శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్ గురించి సమగ్రంగా తెలుసుకుందాము. బహుశ రెండు నెలల క్రితం శ్రీ షిరిడీ సాయి వైభవంలో ప్రచురించాను. అందులో పూర్తి సమాచారమ్ లేదు. నిన్ననే "సాయిఅమృతాధార' అనే ఆంగ్ల వెబ్ సైటులో పూర్తి సమాచారం కనిపించింది. సాయిబంధు శ్రీ చాగంటి సాయిబాబా గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, వెంటనే దీనిని అనువాదమ్ చేయాలనిపించింది. ఇందులోని కొన్ని సంఘటనలు ఇంతకు ముందు మీరు చదివే ఉంటారు. ఇప్పుడు పూర్తిగా చదవండి.
కేశవ్ భగవాన్ గావన్ కర్
(28
ఏప్రిల్, 1906 – 29 జూన్ 1985)
ముంబాయికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసై గ్రామమయిన బెస్తలపల్లె ఆర్నాల గ్రామంలో డా.కేశవ భగవాన్ గావన్ కర్ గారు 28.04.1906 వ.సంవత్సరం శనివారం, వైశాఖ శుక్ల పక్ష పంచమినాడు (శక సం.1828) లో జన్మించారు. (ఈయనని ప్రేమగా అప్పాసాహిబ్ అని కూడా పిలిచేవారు). ఆయన పూర్వీకులు కూడా ఆర్నాల గ్రామానికి చెందినవారే. వారి కుటుంబమంతా ప్రతి రోజు ఎంతో భక్తి శ్రధ్ధలతో గణేశుడిని పూజిస్తూ ఉండేవారు. ఆయన అనుగ్రహం వారందరికీ పుష్కలంగా ఉంది. కుటుంబంలోనివారంతా ఎంతో భక్తి తత్పరులు.