Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 1, 2011

బాబాతో సాయి బా ని స అనుభవాలు 16

0 comments Posted by tyagaraju on 5:28 PM









02.10.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి దసరా శుభాకాంక్షలు

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 16 వ అనుభవాన్ని తెలుసుకుందాము



ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు.

బాబాతో సాయి బా ని స అనుభవాలు 16



శ్రీ సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయంలో సాయినాధులవారు కపర్ధే కుమారునియొక్క ప్లేగు వ్యాధిని మరియు శ్రీ సాయి సచ్చరిత్ర 34 వ అధ్యాయములో డాక్టరు పిళ్ళేకి నారి కురుపు వ్యాధిని నివారించిన విధానము మనందరికీ తెలిసినదే. శ్రీ సాయి ఎంతో మందికి శారీరిక రుగ్మతలను తొలగించారు. శ్రీ సాయి ఈనాడు శరీరంతో లేకపోయినా ఇప్పటికీ తన భక్తులయొక్క శారీరిక బాధలను స్వీకరించి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు అని చెప్పడానికి నాకు జరిగిన అనుభవాన్ని మీముందుంచుతున్నాను.

అది 1993 వ సంవత్సరము జనవరి 12 వ తారీకు. నాకుడికాలి మడమవద్ద తీవ్రమయిన నొప్పితో బాధపడుతూ నడవలేకున్నాను. రాత్రి నిద్రకు ముందు బాబాను నన్నీ కాలి నొప్పి బాధనుండి విముక్తుణ్ణి చేయమని వేడుకున్నాను. 13.01.1993 ఉదయము 5 గంటల సమయము. మాయింటిలో ఉన్న పెంపుడు పిల్లి నేను నిద్రిస్తున్న గది తలుపు దగ్గిరకి వచ్చి విపరీతమయిన బాధతో ఏడవసాగింది. నా భార్య తలుపు తీయగానే ఒక కాలు విరగకొట్టుకుని మూడు కాళ్ళమీద కుంటుతూ నావైపు రావడాన్ని చూసాను. మా పెంపుడు పిల్లి అలా బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. నేను కాలి నొప్పితో నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కొన్ని గంటలముందు సాయిని నా కాలినొప్పిని నివారించమని ప్రార్థించాను, శ్రీ సాయి మా పెంపుడుపిల్లి రూపములో ఒక కాలు విరగగొట్టుకుని నా బాధను స్వీకరించుచున్నారా అనే ఆలోచన కలిగింది. ఆ సమయమునుండి 24 గంటలలో నా కాలినొప్పి పూర్తిగా తొలగిపోయినది. కాని మా పెంపుడు పిల్లి కాలు నొప్పితో పది రోజులు బాధపడింది. ఆ పదిరోజుల తరువాత మా పెంపుడు పిల్లి యెక్కడికి వెళ్ళిపోయినదో తెలియలేదు, కాని శ్రీ సాయి పెంపుడు పిల్లి రూపములో నాకాలి నొప్పిని స్వీకరించి నన్ను రక్షించారని ఈ నాటికీ నమ్ముతున్నాను.

అది 15.03.1993 వ సంవత్సరము. నాకు హృద్రోగ సమస్య తలయెత్తింది. వైద్య పరీక్షల కోసం 17.03.1993 న మెడ్విన్ ఆస్పత్రికి చేరుకున్నాను. ఆ వైద్య శాలలో వైద్యులు నా గుండె మీద స్ట్రెస్ టెస్ట్ (వత్తిడిని కలిగించే పరీక్ష) చేయటానికి నా శరీరం మీద అనేక చోట్ల ఎలక్ట్రోడులను అమర్చారు.


నా ప్రక్క మంచముపై ఉన్న ఒక రోగికి ట్రెడ్ మిల్ పరీక్ష చేశారు. ఆ రోగి చాలా అసౌకర్యానికి లోనయ్యాడు. అతని తరువాత నాకు ఆ ట్రెడ్ మిల్ టెస్ట్ చేయడానికి డాక్టరుగారు సన్నిథ్థులైనారు. నాకన్న ముందు రోగికి జరిగిన పరీక్ష చూసిన తరువాత నాలో భయము ఆవహించినది. సాయీ, నీవే స్వయముగా వచ్చి ఈ పరీక్షను నిర్వహించాలని ప్రార్థించాను. విచిత్రముగా నాకు పరీక్ష నిర్వహించవలసిన డాక్టరు తన స్వంత పనిమీద బయటికి వెళ్ళిపోయినాడు. మరొక డాక్టరు వచ్చి నాపై ట్రెడ్ మిల్ టెస్ట్ చేయసాగినాడు. ఆ సమయములో ఆ డాక్టరు క్రిందకు వంగి ఆ ట్రెడ్ మిల్ టెస్ట్ యొక్క పరికరములను తదితర యంత్రాలను పరీక్షించసాగినాడు. ఆ సమయములో ఆతని మెడలో ఉన్న లాకెట్టు బయటకు వచ్చినది. నా దృష్టి ఆ లాకెట్టుపై పడింది. ఆ లాకెట్టుపైన శ్రీ షిరిడీ సాయినాఢుని అభయహస్తముతో ఉన్న ఫొటొ నన్ను ఆశీర్వదింపసాగింది. నాలో ధైర్యము వచ్చినది. ఆ ట్రెడ్ మిల్ టెస్ట్ పూర్తి అయినది. ఆ డాక్టరు నా అనారోగ్య విషయములో చింతింపవలదని చెప్పి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి నెలకు సరిపడా ఔషధాలు కూడాఇచ్చి వెళ్ళిపోయినాడు. శ్రీ సాయి ఏ స్వయంగా నాకు ట్రెడ్ మిల్ టెస్ట్ నిర్వహించి ఔషధాలిచ్చారని ఈ నాటికీ నమ్ముతున్నాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు





బాబాతో సాయి బా ని స అనుభవాలు 15

0 comments Posted by tyagaraju on 7:10 AM



01.10.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి దసరా శుభాకాంక్షలు

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 15 వ అనుభవాన్ని తెలుసుకుందాము.

బాబాతో సాయి బా ని స అనుభవాలు 15


శ్రీ సాయి సచ్చరిత్రలోని 33 వ అధ్యాయంలో ప్రముఖంగా శ్రీ అప్పా సాహెబ్
కుల్ కర్నీకి జరిగిన సంఘటన చెప్పబడింది.ఆ సంఘటన మనమొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. శ్రీ కుల్ కర్నీ భార్య తాను ఒక ఫకీరుకు బాబా పేరు మీద ఒక రూపాయి దానము చేశానని చెప్పినది. తన భార్య చేసిన మంచి పనికి సంతోషించి ఆ సమయములో తాను ఉండి వుంటే బాబా పేరిట ఆ ఫకీరుకు పది రూపాయలు ఇచ్చి వుండేవాడిని కదా అని తలిచెను. వెంటనే తాను ఆ ఫకీరు గురించి వెతకటము ప్రారంభించి ఆ ఫకీరుకు పది రూపాయలు ఇచ్చినాడు. ఇది మనకు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును గుర్తు చేస్తుంది. శ్రీ సాయికి మన మనసులోని ఆలోచనలు తెలుసు. దానికి తగిన విధంగా మన నమ్మకాన్ని పెరిగేలాగ చూస్తారు.

ఇటువంటి సంఘటనే నాకు కూడా జరిగింది. ఇప్పుడు ఆ సంఘటనను మీతో పంచుకుంటాను. 1970 వ సంవత్సరము హోళీ పండుగ రోజున సికిందరాబాదులోని శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయములో నా వివాహము జరిగినది.

ప్రతీ సంవత్సరము హోళీ పండగ రోజున నేను నా కుటుంబ సభ్యులము ఆ మందిరానికి వెళ్ళి పూజలు చేయటము అలవాటుగా మారింది. అది 1991 వ సంవత్సరము హోళీ పండగ రోజు. యెప్పటిలాగే గుడికి వెళ్ళాము. సాయిని పోలిన ఒక సన్యాసి అ మందిరము దగ్గిరకి వచ్చి తాను విజయవాడ కనక దుర్గమ్మ మందిరమునుంచి వచ్చినానని తనకి ఏదయిన దానము చేయమని కోరినాడు. నాకు అలవాటు ప్రకారము ఒక రూపాయి దానము చెశాను. పూజలు చేసుకోవడానికి నేను, నా భార్య గుడిలోపలికి వెళ్ళాము. పూజారిగారు మంత్రాలు చదవడంలో నిమగ్నమై ఉన్నారు. నా మనసులో మాత్రము ఒక విధమైన అలజడి ప్రారంభమయినది. ఈ వివాహ వార్షికోత్సవ సందర్భంలో విజయవాడ కనకదుర్గమ్మ మందిరమునించి వచ్చిన సన్యాసికి పది రూపాయలు దానము చేసిఉండిన బాగుండేదని ఆలోచించాను.

నేను నా భార్య కన్యకాపరమేశ్వరీ దేవికి పూజలు పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఒక బెంచీ మీద కూర్చుని అప్పటి వరకు మా జీవితంలో జరిగిన సంఘటనలు నేను నా భార్య మాట్లాడుకోసాగాము. ఆ సమయంలో మా ముందుకు ఒక సిక్కు సన్యాసి వచ్చి తాను నాందేడులోని గురుద్వారాలో సేవకుడనని పరిచయము చేసుకుని నానుండి పదిరూపాయల దక్షిణ కోరినాడు.


ఒక్కసారిగా నా మనస్సు సంతోషముతో నిండిపోయినది. నా మనసులోని ఆలోచనలను బాబా తెలుసుకుని నా నుండి పదిరూపాయలు దక్షిణ కోరుతున్నారని భావించాను. నేను నా భార్య కు ఈ విషయము తెలియచేసి పది రూపాయల నోటును ఆ సిక్కు సన్యాసికి దక్షిణగా ఇచ్చినాను. ఆ సిక్కు సన్యాసి చిరునవ్వుతో నానుండి దక్షిణ స్వీకరించి మమ్ములను ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. ఆ గుడిలోని పూజానంతరము ఇంటికి వచ్చి నా యింటిలోనిపూజా మందిరములోని సాయి పటానికి నమస్కరించినప్పుడు ఆ సిక్కు సన్యాసియొక్క చిరునవ్వు గుర్తుకు వచ్చినది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Friday, September 30, 2011

సాయితో సాయి బా ని స అనుభవాలు 14

0 comments Posted by tyagaraju on 7:34 AM



30.06.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి దసరా శుభాకాంక్షలు

రెండు రోజులుగా కరెంట్ కోతల వల్ల ప్రచురించడానికి అంతరాయం కలిగింది. ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 14 వ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.


సాయితో సాయి బా ని స అనుభవాలు 14

శ్రీ సాయి ధనవంతుల స్వప్నాలలో కనిపించి, వారి ద్వారా తాను చేయదలచిన కార్యాలను చేయించడానికి వారిని సాధనంగా ఉపయోగించుకునేవారు. ఆ పనులన్ని కూడా పేదవారికీ సమాజానికీ ఉపయోగపడేవిగా ఉండేవి. అటువంటి ఉదాహరణలలో అద్భుతమైనది బూటీవాడా నిర్మాణము. గోపాల్ ముకుంద్ బూటీకి కలలో సాయి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన బూటీ వాడాను నిర్మించాడు. ఈనాడు బాబా సమాధి మందిరము (బూటీవాడా) కోటానుకోట్ల సాయి భక్తులకు ప్రశాంతతను ప్రసాదించుచున్నది. శ్రీ సాయి సచ్చరిత్రలోని 45 వ అధ్యాయములోని సంఘటను గుర్తు చేసుకుందాము. శ్రీ సాయి ఆనందరావ్ పాఖడే స్వప్నంలో కనపడి మాధవరావ్ దేశ్పాండేకి ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు. శ్రీ శ్యామా ఆ పట్టుధోవతీని స్వీకరించారు. అటువంటి అనుభవమే నాకు 1993 వ సంవత్సరములో జరిగింది.

1992 వ సంవత్సరం మే నెలలో మా అమ్మాయి వివాహము జరిగినది. 1993 సంవత్సరము సంక్రాంతి పండగ సందర్భముగా మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించడానికి 2.1.1993 న హైదరాబాదునుండి విజయవాడకు బస్సులో బయలుదేరాను. రాత్రి ప్రయాణము వల్ల బస్సులో నాకు కొంచెం నిద్ర పట్టింది. శ్రీ సాయి షిరిడీలోని సమాధి మందిరములో విగ్రహము పక్కన ఒక స్త్రీమూర్తి రూపములో నిలబడి నీవు నీవాళ్ళకు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నావే, మరి నాకు రెండు కొత్త చీరలు ఇవ్వరాదా అని అడిగిందామె. ఉదయము మా వియ్యాలవారికి నూతన వస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణములో బాబా స్త్రీమూర్తి రూపములో కోరిన రెండు కొత్త చీరలను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించసాగాను.

అది 4.1.1993 ఉదయము, శ్రీ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలు పారాయణ పూర్తి చేసాను. పారాయణ కాలములో ప్రతిదినము పిడికెడు బియ్యము ఒక సంచీలో వేసి ఉంచేవాడిని. పారాయణ అనంతరము ఆ బియ్యము పేదలకు పంచి పెట్టేవాడిని. ఆ రోజున ఆ బియ్యాన్ని గండిపేటలో ఉన్న ఒక వృధ్ధుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆసాయంత్రము ఆ ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ ఆశ్రమములో ఒక ఆరుగురు మగవారు ఇద్దరు ఆడవారు మాత్రమే ఉన్నారు. ఆ ఆశ్రమ మానేజరుకు ఆ బియ్యాన్ని ఇచ్చిన తరువాత బయటకు వస్తూండగా ఆ ఆశ్రమములో ఉన్న ఇద్దరు వృధ్ధ స్త్రీలు నన్ను చిరునవ్వుతో పలకరించారు. అప్పుడు నాకు 2.1.1993 రాత్రి బాబా ఒక స్త్రీ రూపములో స్వప్నములో దర్శనమిచ్చి రెండు కొత్త చీరలు కోరిన సంఘటన గుర్తుకు వచ్చినది.. వెంటనే నేను నా పర్సులోనించి 202/- రూపాయలు తీసి ఆ ఇద్దరు స్త్రీలకు సమానముగా ఇచ్చి కొత్త చీరలు కొనుక్కుని ధరించమని కోరినాను. ఆ వృధ్ధ స్త్రీలు సంతోషముతో నన్ను ఆశీర్వదించినారు. వారి చిరునవ్వును చూసిన తరువాత శ్రీ సాయి నానుండి ఆ వృధ్ధ స్త్రీల రూపములో నూతన వస్త్రాలు స్వీకరించారని భావించినాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Tuesday, September 27, 2011

బాబాతో సాయి బా ని స అనుభవాలు 13

0 comments Posted by tyagaraju on 8:17 AM


27.09.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయితో సాయి బా ని స అనుభవాలలో 13వ అనుభవాన్ని తెలుసుకుందాము. సాయి బా ని స అనుభవాలను చదివిన ప్రతీవారికి మనకు కూడా యిటువంటి అనుభూతులు కలిగితే యెంత బాగుండును అని అనుకోవడం సహజం.

బాబాతో సాయి బా ని స అనుభవాలు 13


సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి 22, 42 వ. అధ్యాయాలలో సకల జీవరాసులలోనూ భగవంతుడిని చూడమని చెప్పినారు. లక్ష్మీ బాయిషిండే, ఒక రొట్టెముక్కను పెట్టి ఆకలిని తీర్చిన శునక రూపంలో వచ్చింది తానేనని చెప్పారు. యెవరయితే ప్రాణులన్నిటిలోనూ తనని చూసి వాటి ఆకలిని తీరుస్తారో వారే తన నిజమైన భక్తులని చెప్పారు. ఆయన చెప్పిన బోధనలు సత్యమని నిరూపించేందుకు నాకు కూడా రెండు అనుభవాలు కలిగాయి. వాటిని నేను మీకిప్పుడు వివరిస్తున్నాను.

బాబాకి భోజనము పెట్టడానికి ద్వారకామాయికి వెళ్ళుతూ దారిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకి రొట్టెముక్క పెట్టి ద్వారకామాయిలోబాబాని దర్శించుకున్నప్పుడు బాబా అన్న మాటలు "లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది." యెవరయితే సకల జీవరాసిలోనూ భగవంతునిచూసి వాటి ఆకలిని తీరుస్తారో వారు నాకు నిజమైన భక్తులని" బాబా చెప్పినారు.

అది 1991 వ సంవత్సరము దీపావళీ పండగ రోజు. ఆ రోజు సాయంత్రము నేను నా భార్య ఒక పురోహితుడిని పిలిచి నాయింటి మొదటి అంతస్తులో ఉన్న పూజా గదిలో లక్ష్మీ పూజ చేయ సాగాము. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. కాని నా మనసంతా సాయిమీదే లగ్నమయి ఉంది. లక్ష్మీ పూజ పూర్తి అయ్యేలోపులో శ్రీ సాయి ఏదో ఒక రూపములో వచ్చి నన్ను నా భార్యను ఆశీర్వదించినా నేను సంతోషిస్తాను అని తలిచాను. శ్రీ సాయి ఒక స్నేహితుడి రూపములో గాని, నా బంధువు రూపములో గాని వచ్చి మమ్మలిని ఆశీర్వదిస్తారని ఊహించుకోసాగాను. పూజలో లక్ష్మీ దేవికి హారతి ఇస్తున్న సమయంలో నా కాళ్ళకు మెత్తటి బట్ట తాకిన అనుభూతిని పొందాను. నేను కింద నా కాళ్ళవైపు చూసుకున్నాను, నాకు ఆశ్చర్యము కలిగింది. ఒక పెద్ద పరిమాణములో ఉన్న బోదురు కప్ప నా పాదాలను తాక సాగినది.


బాబా ఈ కప్ప రూపములో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారా అనే భావన కలిగి ఆ కప్పకు నమస్కరించాను. ఆ రోజు వర్షము కూడా పడలేదే? అంతకు ముందు వారమురోజులలో కూడా ఎక్కడా వానలు పడలేదే? మరి ఈ బోదురుకప్ప యెక్కడినించి వచ్చినదని నా భార్య ఆశ్చర్యపడసాగినది. నేను నా భార్య ఆకప్పకు మరొక్కసారి నమస్కరించాము ఆ కప్ప సంతోషముతో ఒక్కొక్క మెట్టు దిగుతూ తోటలోనికి వెళ్ళిపోయినది. బాబా నన్ను నా భార్యను ఆశీర్వదించడానికి ఈ బోదురుకప్ప రూపములో వచ్చినారని భావించాను.

అది 1991 వ సంవత్సరము బక్రీదు పండగ రోజు. ఆఫీసుకు సెలవు ఉండటము వలన మధ్యాహ్న్నము పన్నెండు గంటలకు యింటిలో భోజనము చేసి తాంబూలము వేసుకుని వీధిలోకి వచ్చినాను. నా యింటి గేటుముందు నాలుగు అడుగుల యెత్తు ఉన్న ఒక తెల్లటి మేక కనపడింది ఆ మేకకు తెల్లటి గెడ్డము కూడా ఉన్నది.

ఆ మేక తాను ఆకలితో ఉన్నట్లుగా నావైపు జాలిగా చూడసాగింది. శ్రీ సాయి సచ్చరిత్ర 9 వ అధ్యాయములో బాబా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి "భగవంతుడిని జీవులన్నిటిలోనూ చూడుము." మరి బాబా నా యింటికి మేక రూపములో వచ్చి ఆకలితో ఉన్నానని చెపుతున్నారా అని భావన కలిగింది. నేను నాభార్యను పిలిచి బాబా ఆకలితో ఉన్నారు ఏమయినా పెట్టగలవా అని అడిగినాను. అప్పటికి ఆమె బాబాకు భక్తురాలు కాదు. ఆమె కొంచెం హేళనగా మీ బాబా రాత్రి మిగిలిపోయిన రొట్టెలను తింటారా అని అడిగినది. నేను, నీవు ప్రేమతో పెడితే బాబా తప్పక తింటారని అన్నాను. నా భార్య ఒక నాలుగురోట్టెలు ఆ మేకకు పెట్టినది. ఆ మేక సంతోషముగా నాలుగురొట్టెలను తింది, నేను చిన్న బకెట్ తో మంచినీరు పెట్టినాను. సంతోషముగా నీరు కూడా త్రాగి తృప్తిగా నావైపు నా భార్యవైపు చూసి వెళ్ళిపోయినది. బక్రీదు పండగ రోజున బాబా ఒక తెల్లటి మేక రూపములో వచ్చి నా యింట భోజనము చేసి నన్ను నా భార్యను ఆశీర్వదించారనే భావన కలిగింది.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Monday, September 26, 2011

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు - 12

0 comments Posted by tyagaraju on 8:06 AM







26.09.2011 సోమవారము

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 12 వ అనుభవాన్ని తెలుసుకుందాము.


బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు - 12
శ్రీ సాయి సచ్చరిత్ర 38 వ అధ్యాయంలో అన్నదానము గురించి ప్రముఖంగా చెప్పబడింది. శ్రీ సాయి ఆకలి గొన్నవారికి తనే స్వయంగా వండి వడ్డించేవారు.


భోజనం వేళకు యెవరు ఏరూపంలో వచ్చినా సరే వారికి ఆతిధ్యమిమ్మని సాయి నొక్కి వక్కాణించేవారు. సామూహిక భోజనాలప్పుడు, వివాహాలూ, పూజలు సమయాలలో బాబాని భోజనానికి ఆరోజుల్లోఆయన భక్తులు ఆహ్వానించేవా రు
శ్రీ సాయి సచ్చరిత్ర 40 వ అధ్యాయంలో శ్రీ బీ.వీ.దేవ్ తన యింట జరుగుతున్న ఉద్యాపన కార్యక్రమానికి అన్న సంతర్పణ కార్యక్రమానికి సాయిని ఆహ్వానించగా శ్రీ సాయి ఒక బెంగాలీ సన్యాసి యిద్దరు శిష్యులతో వచ్చి భోజనము చేసి వెళ్ళిన సంఘటన మనకందరకు తెలిసినదే. అటువంటి సంఘటన నా జీవితంలో జరిగినదని సవినయంగా మీకందరకూ తెలియచేస్తున్నాను. అది 1991 వ సంవత్సరము. నా యింటి నిర్మాణము పూర్తి అయిన సందర్భములో విజయదశమి పర్వదినాన నా గృహనిర్మాణములో పనిచేసిన పనివారలను ఆరోజు భోజనానికి ఆహ్వానించాను. ఆరోజు జరిగే భోజనకార్యక్రమములో శ్రీ సాయిని కూడా వచ్చి భోజనము చేయమని వేడుకున్నాను. నేను 15 మందిని ఆహ్వానించినాను. ఈ 15 మందిలో కనీసం 10 మంది భోజనానికి వస్తారు ఆ 10 మందిలో సాయి కూడా ఉంటారు, ఆ తరువాత ఈ 10 మంది భోజనం చేసిన తరువాతనే నేను భోజనము చేస్తానని సంకల్పిచుకున్నాను. బాబాకు మధ్యాహ్న్న ఆరతి పూర్తి అయిన తరువాత వచ్చిన పనివారందరికీ భోజనాలు వడ్డించినాము. భోజన పంక్తిలో 9 మందే భోజనము చేయసాగారు. ఆ 9 మంది భోజనాలు పూర్తి చేసుకుని సంతోషముగా వారు తమ యిండ్లకు వెళ్ళిపోయినారు. కనీసము 10 మంది భోజనానికి వస్తారని ఆలోచనలో ఉండి పదవ మనిషి గురించి యెదురు చూడ సాగాను. నా భార్య తానిక ఆకలికి తట్టుకోలేనని తన భోజనము పూర్తి చేసినది. బాబా యింకా భోజనానికి రాలేదు. బాబాని పదవ మనిషిగా భోజనానికి వస్తారని ఆయన రాకకోసం యెదురు చూడసాగాను. మధ్యాహ్న్నము మూడు గంటలయినది. నాలోని సహనానికి ఒక పరీక్షగా మారింది. నా భార్య నన్ను చూసి చిరాకు పడసాగినది. బాబా ఈ రోజు నా యింటికి భోజనానికి రారా అనే బాధలో సాయంత్రము నాలుగు గంటల వేళ నా భార్య వచ్చి నన్ను భోజనము చేయమని శాసించినది. ఆ సమయములో బాబా మీద నమ్మకంతో బాబానుండి ఒక సందేశము కోరదలచి అంతకు ముందురోజున పుస్తకాలషాపులో కొన్న కొత్త పుస్తకము,"సాయిబాబా ఆఫ్ షిరిడీ ఏ యూనిక్ సైంట్" నాకళ్ళ ముందు కనిపించింది. బాబా శరీరంతో నా యింటికి రాకపోయినా కనీసము ఈ పుస్తకము ద్వారా ఏదయినా సందేశము ఇవ్వగలరా అనే ఆలోచనతో ఆ కొత్తపుస్తకముపై ఉన్న ప్లాస్టిక్ కవరును తొలగించి బాబాను ప్రార్థించి కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచినాను. అది 134, 135 పేజీలు వచ్చినవి 134 పేజీలో నాకేమీ సందేశము దొరకలేదు. 135 వ పేజీ ఆఖరి పేరాలో బాబా శరీరంతో ద్వారకామాయిలో ఉన్నరోజులలో అన్న మాటలు "నన్నింకా తినమని అడుగుతున్నావా, నా భోజనము పూర్తి అయినది. నీవు నీయింటికి వెళ్ళి భోజనము చేయి" అనే మాటలు చదివి శ్రీ సాయి నా యింట వచ్చి భోజనము చేసినారు అనే భావనతో బాబాకు నైవేద్యముగా పెట్టిన పళ్ళెము వైపు చూసినాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయినాను. ఒక గండు చీమ బాబాకు నైవేద్యముగా పెట్టిన మిఠాయిని తినడము ఆ మిఠాయి చుట్టూ ప్రదక్షిణలు చేయడము నన్ను ఆశ్చర్యపరచినది.


శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి 9వ అధ్యాయములో అన్న మాటలు "నీ భోజనమునకు పూర్వము ఏ కుక్కను చూచి నీవు రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటే. అట్లాగే పిల్లులు, పందులు, ఈగలు, చీమలు, ఆవులు, మొదలుగా అన్నియు నా అంశములే. నేనే వాని ఆకారములో తిరుగుతున్నాను. ఎవరయితే జీవ కోటిలో నన్ను చూడగలుగుదురో వారే నాప్రియ భక్తులు."


బాబా నేను కోరుకున్న పదవ మనిషి ఈ చీమ రూపములో వచ్చి భోజనము చేసినారు అని భావించి నాలుగంటల ముప్పయి నిమిషాలకు నేను భోజనము చేసి భోజనానంతరము బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, నా భార్యతో నా సంతోషాన్ని పంచుకున్నాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Sunday, September 25, 2011

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11

0 comments Posted by tyagaraju on 7:39 AM

25.09.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత నాలుగు రోజులుగా సాయి బా ని స అనుభవాలను అందించలేకపోయాను. హైదరాబాదు నుంచి నరసాపురం ప్రయాణం, వచ్చిన తరువాత ఇప్పటి పరిస్థితులలో కరంటు కోత వల్ల వీలు పడకపోవడం మొదలయిన కారణాలతో ఆలశ్యమయింది.

ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 11 వ అనుభవాన్ని మీకందిస్తున్నాను.


బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11

శ్రీ సాయి తన భక్తుల కలలలో కనపడి కొన్ని విషయాలను చెప్పి, భవిష్యత్తు గురించి తగు జాగ్రత్తలను చెప్పేవారని మరియు వారితో తన అనుబంధాలను తెలియచేసేవారని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక చోట్ల ఉదహరింపబడింది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు హెచ్చరికలు ఇంతకుముందు నా అనుభవాలలో మీకు నేను తెలియచేసి ఉన్నాను. ఈ రోజున బాబా నాతో పంచుకున్న ప్రేమానుభూతులను నేను మీకు తెలియచేయదలచుకున్నాను.

అది 1991 వ.సంవత్సరము శ్రీరామనవమి పర్వదినము తెల్లవారుజామున నా కలలో శ్రీ సాయి ఒక సాధువు రూపములో దర్శనమిచ్చి, తాను రామ లక్ష్మణుల రూపములో మాయింటికి వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకుని వెడతానని సూచించడం జరిగింది.

నేను ఉదయము నిద్రనుండి లేచిన తరువాత ఈ విషయాన్ని నా భార్యకు తెలియచేసినాను. అప్పట్లో నా భార్య సాయి భక్తురాలు కాదు. అందుచేత నేను చెప్పిన మాటలకు నా భార్య ఒక చిరునవ్వు నవ్వి నేను చెప్పినదంతా తేలికగా తీసుకుని నా మాటలను నిర్లక్ష్యముగా తీసుకున్నది. శ్రీ రామనవమి పండగ సందర్భముగా నా యింట బాబాకు నాలుగు హారతులు ఇచ్చాను. నా భార్య వచ్చిన వారందరికీ తీర్ధ ప్రసాదములు పంచిపెట్టింది. నేను, నాభార్య, నిద్రకు ఉపక్రమించేముందు నా భార్య నన్ను ఒక ఇబ్బంది కలిగించే ప్రశ్న వేసింది. "ఈ రోజున బాబా రామలక్ష్మణుల రూపములో మన యింటికి వస్తారని చెప్పినారు కదా మరి వచ్చి తీర్ధ ప్రసాదములు స్వీకరించారా" అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న నాలో అనేక ఆలోచనలను రేకెత్తించింది. నేను ఆరోజు నా యింటికి వచ్చిన అతిధులందరి గురించీ ఆలోచించాను. సాయంత్రపు హారతి సమయములో నా మితృడు రఘురామన్ తన ఇద్దరు కుమార్తెలతో వచ్చి తీర్ద ప్రసాదములు స్వీకరించిన ఘట్టము పదే పదే నా మనసులో మెదల సాగింది. రాత్రి కలలో శ్రీ సాయి సన్యాసి రూపములో తిరిగి దర్శనమిచ్చి నా స్నేహితుని ఇద్దరు పిల్లలని చూపించినాడు. ఉదయము నిద్రనించి లేచిన తరువాత నా సందేహాన్ని, నా భార్య సందేహాన్ని నివృత్తి చేసుకుందుకు ఆఫీసులో నా మితృడు రఘురామన్ ని కలిసి అతని ఇద్దరు కుమార్తెల గురించి అడిగినాను. అతను చెప్పిన సమాధానము నాకు సంతోషము కలిగించింది. అతని కుమార్తెలిద్దరూ కవల పిల్లలు. దక్షిణ భారత దేశంలో కవల పిల్లలకు సాధారణముగా రామ లక్ష్మణుల పేర్లే పట్టుకుంటారు. ఈ విషయాలన్ని సాయంత్రము నాభార్యకు తెలియచేసి కలలో తన భక్తులకు చెప్పిన మాటలను సాయి నిలబెట్టుకుంటారని గట్టిగా నమ్ముతూ సాయి పాదాలకు నమస్కరించాను.

ఇప్పుడు నా రెండవ అనుభవాన్ని చెపుతాను. అది మా అమ్మాయి వివాహ పనులు చేసుకునే సమయము. నేను మా అమ్మాయి కాబోయే అత్తవారింటికి 1992 మార్చ్ ఏడవ తారీకున వెళ్ళి కట్న కానుక విషయాలన్ని స్థిరము చేసుకుని, తిరిగి ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున ఈష్టు కోష్టు రైలుకు హైదరాబాదుకు బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. మార్చ్ ఏడవ తారీకు రాత్రి అనగా ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున శ్రీ సాయి ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి రూపములో సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు పెట్టుకుని నా వద్దకు వచ్చి మీ వియ్యాల వారికి పెండ్లి లాంఛనాల నిమిత్తము ధనము ఇచ్చినావే మరి నాకు అయిదు రూపాయలు దక్షిణ ఇవ్వగలవా అని అడిగినారు. నేను నిద్రనుండి లేచి విశాఖపట్నము రైల్వే స్టేషనుకు బయలుదేరినాను. ఉదయము అయిదు గంటలకు రావలసిన రైలు ఒక గంట ఆలశ్యముగా వచ్చునని రైల్వే అధికారులు తెలియచేసినారు. నేను రైలు రాక కోసము ఒకటొ నంబరు ప్లాట్పారము బెంచీ మీద కూర్చున్నాను. అది సూర్యోదయ సమయము. ప్లాట్ ఫారము చివరినుండి సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు ధరించిన వ్యక్తి నా పక్క బెంచీ మీద కూర్చున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే కొద్ది గంటల క్రితము కలలో సాయి దర్శనమిచ్చి అన్న మాటలు గుర్తుకు వచ్చినవి. నా పక్క బెంచీ మీద కూర్చున్న వ్యక్తి శ్రీ సాయి అని గట్టిగా నమ్మినాను. నేను ఆయనకి అయిదు రూపాయలు దక్షిణ ఇచ్చినా ఆయన తిరస్కరించితే నేను తట్టుకోలేను. కాని నేను ఆయనకి ఏవిథంగా ఇవ్వగలను అని ఆలోచనలో నా జేబులోంచి అయిదు రూపాయల నోటు తీసుకుని ఆ వ్యక్తి కూర్చున్న బెంచీ వద్దకు వెళ్ళి ఆవ్యక్తి పాదాల వద్ద అయిదురూపాయల నోటు జారవిడిచాను. ఏమీ తెలియనట్లుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, మీజేబులోంచి అయిదు రూపాయల నోటు కింద పడవేసుకున్నట్లున్నారే అని చెప్పి ఆ నోటు తీసి అతని చేతికిచ్చినాను. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఆ వ్యక్తి నేనిచ్చిన నోటును స్వీకరించి నా వైపు చిన్న చిరునవ్వు విసిరి తిరిగి ప్లాట్ ఫారము చివరికి వెళ్ళి కనుమరుగైపోయినాడు. శ్రీ సాయి ఈ వ్యక్తి రూపములో వచ్చి నానుండి అయిదురూపాయల దక్షిణ స్వీకరించారనే భావనతో నా రెండు చేతులు పైకి యెత్తి ఆ వ్యక్తికి నమస్కరించాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List