07.06.2018 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ –22 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా
(యూ ఎస్ ఎ) - ఫోన్ : 1 571 5947354
29.12.1971
: ఈ రోజు స్వామీజీ జ్ఞానాన్ని ఏవిధంగా సాధించుకోవాలో
వివరించారు.
“కర్మ
ఫలితాలను త్యాగం చేయడం ద్వారా జ్ఞాన సిధ్ధిని పొందవచ్చు. కర్మఫల త్యాగంలోని సారాంశం యిదే. “న కర్మన ప్రజయ ధనేన….”. కర్మఫలాన్ని త్యాగం చేయడం ద్వారానే ఆత్మజ్ఞానం సిధ్ధిస్తుందని
భావము. ఆత్మజ్ఞానం వల్లనే విశేషమయిన జ్ఞానాన్ని
పొందగలడు. ఆ జ్ఞానం వల్లనే బ్రహ్మ, విష్ణు,
మహేశ్వరులు అందరూ ఒక్కటేనని వారందరూ ప్రతివారి హృదయంలోను నివసిస్తూ ఉంటారనే తత్వం బోధపడుతుంది. మనం పూజ ముగించేముందు
“కాయేనవాచా
మనసైంద్రియైర్వా బుధ్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్
కరోమి
యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి”
అని
చదువుతాము.
తైత్తరీయ
ఉపనిషత్ ప్రకారం ఎవరయితే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో వానికి మోక్షం లబిస్తుంది. అనగా జీవాత్మతో కూడిన తన గుర్తింపుని కోల్పోతాడు. దానిఫలితంగా పరమాత్మలో లీనమయిపోతాడు.
ఈ విషయాన్ని సోదాహరణ పూర్వకంగా వివరించారు. ఉప్పుతో చేసిన బొమ్మను సముద్రంలోతు కనుగొనడానికి ముంచినట్లయితే అది సముద్రపు నీటిలో పూర్గిగా కరిగిపోతుంది. అదే విధంగా జీవాత్మ పరమాత్మలో కలిసిపోయి ఏకమయిపోతుంది. మనలోనున్న భగవంతుని విడదీయలేము. మన హృదయంలోనే స్థిరనివాసమేర్పరచుకున్న భగవంతుడిని మనం విడదీయలేము. ఆయన కూడా మననుండి వేరయిపోడు. కాని మనమందరం అంధులమై ఆయన కోసం వెతుకుతున్నాము. ఆయన సర్వవ్యాపి. జాగరూకతతో ఉన్నపుడు మనలో ఉన్న ఆత్మశక్తే మనలని నడిపిస్తూ ఉంటుంది. మనం నిద్రపోతూ ఉన్నపుడు కూడా ఆత్మశక్తి పనిచేస్తు ఉంటుంది. మీరు కలలో ఏదృశ్యాలను చూసినా గాని, వాటిని మీరు గుర్తుంచుకోవడానికి గల కారణం నిద్రలో కూడా ఆత్మ ఆసమయంలో అక్కడ వీక్షిస్తూ ఉండడం వల్లనే. జ్ఞాని అయినవాడు ఈ జగత్తంతా మిధ్య అనే భావిస్తాడు. ఆధ్యాత్మిక సాధనల ద్వారా మన నిజస్వభావమయినటువంటి ఆత్మను తెలుసుకోవడానికి నిరంతరం శ్రమిస్తు ఉండాలి. దానికోసం మనకి ఒక ఆధ్యాత్మిక గురువు అవసరమని మనం భావిస్తాము. మనఃస్ఫూర్తిగా మనకు భగవంతుడిని గురించి తెలుసుకోవాలనే అభిలాష ఉంటే ఆయనే మనకు గురువవుతాడు. ఆయన మన హృదయంలో నివసిస్తాడు. భగవంతుడు నివసించే ఈ శరీరం ఆనందమనే కోటగా భావించండి.
భగవంతుని
గురించి తెలుసుకోవడానికే జపం, తపం, మొదలయినవాటిని ఆచరించమని శాస్త్రాలు మనకు నిర్దేశించాయి.
బంధాలనుంచి విముక్తి పొందడానికి యివే
పరిష్కార మార్గాలు. మనలోనే నివాసం ఉన్న ఆభగవంతునికి
సర్వశ్య శరణాగతి చేయాలి. నువ్వు ఏకర్మని ఆచరించినా
ఆయనకు సమర్పించాలి. ముందుగా రుచి చూడటానికి
ఆహారాన్ని ముట్టవద్దు. మొట్టమొదటగా ఆయనకే సమర్పించాలి.
(కొంతమంది
వంట పూర్తయిన తరువాత మహా నైవేద్యం పెడుతూ ఉంటారు. లేక వండిన పదార్ధాలలో కొంత తీసి నైవేద్యం పెడుతూ ఉంటారు. మరికొంత మందికి ఈ అలవాటు లేకపోవచ్చు. అటువంటి అలవాటు లేనివారు భోజనానికి కూర్చున్నపుడు కొంతమంది అన్నం వడ్డించేలోపుగానే
కాస్త కూరముక్కను, లేక పప్పును రుచి చూడటం చేస్తూ ఉంటారు. ఆవిధంగా చేయకుండా, కంచంలో
భోజన పదార్ధాలన్నిటినీ వడ్దించిన తరువాత, చారు గాని పులుసు గాని ఏమి చేసుకుంటే అవి
కాస్త ఒక చెంచాడు కంచంలో వేసుకుని మజ్జిగ లేక పెరుగుతో సహా, భోజనం చేసేముందుగా భగవంతునికి
లేక బాబాను తలుచుకుని ఆయనకి నైవేద్యం పెట్టి, భోజనానికి ఉపక్రమించాలి. ….. నేను ఆవిధంగా ఆచరిస్తాను కాబట్టి ఇక్కడ చెప్పడం
జరిగింది….. త్యాగరాజు)
‘అహం
వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణొపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ అ.15 శ్లో.14
ప్రాణుల
దేహమందలి జఠరాగ్నిని నేను. ప్రాణాపానవాయువులతో
కూడి నేను నాలుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను. అనగా మనలోనున్న వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) కి మనము
ఆహారమును సమర్పిస్తున్నాము.
నేను
ఆనందం గురించి మాట్లాడాను. ఆనందమనగా ఏమిటి? అది నిగూఢమయిన శాశ్వత సంయోగము. దానిని వర్ణించడం సాధ్యము కాదు. కాని ఆ ఆనందాన్ని పొందడానికి మార్గాలున్నాయి.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామః
క్రోధస్తధా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ అ.16 శ్లో.21
కామము,
క్రోధము, లోభము అనునవి మూడు నరకద్వారములై ఉన్నవి.
అది ఆత్మ నాశకరములు కావున బుధ్ధిమంతుడయిన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలయును.
ఈ
విధముగా గీతలో భగవానుడు చెప్పిన ప్రకారం కామ, క్రోధ, లోభములను విడనాడాలి. అంతే కాదు.
భగవత్ జ్ఞాన సంపద కలిగినవారితో సంబంధమేర్పరచుకొని వారితో కలిసి ఉండాలి. భగవంతునికి ప్రతీకలయిన యోగులను పూజించాలి.
ఒక్కొక్కసారి
కొంతమంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే
– ఆ పరబ్రహ్మ అన్నపుడు మరి యింతమంది దేవుళ్ళను,, ఆలయాలను మనం ఎందుకని సృష్టించుకున్నాము
అని అడుగుతూ ఉంటారు. దేవుడు ఒక్కడే అయినా ప్రతి
భక్తుని స్వభావాన్ని బట్టి, యిష్టాన్ని బట్టి దేవునియొక్క వివిధ రూపాలు సరిపోతాయనే
విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఆవిధంగా మనకు
రాముడు, కృష్ణుడు, శివుడు మొదలయినవారందరూ ఉన్నారు. రామాయణం లాంటి పౌరాణిక గ్రంధాలను చదివినవాడు ఏదో
ఒకరోజు దేవుళ్లందరూ ఒకటేనని ఆయన సర్వంతర్యామియని సర్వజ్ఞుడని, సర్వ శక్తిమంతుడని గ్రహిస్తాడు. భగవంతునికి ఒక రూపాన్ని ఏర్పరచుకుంటే అది మన మనసులో
స్థిరంగా నిలిచిపోతుంది. ఆకలితో ఉన్న వ్యక్తి
తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారాన్వేషణలో ఉంటాడు.
ఆసమయంలో తనకి ఏది దొరికితే అది పళ్ళు గాని, కూరగాయలతో వండిన భోజనం గాని, తినడానికి
ఏది దొరికితే అది ఏదయినా తింటాడు గాని తనకు ప్రత్యేకంగా ఫలానా ఆహారమే కావాలనే ఆలోచనలో
ఉండడు. అదే విధంగా భగవంతుని గురించి అన్వేషణలో
ఆర్తితో ఉన్న వ్యక్తి భగవంతుని మూర్తి రాతితో చేసినదా లేక ఇత్తడి తో చేసినదా ఏలోహంతో
చేయబడింది అని ఆలోచించడు. వాస్తవ ప్రపంచం ఎంతో
సుందరంగా ఉంటుందని, అదే నిజమయిన ఆనందమనే భావించే వ్యక్తి ప్రతిచోట భగవంతుని దర్శించగలడు. సుందరంగాను, వాస్తవంగాను కనిపించే ప్రతిదానిలోను
భగవంతుని చూస్తాడు. అటువంటి వ్యక్తి భగవంతుడు
వివిధరూపాలలో ఉన్నా విగ్రహాలు ఏలోహంతో తయారు చేయబడ్డ వాటి గురించి అతనికి ఎటువంటి చింత
ఉండదు. కారణం అటువంటి వ్యక్తి ఒకే భగవంతుడిని
దర్శించగలడు. చిట్టచివరి వాస్తవమయిన యదార్ధాన్ని
తెలుసుకునే విషయంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. ముఖ్యంగా కామ, క్రోదాలు. మొట్టమొదటగా కోరికలను మనం తీర్చుకునేంత వరకు అవి మనలని వెంటాడుతూనే
ఉంటాయి. కాని, మనలను వెంటాడే కోరికలు ఎన్నో
ఉంటాయి. వాటికి అంతమనేది లేదు. అవన్నీ మనలను చికాకు పెడుతూ ఉంటాయి. ఒక కోరికను తీర్చుకున్న వెంటనే మరొకటి మొదలవుతుంది. ఈ విధంగా నిరంతరం కొత్త కొత్త కోరికలు పుట్టుకుని
వస్తూ దాని ఫలితంగా మానవుడిని ఆందోళనకు గురిచేస్తూ ఉంటాయి. ఆతరువాత కలిగేది క్రోధం లేక కోపం. ఇది ఎపుడు ప్రవేశిస్తుందంటే మనం కోరుకున్న కోరిక
తీరబోయే సమయంలో ప్రతిసారి ఎవరయినా అడ్డుపడినా లేక ఏవిధమయిన అడ్డంకులు ఏర్పడినా
క్రోధం కలుగుతుంది. క్రోధాన్ని అణుచుకోలేకపోతే
అది మనలను దహించివేస్తుందని మనకు అనుభవపూర్వకంగా తెలుసు.
ఆతరువాత
లోభం, దురాశ. సంపదలనే కాకుండా ప్రతిదానిని
కూడబెట్టుకుని నిలవవుంచుకోవడం. అవసరమయిన వారికి,
కష్టాలలో ఉన్నవారికి ధనరూపేణా గాని మరే విధంగానయినా సహాయం చేయలేకపోవడం. ఆవిధంగా కూడబెట్టుకున్న ధనం వల్ల ఎటువంటి ఉపయోగం
లేదు. కామ, క్రోధ, లోభాలనేవి నరక ద్వారాలని
భగవంతుడిని తెలుసుకోవాలంటే ఈ మూడింటిని విడనాడాలని గీతలో భగవానుడు చెప్పాడు. మనలో గూడుకట్టుకుని ఉన్న ఈ మూడు గుణాలని వదిలించుకోవడం
ఎలా? దానికి ఒక్కటే పరిష్కారం. అదే భగవధ్యానం. వాస్తవాన్ని తెలుసుకోవడానికి మనం నిరంతరం శ్రమించాలి. స్వామి వివేకానంద కూడా మనకి మంచి సందేశమిచ్చారు.
“లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించవద్దు” అని. ఆయన చెప్పిన మాటలు జ్ఞానియైనవాడికి వర్తిస్తాయి. జ్ఞాని ప్రపంచమంతా గాఢ నిదురలో ఉన్నా మేలుకొనే ఉంటాడు. భగవానుడు గీతలో
యానిశా
సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం
జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మునేః అ.1 శ్లో. 69
సకల
జీవులకు ఏది రాత్రియో, అదియే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వ జీవులు మేల్కొని యుండు సమయము అంతర్ముఖుడైన
మునికి రాత్రి సమయము. భ్రమను కలిగించే ఈ మాయా
ప్రపంచంలో జ్ఞాని అయినవాడు తన లక్ష్యాన్ని సాధించేవరకు ఎల్లపుడు జాగరూకుడై ఉంటాడు.
30.12.1971
: మనకు ఎదురుపడే ప్రతివారిలోను ప్రతిదానిలోను,
భగవంతుని దర్శించడం గురించి స్వామిజీ ప్రసంగించారు. భగవంతుని నామాన్ని పదేపదే ఉఛ్ఛరించడం లోని ప్రాముఖ్యాన్ని
వివరించారు. వ్యాసులవారు భగవంతుని యొక్క అనేక
పేర్లు గురించి చర్చించవద్దన్నారని ఆయన చెప్పారు.
అన్ని పేర్లు ఒకటే. జ్ఞాని గురించి
ప్రస్తావిస్తూ అందరిలోను భగవత్ స్వరూపాన్ని దర్శించేవాడే పరమజ్ఞాని. నీలో ఉన్న చైతన్యమే నీకెదురుపడె ప్రతి స్త్రీలోను,
పురుషుడిలోను, పిల్లలలోను, దర్శించు. యద్భావం
తత్ భవతి” అన్న ఉపనిషత్ వాక్యాన్ని మీరు వినలేదా?
దేవుడిని మనం ఎలా కొలిస్తే అలాగే వ్యక్తమవుతాడు. ఆవిధంగా పైన చెప్పబడిని సూత్రం ప్రకారం ఈ ప్రపంచంలో ఏపరిస్థితులలోనయినా సరే మనం
యిమిడిపోగలం. దానికణుగునంగానే నువ్వు పిల్లలతోనే
కాదు ఏవ్యక్తులతోనయిన సరే వారు ఎటువంటి స్థితిలో అనగా ఉన్నత స్థితిలో గాని తక్కువ స్థాయిలో
ఉన్నా గాని, ఆఖరికి శునకంతోను స్నేహపూర్వకంగా మెలగుతావు. ఆవిధంగా ఈప్రపంచంలో సమత్వ భావాన్ని అలవరచుకుంటావు.
ప్రతిచోట,
ప్రతివారిలోను ఒకే చైతన్యం ఉందని నీవు భావిస్తే ప్రజల మధ్య భేదాభిప్రాయాలు సమసిపోయి ప్రశాంతత సంతోషము లభిస్తుంది. ఈ సందర్భంగా కొంతకాలం క్రితం బెంగళూరులోని త్యాగరాజ
నగర్ లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తొంది.
కొంతమంది
భక్తులతొ కలిసి ఒక వీధిలో నడుచుకుంటూ వెడుతున్నాను. ఒక చిన్నపిల్లవాడు మూడు చక్రాల సైకిలు తొక్కుకుంటు
వెడుతున్నాడు. వెనకాల మరొక చిన్నపిల్లవాడిని
కూడా కూర్చోబెట్టుకున్నాడు. నేనా పిల్లవాడితో
“నన్ను కూడా సైకిలు వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకునివెడతావా” అన్నాను. అపుడా పిల్లవాడు ఏమని సమాధాం చెప్పాడో తెలుసా…”కాసేపు
ఆగండి. మొదట ఈ పిల్లవాడిని యింటి దగ్గర దింపేసి
మళ్ళీ వెనక్కి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుంటాను”
అన్నాడు. ఆపిల్లవాడు సైకిలు మీద వెళ్ళిపోయిన
తరువాత మేము నడుచుకుంటూ వెడుతున్నాము. కొంత
సేపట్లోనే వాడు మళ్ళీ తిరిగి వచ్చి, “మీరెక్కడికి వెడుతున్నారు. నేనా పిల్లవాడిని వదిలిపెట్టి మళ్ళి వస్తానని చెప్పాను
కదా?” అన్నాడు. ఆచిన్న పిల్లవాడు చూపించిన
ప్రేమ నన్ను కదిలించింది. అనగా దానర్ధం ఏమనగా
నువ్వు ఆవిధంగా స్నేహపూర్వకంగాను, ప్రేమతోను, చిన్న పిల్లవాడయినా, ఎదిగిన పిల్లలతోనయినా
మెలగితే, నీకు కూడా అటువంటి స్నేహభావము, ప్రేమ తిరిగి లభిస్తుంది.
05.01.1972 : ఈ రోజు
స్వామీజీ భగవంతునికి సర్వశ్య శరణాగతి చేయవలసిన అవసరం గురించి వివరించారు.
భగవంతుడు
అన్ని కష్టాలను తొలగిస్తాడు. మనం ప్రార్ధించే
ప్రార్ధనలో ఏకాస్త విశ్వాసమున్నా అది మనలని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకునివెడుతుంది. ప్రారబ్ధకర్మ వల్లనే తమకు కష్టాలు దాపురించాయని
చాలా తరచుగా అందరూ చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని
ప్రక్కకు పెట్టండి. ప్రారబ్ధకర్మ అనే మాటని
పట్టించుకోవద్దు. భగవంతునియందు విశ్వాసముంచి
ప్రార్ధించండి. అన్ని కష్టాలను నివారించి వాటి
ప్రాబల్యాన్ని తగ్గించగల సమర్ధుడు భగవంతుడు.
ప్రార్ధించే అలవాటుని మీరు పెంపొందించుకుంటే, మీమనస్సు స్వఛ్ఛత పొందుతుంది. భగవంతుడు ఇచ్చే సందేశాలను కూడా మీరు వినగలరు. శ్రీనరసింహస్వామీజీ
గారు ‘భగవంతుడు మనకు యివ్వబోయే సమాచారం వినడానికి మనం ఏమరుపాటు లేకుండా అప్రమత్తంగా
ఉండాలి” అని చెప్పారు. ఎన్నో విషయాలలో తమకు
భగవంతునియొక్క ఆపన్న హస్తం ఉందని ప్రతి భక్తునికి అనుభవమే. కాని, అవన్నీ వివరించడానికి సాధ్యం కాదు. నా విషయంలో కూడా నారక్షణ కోసం భగవానుడు వచ్చిన అనేక
సంఘటనలున్నాయి. ఒకసారి నేను ఒక ప్రభుత్వ ఆఫీసుకు
వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కుర్చీలో కూర్చోమన్నారు. ఆ కుర్చీలో కూర్చున్న మరుక్షణమే ఆప్రదేశం క్షేమకరం
కాదనిపించింది. వెంటనే నేను మరొక కుర్చీలోకి
మారాను. నేను అంతకుముందు కూర్చున్న కుర్చీవద్ద
ఉన్న వ్యక్తిని కూడా అక్కడినుంచి వెంటనే వెళ్ళిపొమ్మని చెప్పాను. అతను నేను చెప్పినట్లుగానే వెళ్ళిపోయాడు. ఒకటి, రెండు నిమిషాలలోనే అంతకుముందు నేను కూర్చున్న
కుర్చీ మీద పైన ఉన్న సీలింగ్ ఫాన్ ఊడి క్రిందపడి ముక్కలు ముక్కలయింది. అదృష్టవశాత్తు నాతో సహా ఇంకెవరూ అక్కడలేరు. ఎవరికీ దెబ్బలు తగలలేదు.
మరొక సంఘటన, ఆల్ ఇండియా సాయి సమాజ్ లో జరిగింది. ఒకసారి పెద్ద తుఫాను వచ్చి బాగా ఆస్తినష్టం జరిగింది. కుటీరంలో నేనొక్కడినే ఉన్నాను. అకస్మాత్తుగా ఒక చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ
లోపలికి వచ్చి “స్వామీజీ యిటువంటి ప్రమాద సమయంలో మీరింకా ఇక్కడ కూర్చునే ఉన్నారా, వెంటనే
కుటీరం నుంచి బయటకు వెళ్ళిపొండి. హరికేన్ చాలా
ప్రమాదకరంగా ముంచుకుని వస్తోంది. ఈ కుటీరం
ఆ తుఫాను ధాటికి ఎగిరిపోతుంది” అన్నాడు. వెంటనే
నేను బయటకు వచ్చేశాను. నేను బయటకు వచ్చిన కొద్ది
నిమిషాలలోనే భయంకరంగా మారిన తుఫాను ధాటికి కుటీరం మొత్తం కూలిపోయింది. ఆ పిల్లవాడు చెప్పినమాట వినకుండా ఉంటే నాకు బలమయిన
దెబ్బలు తగిలి ఉండేవి.
ఒకసారి
షిరిడీలో నేను ఒక భవనంలో మూడవ అంతస్థులో బస చేసాను. ఒకరోజున మూడవ అంతస్థునుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు
మొట్లమీదనుంచి క్రిందకి పడిపోయాను. పడిపోతుండగా
పట్టుకోవడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు. నేలమీదకి
అలా దొర్లుకుంటూ వచ్చి పడిపోయాను. పడిపోయాక
చూసుకుంటే విచిత్రంగా నా వంటిమీద ఒక్క గీరుడు కూడా లేదు. బాబా తన భక్తులను ఈ విధంగా రక్షిస్తూ ఉంటారు. ఈ సంఘటన చెబుతుంటే నాకు రైలు కంపార్టుమెంటునుంచి
ప్రమాదవశాత్తు ఒక స్త్రీ పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆమె రైలునుంచి పడిపోతూ ఉండగా చక్రాలక్రింద పడకుండా
క్షేమంగా ఎవరో ఆమెను అతి త్వరితంగా బయటకు లాగారు.
ఆ అదృశ్యవ్యక్తి బాబా తప్ప మరెవరూ కాదు.
ఈ సంఘటన బాబా జీవించి ఉన్న రోజులలో షిరిడీకి కొన్ని మైళ్ళ దూరంలో జరిగింది. ఆ తరువాత నేను శ్రీనరసింహస్వామీజీని కలుసుకున్నపుడు
“మేడమెట్లమీదనుంచి పడిపోయేటపుడు నీవేమన్న షాక్ కి గురయ్యావా?” అని నన్నడిగారు. “నాకేమి దెబ్బలు తగలలేదని షాక్ కి కూడా గురవ్వలేదని”
సమాధానమిచ్చాను.
06.01.1972 : ప్రార్ధనా
మందిరంలో స్వామీజీ భక్తులందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. మనది అని అనుకుంటున్న ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని మనం ప్రతిరోజు
లోపల, బయట పరిశుభ్రం చేసుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితేనే
ఈ మన శరీరంలో భగవంతుడు నివాసం ఉండటానికి అర్హమైనదిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ తప్పకుండా స్నానం
చేయాలి. అదేవిధంగా మన మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడానికి ధ్యానం, జపం, ప్రార్ధనలు
ఆవశ్యకం. మనం తరచుగా మన కోరికలను తీర్చమని
భగవంతుడిని ప్రార్ధిస్తు ఉంటాము. అవిధంగా ప్రర్ధించడం
అవసరమా? మనకేది మంచి చేస్తుందో భగవంతుడికి
తెలియదా? ఏదో ఒక దానికోసం ప్రజలు భగవంతుని
వేడుకోవడమనేది తప్పనిసరి పరిస్థితులలో చేయక తప్పదు. దానికి నేను అంగీకరిస్తాను. కాని దానికన్నా మన యోగక్షేమాలను నువ్వే చూసుకోమని
వినయంతోను, భక్తితోను ప్రార్ధించి భగవంతునికే వదలివేయడం మంచిది. మనకేది మంచో, ఏది చెడో మనకి తెలియదు. కాని మనకేది మంచో దేవునికి తెలుసు. అందుచేత మనకి ఏది మంచి చేస్తుందో దానిని నెరవేర్చమని
భగవంతుని యిష్టానికే వదలివేయడం మంచి పధ్ధతి.
మనకన్నా భగవంతునికే బాగా తెలుసు. ఆయన
ముందు మన ఆలోచనలు ఏమీ పనికిరావు. అందుచేత పరిపూర్ణమయిన
విశ్వాసంతో భగవంతుడిని వేడుకొని ప్రతీదానిని ఆయనకే వదలివేయాలి.
ఉదాహరణకి
మీ అబ్బాయి మిఠాయిలు ఇమ్మని అస్తమానూ మారాం చేస్తూ మిమ్మల్ని వేధిస్తున్నాడనుకోండి. ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసు. మరి మీరేంచేస్తారు? మీరు తీపి పదార్ధాలు ఎక్కువ తినడం మంచిది కాదని
చెబుతారు. అయినా వినకుంటే దెబ్బలు కొడతారు.
అదే విధంగా మనం భగవంతుడిని ప్రార్ధించినా ఆయన మన కోరికను నెరవేర్చకపోవచ్చు. కారణం మనకేది మంచి చేస్తుందో ఆయనకే తెలుసు. సాయిబాబాయే సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయనే సర్వాధికారి. ఆయనకి మనం అంకితులమయి సర్వశ్యశరణాగతి వేడుకోవాలి. అధ్యాత్మికంగాను. ప్రాపంచిక దృష్టి విషయపరంగాను. బాబా మనలని తప్పకుండా కాపాడుతూ ఉంటారు.
అదే విధంగా మనం భగవంతుడిని ప్రార్ధించినా ఆయన మన కోరికను నెరవేర్చకపోవచ్చు. కారణం మనకేది మంచి చేస్తుందో ఆయనకే తెలుసు. సాయిబాబాయే సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయనే సర్వాధికారి. ఆయనకి మనం అంకితులమయి సర్వశ్యశరణాగతి వేడుకోవాలి. అధ్యాత్మికంగాను. ప్రాపంచిక దృష్టి విషయపరంగాను. బాబా మనలని తప్పకుండా కాపాడుతూ ఉంటారు.
ఓమ్ తత్ సత్
(సమాప్తమ్)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)