24.05.2014 ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్
రెండు సంవత్సరాల క్రితం మన బ్లాగులో శ్రీసాయితో తార్ఖడ్ కుటుంబంవారి ప్రత్యక్ష అనుభవాలు చదివారు. మీకు గుర్తుండి ఉండే ఉంటుంది. ఈ రోజు తార్ఖడ్ కుటుంబములోని వారి మరొక ప్రత్యక్ష అనుభవాలను మీకందిస్తున్నాను. పాఠకులకి మరొక బాబా లీల ఏమి అందిద్దామని ఆలోచిస్తూ వెబ్ సైట్ వెతుకుతుండగా బాబా ప్రేరణతో యిది కనిపించింది. ఇక చదవండి.
(bonjanrao.blogspot.in)
శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్
(ప్రముఖ సినీనటి శ్రీమతి నళినీ జయవంత్ తల్లి)
(శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ బాబాగారిని, యింకా యితర మహాపురుషులను, సాధువులను నిశితంగా గమనించారు. బాబా లో ఉన్న అతీంద్రియ శక్తులను గురించి, బాబావారి కళ్ళలో ఉన్న అధ్బుతమయిన శక్తి మరియు తాననుభవించిన అనుభవాలను తెలియచేస్తున్నారు)
రామచంద్ర ఆత్మారాం గారి సోదరుడయిన సదాశివ తార్ఖడ్ గారి భార్య తారాబాయి. రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ గారు బొంబాయిలోని ప్రముఖ ఖటావు మిల్స్ కి సెక్రటరీ. ఒకసారి ఆర్.ఎ. తార్ఖడ్ గారు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నారు. షిరిడీనుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన శ్రీమతి తారాబాయి సదాశివ గార్కి బాబావారి యొక్క అధ్బుతమైన శక్తులను గురించి చెప్పారు. ఆసమయంలో తారాబాయి గారి 15 నెలల పాప నళినీ తార్ఖడ్ కి బాగా జబ్బు చేసి ప్రమాదకరమయిన పరిస్థితిలో ఉంది. బాబా శక్తులను గురించి విన్న ఆమె "బాబాయే కనక నిజంగా మహాత్ముడే అయితే తన పాపకు వచ్చిన జబ్బుని వెంటనే నయం చేయగలిగితే పాపతో సహా షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంటానని" వెంటనే బాబాకు మ్రొక్కుకొంది.