29.08.2018 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అమర్ నాధ్ యాత్రకు బాబా ఏవిధంగా అనుమతి ప్రసాదించారో, యాత్ర మధ్యలో ఏ
విధంగా సహాయపడ్డారో ప్రచురిస్తున్నాను. సాయి భక్తులయిన డా. విజయ కుమార్ గారు బాబా
సహాయంతో తాను ఏవిధంగా యాత్రను పూర్తి చేసారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ రోజు
ఆయన అనుభవమ్ మనందరి కోసమ్. ఆంగ్లంలో వ్రాసిన ఆయన అనుభవమ్ సాయిలీల.ఆర్గ్
2017 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా (అమెరికా) ఫోన్ : 1571 594 7354
అమర్ నాధ్ యాత్ర - బాబా అనుమతి
డా. విజయ కుమార్
అసిత – గిరి – సమంస్యాత్ కజ్జలం – సింన్ధు – పాత్రే
సుర - తరువర - శాఖాలేఖినీ పత్రముర్వీ I
లిఖిత యది గృహీత్వా శారదా
సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం నయాతి II
తదపి తవ గుణానామీశ పారం నయాతి II
శివ మహిమ్నా స్తోత్రం - 32 శ్లో.
పరమేశ్వరా
! సరస్వతీదేవి సముద్రమును సిరా పాత్రగను, కాటుక కొండను మసిగను (సిరాగాను) కల్పవృక్షము
యొక్క కొమ్మను లేఖిని (కలము) గను భూమిని పత్రముగను చేసికొని నీ గుణముల మహత్త్వములను
గూర్చి నిరంతరము సర్వకాలము (ఎంతకాలము) వ్రాసినను ఆ మహిమల అంతును పూర్తిగా కనుకొనలేము.
నా గదిలో గోడమీద చాలా సంవత్సరాలుగా అమర్ నాధ్ లోని మంచు శివలింగం ఫొటో ఉంది. నేను ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు యాత్రలు చేసాను. భారత దేశంలో కూడా అన్నిప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామన్నదే నా జీవిత లక్ష్యం. నేనెప్పుడూ కాశ్మీర్ కు వెళ్లలేదు. కనీసం ఈ జన్మలోనయినా నేను అమర్ నాధ్ యాత్రకు వెళ్లగలనా, అది నాశక్తికి మించిన భారమేమో అని అనిపిస్తూ ఉండేది. అమర్ నాధ్ గుహకు కాలినడకన వెళ్ళడమంటే చాలా శ్రమతో కూడుకొన్నదని, అంతేకాకుండా కాశ్మీర్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎపుడు ఏవిధంగా ఉంటాయో చెప్పలేమని నాకు కొంతమంది చెప్పారు.