23.02.2013 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం 40వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : విక్షరో రోహిత్ మార్గో హేతుర్దామోదరస్సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ||
తాత్పర్యము: పరమాత్మను నాశనము లేనివానిగా, ఎరుపు వర్ణము కలవానిగా, తర్కించుటవలన తన మార్గము తెలియబడువానిగా ధ్యానము చేయుము. ఆయన ఉదరముపై పూలమాల యున్నది. సహనము, సామర్ధ్యము ఆయనయే, ఆయన సమస్త భూమండలము యొక్క భారమును వహించును. సృష్టియందలి భాగ్యమంతయూ తానే, వేగమే ఆయన రూపము. సృష్టిని పుట్టించి మరల నశింపచేయుచు తానే వెలుగుచున్నాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 3
మూడవ అధ్యాయము
హైదరాబాద్ 08.01.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ రోజు శ్రీ సాయి సత్ చరిత్రలోని మూడవ అధ్యాయములోని విషయాలు నీతో ముచ్చటించుతాను. శ్రీసాయి అంటారు, నా మాటలయందు విశ్వాసముంచుము. నాలీలలు వ్రాసినచో అవిద్య నిష్రమించిపోవును.