బాబాతో నా అనుబంథం ఊహకందనిది -- గౌరి
25.06.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు
బాబా లీలలు ప్రచురించడానికి నాలుగు రోజుల విరామం వచ్చింది. యింటి పనులవల్ల, ఒక రోజు కరెంట్ కోత వల్ల, నిన్న ఊరిలో లేకపోవడం వల్ల అంతరాయం కలిగింది. పోస్టింగ్ చేద్దామనుకున్నది యింటివద్ద సిస్టంలో వర్డ్ డాక్యుమెంట్లో ఉండిపోయింది. నిన్న పనిమీద విజయవాడ రావలసివచ్చింది. ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో ప్రచురితమైన గౌరి గారి బాబా అనుభవాన్ని తెలుగులోకి అనువదించి మీకు బాబా అనుగ్రహంతో అందిస్తున్నాను.
* * *
సాయి బంథువులారా, మీ అడ్డంకులన్నిటినీ చేదించుకోండి, బాబా ఆశీర్వాదానుభూతిని అనుభవించండి. మీరు యెక్కవలసిన మొదటి మెట్టు ఇదే, మిగతాది అసంకల్పితంగానే జరుగుతుంది. "నేను అనుగ్రహింపబడ్డాను" ఈ భావం కనక గాఢంగా ఉంటే, నీ జీవితంలో కష్టాలని అధిగమించడానికి దోహదం చేస్తుంది. అది నీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది, నీలో దయని నింపుతుంది. నేను అనుగ్రహింపబడ్డాను అనే భావం నువ్వు గ్రహించుకున్ననాడు, ఆవేదనలన్నీ మటుమాయమయిపోతాయి,అసంతృప్తి అంతరించిపోతుంది. అభద్రతా భావం ఆవిరైపోతుంది. ఓర్వలేనితనం కరగిపోయి ప్రేమ తత్వం అంకురిస్తుంది. నువ్వు అనుగ్రహింపబడ్డావు అనే భావం నీలో లేనప్పుడు, అంతా నేనే చేస్తున్నాను అనే భావం నీలో కలుగుతుంది. జీవితంలో మార్పు రావాలని కనక నువ్వు కోరుకుంటే, నేను బాబా బిడ్డని అని నువ్వు అనుకోవాలి. ఈ రోజు నేను ప్రచురించే ఈ బాబా లీల, బాబా తన బిడ్డలకు యెలా సహాయం చేస్తారో, యెలా అనుగ్రహిస్తారో అర్థమవుతుంది.
యునైటెడ్ కింగ్డం నించి గౌరి గారు తన అబుభవాన్ని నాకు మైల్ చేశారు. ఇది చాలా అద్భుతమైన అనుభూతి, ఇది మీలో బాబా మీద నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఈ లీల మీకు సంతోషాన్నిచ్చి బ్రహ్మానందాన్ని కలుగచేస్తుంది. బాబా ని గురించిన నిజమైన అనుభవాలని తెలుసుకోవాలన్న మీ దాహార్తిని యిది తీరుస్తుంది.... అల్లా మాలిక్ ...
సాయిరాం ప్రియాంకా గారు,
నేను నా అనుభవాన్ని సాయి బంథువులందరికి చెప్పాలనుకుంటున్నాను. యెందుకంటే వారిలో సాయి మీద స్థిరమైన భక్తి భావం పెరుగుతుంది.
మన సద్గురు సాయి మీద యిటువంటి అద్భుతమైన సైట్ ని యేర్పాటు చేసినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ప్రియాంకా గారూ, నేను ఇక్కడ సైట్ లో ఫొటో ని ఇవ్వడము లేదు, మీకు సాథ్యమయితే ఒక ఫోటోని జత చేయండి. యిందులో తప్పులేమన్నా ఉంటే మన్నించండి, నేను మైల్ ఇవ్వడం యిదే మొదటిసారి.
నా జీవితంలోకి బాబా ప్రవేశించిన క్షణం యెప్పుడో నేను గుర్తుకు తెచ్చుకోలేను. చిన్నప్ప్పటినించీ నాకాయన తెలుసు. కిందటి సంవత్సరం నించే నాలో ఆయన మీద భక్తి భావం పెరిగింది. మేము సాథారణంగా, అత్యంత బాబా భక్తిపరుడైన, మాయింటి పురోహితులైనటువంటి శ్రీ అప్పల నరసిం హ శాస్త్రిగారి వద్దకు వెడుతూ ఉండేవారము. మాకెపుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన వద్ద సలహాలు తీసుకుంటూ ఉండేవారము. ఇపుడాయన కీర్తి శేషులు. సాయి దయవల్ల ఆయన భార్య ఇపుడన్ని విషయాలూ చూస్తున్నారు. ఆమె పేరు లలితా దేవి. మేమామెని ఆమ్మగారు అని పిలుస్తాము.
నాకు యిద్దరబ్బాయిలు. పెద్దబ్బాయికి 4 సంవత్సరాలు, చిన్నబ్బాయికి 8 నెలలు. నేను మాయన కూడా యునైటెడ్ కింగ్ డం లో ఉంటాము. ఆయన కూడా బాబా భక్తులు. నేనుమా చిన్నబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్ గారు నాకు జెస్టైటనల్ డయాబిటీస్ రావచ్చని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. వెంటనే నేను "మా అమ్మగారితో" (లలితా దేవిగారు) అన్ని వివరాలూ చెప్పి డాక్టర్ గారు చెప్పిన విషయం కూడా చెప్పాను.
మా అమ్మగారు నన్ను సాయి సచ్చరిత్ర చదవమని చెప్పారు. ఆ పుస్తకం పెరు వినడం నా జీవితంలో అదే మొదటిసారి. సాయి సచ్చరిత్ర యెక్కడ దొరుకుతుందొ యెటువంటి ఆధారం నాకు లభించనందుకు నాకు బెంగ పట్టుకుంది.
బాబా మన అవసరాలని కనిపెడుతూ ఉంటారని మనకు తెలుసు. నా విషయంలో కూడా అదే జరిగింది. అంతర్జాలంలో (యింటర్నెట్) నాకు ఈ పుస్తకం లభించింది. నేను చదవడం మొదలు పెట్టి బాబా దయతో యేడువారాల పారాయణ పూర్తి చేశాను. ఈ ఆథ్యాత్మికమైన గ్రంథం చదవడం మొదలుపెట్టగానే సాయి నాకు కలలోకి రావడం మొదలుపెట్టారు.
నేను కలలో సాయిని మొదటిసారి చూసినప్పుడు, సాయి నాకు ఒక వార్తా పత్రికని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఈ కల అర్థం అవలేదు. కాని కొన్ని రోజల తరువాత మాత్రమే నాకు ఉదయాన్నే నాకింకొక కల వచ్చింది. ఆకలలో నేను షిరిడీలో ఉన్నానట, యెఱ్ఱని దుస్తులలో ఉన్న పూజారిగారు నాకు కొన్ని పుష్పాలనిస్తున్నారట. మన దేవ సాయి నుంచి కూడా నాకు అక్షింతలు లభించాయి.
యింతవరకు నాకు షిరిడీ గురించి యేమీ తెలియదని, షిరిడీలో పూజారి యేదుస్తులు వేసుకుంటారో కూడా నాకు తెలియదంటే మీరు నమ్మగలరా.
మరునాడు ఉదయం నేను లేచిన తరువాత,అంతర్జాలంలో నేను వార్తా పత్రిక చదువుతున్నాను. నా ఆశ్చర్యమేమంటే ఆరోజు గురుపూర్ణిమ. నా ఆనందానికి అవథులు లేవు. అంటే దాని అర్థం గురుపూర్ణిమ రోజునే నాకు షిరిడీ కల వచ్చింది.
అదేరోజున నాకు ఆన్ లైన్ షిరిడీ దర్శనం గురించి తెలిసింది. నేను ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నప్పుడు, నా కలలో యెఱ్ఱని దుస్తులతో యే పూజారైతే కనిపించారో అదే పూజారిగారిని నేను ప్రత్యక్ష ప్రసారంలో చూశాను. నేను అనుగ్రహింపబడ్డాననే భావం నాకు కలిగిందంటే నమ్మండి. ఒక విథంగా కొంచెం నమ్మకం పెట్టుకున్నంత మాత్రం చేతనే నా జీవితంలో బాబా నాకు తన ఉనికిని చూపించారు.
కొన్ని నెలల తరువాత మేము భారత దేశానికి వచ్చి, మా అమ్మగారి యింటికి వెళ్ళాము.ఒక రోజున మేము సాయి గుడికి మందిరానికి వెళ్ళాము, గుడికివెళ్ళి బాబా విగ్రహాన్ని చూడగానే నేను యెంతో సంతోషంతో అరిచాను. మేము ఆరతి ని చూశాము.
తరువాత మాఅయన పక్కనున్న షాపులో సాయి సచ్చరిత్ర పుస్తకం కొందామనుకున్నారు. ఆ సచ్చరిత్ర పుస్తకం కొని తెచ్చేదాకా నేను గుడిలోపల హాలులో యెదురు చూస్తు వేచి ఉన్నాను. నేనక్కడ గుడిలోపల హాలులో యెదురుచూస్తూ, బాబాతో నేనీరోజు నీ గుడిలో యెందుకున్నాను, నువ్వు నాకు కలలో అక్షింతలు ఇచ్చినట్లుగా ఇప్పుడు నాకెందుకివ్వకూడదు అని బాబాని అడిగాను.
కొంతసేపటి తరువాత మా ఆయన పుస్తకంతో తిరిగి వచ్చారు. పవిత్రమైన పుస్తకాన్ని సద్గురు సాయి పాదాల వద్ద ఉంచి ఇమ్మని పూజారిగారికి ఇచ్చారు. పూజారి గారు అలాగే చేసి పుస్తకం మీద అక్షింతలు ఉంచి పుస్తకాన్ని తిరిగి ఇచ్చారు. నేను కోరిన ప్రతీదీ ఇస్తున్న నా తండ్రి సాయికి నా కృతజ్ఞతలు యెలా చెప్పాలో నా మాటలకందలేదు.
కొన్ని రోజుల తరువాత డాక్టర్ గారు మథుమేహానికి జీటిటి పరీక్ష చేశారు. అది నెగటివ్ గా వచ్చింది. బాబా దయవల్ల మాత్రమే అది సాథ్యమయింది. ఆ తరువాత యెటువంటి సమస్యలు లేకుండా మా రెండవ అబ్బాయిని ప్రసవించాను.
2 నెలల పసి పిల్లవాడయిన మా చిన్న కుమారిడితో మేము మా తల్లితండ్రులతోనూ, మా అత్తవారి తోనూ షిరిడీ కూడా వెళ్ళాము. అక్కడ షిరిడీలో బాబా నాకు చాలా అనుభూతులనిచ్చారు. నేను నా తరువాతి పోస్ట్ లో వాటిని ప్రచురిస్తాను. నేనింకా కొన్ని కుటుంబ సమస్యలను యెదుర్కొంటున్నాను. ఆ సమస్యలన్నీ కూడా బాబా దయవల్ల తీరిపోతాయని నాకు తెలుసు.
నేను చెప్పేది ఒక్కటే సాయి భక్తులందరూ కూడా ఆయన దివ్య చరణాలమీద ధృఢమైన భక్తినుంచుకోవాలి, యెవరూ ఆయన చరణాలని వదలకూడదు.
అనత కోటి బ్రహ్మాండనాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కి జై
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.