06.07.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి - తోడూ నీడ
గత రెండు, మూడు రోజులుగా యేమీ ఇవ్వలేకపోయాను. ఈ రోజు ప్రచురించేది చదవండి. సచ్చరిత్ర పారాయణ లో చదివిన విషయాలన్నిటిని పూర్తిగా అవగాహనకు తెచ్చుకోండి.
ఇందులో నువ్వు అని సంబోథించినంత మాత్రాన మిమ్మల్ని అన్నట్లుగా మాత్రం భావించకండి. నువ్వు అంటే నాపరంగానే తీసుకోండి. అంటే నన్ను నేను సంబోథించుకున్నట్లుగా భావించండి.
.
భగవంతుడిని తెలుసుకోవడమంటే నిన్ను తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే. అనగా మన పేరు, కులం, గోత్రంతో, మన ఉనికిని లేక మన స్తితిని తెలుసుకోవడం కాదు. జ్ఞానం తో ఉన్న మానవుడు తాను కూడా భగవంతునితో సమానమే అని గ్రహిస్తాడు. అప్పుడు తానెవరో తెలుస్తుంది. నీలో నాలో అందరిలోనూ భగవంతుడున్నాడు. మన జన్మ యెక్కడినించి వచ్చింది? ఆయన నించే కదా! అంటే మనం ఆయన అంశ. అందుచేత నువ్వు కూడా భగవంతుడివే. నీలో ఉన్న ఆత్మని చూడు. అందులో ఉన్న భగవంతుడిని చూడు.
నీ యింటిలో ఉన్న అందరిలోనూ భగవంతుడే ఉన్నాడని గ్రహించు. అందరూ ఇలా భావించిననాడు మనస్పర్థలకి తావుండదు. కోపతాపాలకు అవకాశముండదు.
ఒకోసారి కొంతమందికి మనసులో అనిపిస్తూ ఉంటుంది. జరగబోయేది కూడా తెలుస్తుంది. దానినే సిక్స్త్ సెన్స్ అంటాము. అదే భగవంతునియొక్క ప్రేరణ. ఇక్కడ జ్ఞానం అంటే మనం చదువుకున్న చదువు, విజ్ఞానం కాదు. మనమెవరో తెలుసుకోవాలంటే ఆథ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆథ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో కలుగుతుంది. అటువంటి ఆసక్తి కలిగినప్పుడే భగవంతుడిని తెలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలనీ, ఆయనని దర్శించాలని మనలో ప్రగాఢమైన కోరిక కలిగి, అన్వేషణ సాగిస్తాము. ఈ అన్వేషణ లో మనం దానికి సంబంథించిన పుస్తకాలని ఆసక్తితో ఆమూలాగ్రం చదువుతాము. కాని పుస్తకాలు చదివింత మాత్రాన మనకు భగవంతుడిని దర్శించాలనే కోరిక పెరుగుతుందే తప్ప దానికి మనం యెలా ఉండాలి, యేమి చేయాలి అనే విషయాలు గ్రహింపుకు రావు. ఇవన్ని తెలియాలంటే, ఆథ్యాతి త్మికంగా యెదిగిన వారితో సాంగత్యం చేయాలి. వారితో మాట్లాడాలి. ఒకరి భావాలు ఒకరు కలిసి పంచుకోవాలి. అందుకనే సజ్జన సాగత్యం అన్నారు. అంటే మనకు మార్గ దర్శకులు కావాలి.
ఉదాహరణకి సైన్స్ విద్యార్థి ఉన్నాడనుకోండి. ప్రయోగాలు యెలా చేయాలో పుస్తకాలు బాగా బట్టీ వేసి చదివింత మాత్రాన చేయలేడు. దానికి ఆన్నీ తెలిసిన లెక్చరర్ సహాయంతో ప్రయోగాలు యెలా చేయలో నేర్చుకున్నప్పుడే అతను చదివిన చదువుకి అర్థం చేకూరుతుంది. ప్రాక్టికల్స్ యెలా చేయాలో తగిన బోధన లేకుండా, ఊరికే పుస్తకం చదివేసి, ప్రాక్టికల్స్ చేయమంటే యెవరూ చేయలేరు.
అలాగే మనం కూడా ఆథ్యాత్మికంగా ఎదగాలంటే తగిన గురువు ఉండాలి.
పరిశోధనాత్మక వ్యాసాలు, లేక పీ.హెచ్.డీ. చసే వారు యేమి చేస్తారు, దానికి సంబంధించిన దొరికిన మొత్తం పుస్తకాలన్ని చదువుతారు, యింకా వాటికి సంబంధించిన పుస్తకాల కోస అన్వేషణ కొనసాగిస్తారు. అలాగే, భగవంతుడిని చూడాలి, అనుకున్నవాడెప్పుడూ అలా అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటాడు.
మనం ఒక యాత్రా స్థలానికి వెళ్ళామనుకోండి. అంతకు ముందు మనమెప్పూడూ అక్కడికి వెళ్ళలేదు. మనం యేమి చేస్తాము. యింతకుముందు అక్కడకు వెళ్ళినవారెవరైనా ఉంటే వారిని యెలా వెళ్ళాలి, యెలా బయలుదేరాలి, అక్కడ వసతులు యెలా ఉంటాయి అని అన్ని అడిగి ప్రయాణం సాగిస్తాము. అక్కడికి వెళ్ళాక అక్కడి విసేషాలు చూడాలంటే అక్కడి గైడ్ సాయం తీసుకుంటాము.
మరి మనకి ఈ అన్వేషణలో దారి చూపించే మార్గ దర్శకులు ఎవరు? మన బాబా గారు. కాని ఆయన సచ్చరిత్ర చదివినంత మాత్రాన మనకి ఆథ్యాత్మిక జ్ఞానం కలుగుతుందా? ఉదాహరణకి మనలో చాలా మంది శ్రీ పత్తి నారాయణరావు గారు వ్రాసిన సాయి సచ్చరిత్ర పారాయణ చేసే ఉంటారు. మొదటి సారి చదివినప్పుడు మీకెలా ఉంది, కొన్ని సార్లు పారాయణ చేయగా ఎలా ఉందీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మొదటి సారి చదివినప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉండి ఉండవచ్చు. కాని తరువాత చాలా సార్లు పారాయణ చేసినా కూడా అందులోని విషయ పరిజ్ఞానం మనకు అంతగా అర్థమవదు. మరి అర్థమవాలంటే బాబా లీలలను చదవాలి, బాబా లీలలను అనుభవించినవారి అనుభవాలను వినాలి. సచ్చరిత్ర బాగా పారాయణ చేసినవారితో కలిసి సత్సంగం యేర్పాటు చేసుకుని బాబా బోథలని పూర్తిగా అర్థం చేసుకోవాలి.
సచ్చరిత్రలో బాబా చెప్పిన బోథనలని తూ.చా. తప్పకుండా పాటిస్తే సాయి దర్శనం సులభతరమవుతుంది.
యెందుకంటే ఒక్కసారి బాబా ని స్మరిస్తే చాలు, యేదోఒక విథంగా వారి లీలలను అనుభవించిన సాయి భక్తులు మనలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంత మందికి ఒక అనుమానం రావచ్చు, కొంతమందికి బాబా యెన్నో అనుభూతులనిచ్చారు, కొంతమందికి లీలలను చూపించారు, కాని మాకు యెప్పుడూ యే లీలా చూపించలేదు అని కొంత నిరాశ తో అంటూ ఉంటారు. బాబా మనలని అందరిని అనుగ్రహించారు కాబట్టేమనం ఈ రోజు ఇలా సత్సాంగత్యం చేసుకుంటూ, ఆయన లీలలను చదువుతున్నాము, వింటున్నాము. యేజన్మలోనో ఆయనతో అనుబంధం ఉండబట్టే మనమీనాడు సాయి భక్తులమైనాము. కాని నేను మట్టుకు నేను సాయి భక్తుడిని కాదు. నేను సాయి భక్తుడిని అవునో కాదో బాబా గారే చెప్పాలి. నేనొక సాయి సేవకుడను, ఆయన పాదాలకింద ఒక రేణువును మాత్రమే.
ఒకొక్కసారి మనకి జీవితంలో జరగాల్సిన కొన్ని కోరికలు ఉంటాయి. అవి యెప్పటికి తీరతాయో, యెలా తీరతాయో తెలియని అయోమయ స్తితిలో ఉంటాము. బాబానే నమ్ముకుంటాము. ఇవాళ, రేపు అంటు యెదురు చూస్తూ ఉంటాము. కాని యెప్పటికీ తీరేలా కనపడకపోయేటప్పటికి కొంచెం నిరాశ వస్తూ ఉంటుంది, కాని సాయిని మాత్రం మరచిపోము. ఆశ, నిరాశల మధ్య మనసు ఊగుతూ ఉంటుంది. బాబా నన్ను యెప్పటికైనా కరుణిస్తాడా లేదా అని యెదురు చూస్తూ ఉంటాము. గత జన్మలో చేసుకున్న కొన్ని చెడు కర్మలని యెవరూ తప్పించలేరు. అప్పుడు మనకొక అనుమానం రావచ్చు. మరైతే కర్మ పరిపక్వమయితేనే గాని మనకి పనులు కావనుకుంటే భగవంతుడిని ప్రార్థించడమెందుకు అనుకున్నామనుకోండి. అది కూడా చెడు కర్మ ప్రభావం యింకా చెప్పాలంటే స్వయంకృతం కూడా. కర్మ పరిపక్వమయ్యే సమయంలో ఇలా యెవరన్నా భావించి భగవంతుడిని తూలనాడినా, దేవుడేలేడు అని నిరశించినా స్వయంకృతాపరాధమే. భగవంతుడిని అదేపనిగా పూజిస్తూ, కీర్తిస్తూ, ఆయన నామస్మరణలోనే ఉన్నామనుకోండి, అనుభవించాల్సిన కర్మను అతితొందరలోనే తీర్చగల శక్తి ఆయనకు లేదా?
అందుకనే బాబా రెండు దక్షిణలు అడిగారు, శ్రథ్థ, సబూరీ.
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు యేమి చెప్పాడు? అనన్యా చింతంతోమా ..... అంటే అనన్యభక్తితో యెవరైతే నన్నే పూజిస్తాడో, సేవిస్తారో, (అంటే వేరెవరినీ కాకుండా) వాడు నన్నే చేరుతున్నాడని. మరి శ్రీ కృష్ణుడు భగవద్గీత చెప్పినందువల్లనే గొప్పవాడయ్యాడా? భగవద్గీత ఆమూలాగ్రం చదివి యెవరైనా చెప్పవచ్చుకదా? కాని యెవరూ చేయలేని, సాథ్యం కాని పని ఆయన చేసి చూపించారు. అదే అర్జునునికి విశ్వరూప సందర్శన భాగ్యం. ఈ ప్రపంచమంతా తానై నిండి ఉన్నానని, ఈ సకల చరా చర జగత్తు, కొండలు, కోనలు, సకల జంతుజాలం, మానవ మాత్రులు, అందరూ తనలోనే ఉన్నారని చూపించారు. ఒక్క అర్జునునికి మాత్రమే అటువంటి దర్శన భాగ్యం కలిగింది. చేయించేదీ, చేసేవాడను నేను నువ్వు నిమిత్తమాత్రుడవు మాత్రమే అని చెప్పారు.
ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను , అంతటా నిండిఉన్నాను. అన్ని జీవులలోనూ నన్ను చూడు అనే కదా బాబా చెప్పారు.
అలాగె బాబా కూడా భక్తి, శ్రథ్థలతో నన్ను పూజించు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నారు. అంటే యేమిటి భక్తి, శ్రథ్థ అనగా బాబాని పూజించేటప్పుడు, మనసు ఆయన మీద లగ్నం చెయ్యి. యిక మనసులో వేరే ఆలోచన రాకూడదు. పూజా గృహంలో పూజలో కూర్చుని స్వచ్చమైన మనసుతో పూజమొదలుపెట్టు. అయ్యో ఇవాళ, వెంకటేశ్వర స్వామి అష్టొత్తరం చదవలేదు, లేక విష్ణుసహస్రం చదవలేదు అని మనసులో సంశయం పెట్టుకోకుండా, అన్నీ ఆయనే అనుకుని పూజించు, ప్రార్థించు. పూజా సమయంలో నీ మనసులో క్రోథావేశాలు, గాని మరి యేఇతర ఆలోచనలు గాని ఉండకుండా చూసుకోవాలి. ఉదాహరణకి, మీరు పూజ మొదలు పెట్టారు, యింతలో చిన్న పిల్లవాడు వచ్చి మీ వళ్ళొ కూర్చున్నాడు, లేకపోతే అల్లరి చేశా. డు అప్పుడు మీరు, వాడిని కేకలేశారనుకోండి,.. చీ..చీ...మడి బట్టతో పూజ చేసుకుంటున్నాను వెధవ వచ్చి పాడు చేసాడని వాడిని ఒక్క దెబ్బ వేసారనుకోండి. యేమయింది< మీరు యెదటివారిలో భగవంతుడిని చూడలేదన్నమాటే గదా? లేక పూజ యథావిథిగా చాలా ప్రశాంతంగా చేసుకున్నారు. పూజగది బయటకి వచ్చిన వెంటనే మీకు యేదో విషయంలో కోపంవచ్చింది. క్రోథంతో ఊగిపోతూ అందిరిని తిడుతూ కోపం ప్రదర్సించారనుకోండి. మనం చేసిన పూజంతా వ్యర్థమే కదా? మరి బాబాని అనన్య భక్తితో పూజించీ ఫలితం లేకుండా ఉంటుంది.
మనమందరమూ మానవ మాత్రులమే. కోపం నాకూ ఉంది. అందుకనే మనలో ఉన్న చెడు గుణాలని క్రమ క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. మహామహులైన ఋషీశ్వరు లే కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, ఒకరినొకరు శపించుకునేదాకా వెళ్ళిన సందర్భాలు పురాణాలు చదివిన మనకందరకు తెలుసు. ఒక మునికి కోపం వచ్చిందనుకోండి, యెదటివాడిని శపిస్తాడు, యెదటి వాడు తిరిగి ఈయనని శపిస్తాడు, శాప ఫలం తీరే దాక అనుభవించాల్సినదే. తపస్సంతా వ్యర్హమేగా? మళ్ళి తపస్సు మొదలు.
అందుచేత, మనం మనలో ఉన్న చెడు లక్షణాలని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి. వాటిని అదుపులో పెట్టుకుని ఆయనని అనన్యమైన భక్తి శ్రథ్థల్తో పూజిస్తూ, సచ్చరిత్రలో చెప్పిన బోథలని కనక ఆచరిస్తూ ఉంటే బాబా దర్శన భాగ్యం కలుగుతుందంటంలో సందేహం లేదు.
మరలా తరువాత బాబా వారి మీద వివరణలు తెలుసుకుందాము
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు