07.09.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయిభక్తులు - అబ్దుల్ - 2 వ.భాగమ్
ఒకరోజు రాత్రి నాకు బాగా
అలసటగా ఉండి నిద్ర ముంచుకు రావడంతో నా అఱచేతులను దోసిలిలా పెట్టుకుని నిద్రకు జోగుతున్న
నా ముఖం పెట్టుకొన్నాను. నా పరిస్థితిని చూసిన
బాబా “చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా”? అని ప్రశ్నించారు.
ఆరోజు రాత్రి బాగా నిద్రమత్తులో బాబా మీద పడి నిద్రాస్థితిలోనే
ఆయన మీద ఒరిగిపోయాను. బాబా నాపాదాల మీద మెల్లగా
తట్టడంతో నిద్రనించి మేల్కొన్నాను. మరుసటి
రోజు ఒక విచిత్రం జరిగింది. నేను నా దోసిలిలోకి
నీళ్ళు తీసుకున్నాను. ఆ నీటిలో పూర్ణ చంద్రుడు
కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు
గంటలయింది. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు.