04.08.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నన్ను దూషించినా నిన్ను నిర్లక్ష్యం చేయను
ఈ రోజు సాయి బంధు శివకిరణ్ గారు చెప్పిన బాబా లీలను తెలుసుకుందాము. మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా, నిరాశ చెందినా, మనము పూజించే దేవుడిని తిడతాము. దూషిస్తాము. ఆఖరికి కోపంతో ఏదయినా చేస్తాము. కాని మన బాబా తన పిల్లలమీద కోపగించుకోరు. అందుచేతనే బాబా చెప్పారు. శ్రధ్ధ, సబూరీ ఉండాలి అని. ఎంతటి కష్ట దశలో ఉన్నాసరే మనం నిరాశ పడకుండా బాబా మీదే భారమంతా వేసి ఓర్పు వహించాలి. మనకి సహాయం చేసేది భగవంతుడు (బాబా) కాక మరెవరు చేస్తారు? ఇప్పుడు మీరు చదవబోయే లీలలో బాబా స్వయంగా వచ్చిన అధ్బుతమైన లీలని చదివి మనసారా ఆస్వాదించండి. మనం అనుకున్నది అనుకున్నట్లు జరగలేదని బాబాని నిందించవద్దు, దూషించవద్దు. ఆయన మనకెప్పుడూ మంచే చేస్తారు తప్ప అపకారం చేయరు అని మాత్రం మన సాయి బంధువులందరూ గుర్తు పెట్టుకోవాలి.
సాయి బంధు శివ కిరణ్ గారు వివరించిన బాబా లీల
నాపేరు సీ.హెచ్.శివకిరణ్. నేను హైదరాబాదులో ఉంటాను. మాస్వంత ఊరు కర్నూలు. 2010 వ సంవత్సరం లో నాకు కలిగిన అనుభవాన్ని మీకు వివరిస్తాను. నా తల్లితండ్రులు నాతో హైదరాబాదులోనే ఉంటున్నారు. 2010 వ. సంవత్సరం మధ్యలో ఇద్దరూ కర్నూలులో ఉన్న మా పెద్ద అన్నయ్యని, పిల్లలని చూడటానికి కర్నూలు బయలుదేరి వెళ్ళారు. హైదరాబాదునుంచి బయలుదేరేటప్పుడు మానాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు. అక్కడకు వెళ్ళినతరువాత మానాన్నగారి స్నేహితుని కొడుకు వివాహానికి వెళ్ళవలసి ఉంది. ఇంతవరకూ అంతా బాగానె ఉంది. వివాహానికి వెళ్ళిన తరువాత కర్నూలులో యింటికి వచ్చారు. మధ్య రాత్రిలో మానాన్నగారు బాత్ రూముకు కూడా వెళ్ళలేనంతగా నీరసంగా అయిపోయారు. మా అన్నయ్య, వదిన ఆయనని బాత్ రూముకి తీసుకునివెళ్ళారు. బాత్ రూం నుంచి వచ్చిన తరువాత బాగా నీరసంతో నేలమీదనే పడిపోయారు. వెంటనే ఆయనని హాస్పటలికి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఈ విషయం తెలియగానే నేను కర్నూల్ కి బయలుదేరాను. లో బీ.పీ.వల్ల ఎడమవైపు కిడ్నీ కుంచించుకు పోయిందని, ఇంకా సివియర్ గా హార్ట్ ప్రోబ్లెం కూడా ఉందని డాక్టర్ గారు చెప్పారు. అందుచేత ఆయనని హైదరాబాదులోని కార్పోరేట్ హాస్పిటల్ లో చూపిస్తే మంచిదని చెప్పారు. నాకు నెలకి 8,000/- జీతం వస్తుంది,అటువంటప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకునివెళ్ళడం చాలా కష్టం. చిన్నప్పటినుంచీ నేను బాబా భక్తుడిని, మాయింటిలోనివారందరూ కూడా.
అలా 10 రోజులు గడిచాయి. ఆఖరికి డాక్టర్స్ హైదరాబాదులోని కార్పొరేట్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తే తప్ప లాభం లేదని తేల్చి చెప్పి డిస్చార్జ్ చేశారు. నేను ఉద్యోగానికి సెలవు పెట్టి కర్నూల్ లో ఉన్నాను. మాయింటిలో పెద్ద బాబాఫోటో ఉంది. 11 వ రోజు రాత్రి నేను ఆ పటం వంక నిరాశగా చూస్తూ, "ఒకవేళ నాన్నగారికి ఏమన్నా అయితే కనక ఆముసలివాడి ఫోటోని యింటి బయటకు విసిరివేయమని" మా అమ్మతో చెప్పాను. ఆమరుసటిరోజే నేను హైదరాబాదుకు తిరిగి వచ్చేశాను. ఆరోజున నా స్నేహితుడొకడు విశాఖపట్నం నించిచి ఫోన్ చేశాడు. (మిస్టర్. ప్రసాదరావు, సిమ్హా చలం lలో ఉంటాడు) మానాన్నగారి ఆరోగ్యం గురించి అడిగాడు. నేను మొత్తం విషయమంతా వివరించాను. అతను, "మీనాన్నగారి నోటిలో ఊదీ వెయ్యి అంతే, బాబాఆయనని రక్షిస్తారు" అని చెప్పాడు. అతను ఇవే మాటలని పదే పదే అరగంటసేపు ఫోన్ లో చెప్పాడు. వెంటనే నేను మా అమ్మగారికి ఫోన్ చేసి బాబా గుడికి వెళ్ళి ధునిలోని ఊదీని తీసుకునివచ్చి నాన్నగారి నోటిలో వేయమని చెప్పాను. మరునాడు నేను మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు మనసు బాగుండక గుడికి వెళ్ళలేకపోయానని చెప్పింది. కాని ఆరోజు రాత్రి జరిగిన లీలని చెప్పింది.
మా అమ్మగారు, మాఅ న్నయ్య, వదిన, పిల్లలు అందరూకూడా హాలులో పడుకున్నారు. మరొక గదిలో మానాన్నగారు పడుకున్నారు . హటాత్తుగా మధ్యరాత్రిలో రెండు గంటలకు పెద్ద శబ్దం వినపడిండి. ఎవరో దొంగ దొంగతనానికి వచ్చి ఉంటాడని మా అమ్మ చాలా భయపడిపోయింది. సహాయం కోసం మా వదినని లేపిందిటగాని, ఆమె చాలా గాఢ నిద్రలో ఉండి లేవలెదు. వెంటనే మా అమ్మ కళ్ళు మూసుకుంది. ఆపుడామె ఒక ముసలివానిని చూసింది. కాని మోకాళ్ళనించి కాళ్ళ వరకు మాత్రమే కనపడుతున్నాయి. అతను తన కాళ్ళతో పెద్ద శబ్దం చేసుకుంటూ మానాన్నగారి గదిలోకి వెళ్ళాడు. కోపంగా మంచం చుట్టూ తిరిగాడు. మా అమ్మకి చాలా భయం వేసి నిద్రపోయింది. వేకువజాముననె 4, 5 గంటల మధ్య తెల్లటి పైజామా, నామాలతో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. ఆసమయంలో మా వదిన మేలుకొని, భయంతో మా అమ్మని లేపడానికి ప్రయత్నించింది. కాని మా అమ్మ చాలా గాఢ నిద్రలో ఉంది. ఆఖరికి మా వదిన తలుపు తీసి చూసేటప్పటికి అక్కడ ఒక ముసలివాడు నిలబడి ఉన్నాడు. నీకేమి కావాలి అని అడిగింది మావదిన. నువ్వు నాతో రా, నీకు దారి చూపిస్తాను అని అన్నాడు ఆ ముసలివాడు. మావదిన చాలా సందిగ్ధంలో పడి, ఆఖరికి ఆతనితో కొంతదూరం వరకూ వెళ్ళింది. తెల్లవారుజాము కాబట్టి రోడ్డుమీద ఎవరూ లేరు. తను ఆ ముసలివాని కూడా వెళ్ళింది. కొంత దూరం వెళ్ళినతరువాత ఒక సందు చూపించి నువ్వు ఈదారిలో రా, నేను వెడుతున్నాను అని చెప్పాడు. ఆసందు షిరిడీ సాయిబాబా గుడికివెళ్ళే రోడ్డుతప్ప మరేదీ కాదు. మాకు పాలుపోసే అతను పొద్దున్నే వస్తూ ఉంటాడు. అతను మా వదినను రోడ్డుమీద చూసి, "అమ్మా, ఇంతపొద్దున్నే ఇక్కడ రోడ్డుమీద ఎందుకు నుంచున్నారు," అని అడిగాడు. యింతవరకూ జరిగినది అర్ధం చేసుకోలేని స్థితిలో ఉండి, దిగ్భ్రమ చెందింది. వెంటనే మా వదిన యింటికి వెళ్ళింది. మొత్తం జరిగిన విషయమంతా మా అమ్మ, వదిన నాకు ఫోన్ లో చెప్పారు. అప్పుడు నేను ఊదీ తీసుకురావడానికి గుడికి వెళ్ళారా అని అడిగాను. తాము వెళ్ళలేదని చెప్పారు. నేను వెంటనే అదేరోజు కర్నూలుకు బయలుదేరాను. బాబా గుడికి వెళ్ళి ఊదీని తీసుకుని వచ్చి మా నాన్నగారి నోటిలో వేశాను. 3 రోజుల తరువాత, సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళకూడదు అని అనిపించింది. కర్నూలులో ఉన్న ఎండీ.డాక్టర్ దగ్గరకు వెళ్ళి మానాన్నగారి రిపోర్టులన్నీ చూపించాను. మరలా ఆయన, హార్ట్ కి, కిడ్నీకి, లివర్ కి, అన్నీ పరీక్షలు చేయించమని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చాక, చూసి, ఎవరు చెప్పారు, ఆయన కిడ్నీ పనిచేయటల్లేదని, కిడ్నీ చాలా బాగా పనిచేస్తోంది, ఎవరు చెప్పారు, హార్ట్ ప్రోబ్లెం ఉందని, హార్ట్ చాలా బాగా పనిచేస్తోంది అని చెప్పేటప్పటికి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. వయసు పెరిగేకొద్దీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అంటే దాని అర్ధం లివరు, కిడ్నీ, హార్ట్ సరిగా పనిచేయటల్లేదని కాదు. అని డాక్టర్ గారు చెప్పారు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు