Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 21, 2011

బాబా చెప్పిన మంచి మాటలు

0 comments Posted by tyagaraju on 8:46 AM


21.05.2011 శనివారము

బాబా చెప్పిన మంచి మాటలు

ఈ రోజు మనము సచ్చరిత్ర 19 అథ్యాయములో బాబా గారు చెప్పిన కొన్ని మంచి విషయాలను చెప్పుకుందాము. కొన్ని మంచి విషయాలేమిటి? మొత్తం సచ్చరిత్ర అంతా కూడా మంచి మంచి విషయాలతో కూడి ఉన్నట్టిదే? వాటిలో కొన్ని తెలుసుకుందాము.

****

నా నామం పలకండి. నన్ను శరణనండి అని బాబా అందరికీ చెప్పారు. దానితో పాటు తాము యెవరో తెలుసుకోవటానికి తమ కథలను శ్రవణం, మననం చేయమని చెప్పారు. ఈ ప్రకారంగా కొందరికి భగవంతుడి నామస్మరణ, కొందరికి భగవంతుడి లీలలను వినటం, మరి కొందరికి భగవంతుణ్ణి పూజించటం గురించి బాబా చెప్పేవారు. వేరు వేరు అథికారాలున్న భక్తులకి వేరు వేరు నియమాలను చెప్పేవారు. కొందరికి అథ్యాత్మ రామాయణం, కొందరికి జ్ణానేశ్వరి పునశ్చరణ, కొందరికి హరివరద పారాయణం, కొందరికి గురుచరిత్ర చదవమని చెప్పేవారు. కొందరి మెళ్ళో విష్ణు సహస్ర నామావళిని కరుణతో వేసేవారు. కొందరికి రామ విజయం చదవమని చెప్పేవారు. కొందరికి థ్యానథారణ, నామస్మరణ గొప్పతనం గురించి చెప్పేవారు. ఇలా ఆయన ఇచ్చే దీక్షా పథ్థతులకు లెక్క లేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి స్వప్నంలో సూచనగా ఉపదేశించే ఆయన జీవన సరళి అద్భుతం. అన్ని జాతులకి చెందిన భక్తులు బాబా దర్శనానికి వచ్చేవారు. మద్యంపై ప్రీతి ఉన్నవారి కలలోకి వెళ్ళి బాబా వాళ్ళ చాతీపై కూర్చుని చేతులతో, కాళ్ళతో అణచివేసి, మద్ద్యాన్ని యెప్పుడూ ముట్టను అని వాళ్ళతో వాగ్దానం చేయించుకునేవారు. అలా ఒట్టు పెట్టేదాకా వారిని వదిలేవారు కారు. కొందరి స్వప్నాలలోకి వెళ్ళి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణులాంటి మంత్రాలను వ్రాసేవారు.



అందుచేత సాయి బంధువులారా, బాబా నామాన్ని పలకండి. నామ స్మరణ చేయండి. లిఖిత జపం కూడా చేయండి.
నేను ఒక వారం క్రితం నా బదిలీ గురించి లిఖిత జపం మొదలు పెట్టాను. వారం రోజులలోనే బాబా వారు నామీద దయ తలచి అతి తొందరగా బదిలీ ఇప్పించారు. బాబా కి నేను సదా కృతజ్ణుడిని. ఓం సాయిరాం.

ఈ రోజు హైదరాబాదునుంచి శ్రీ నగేష్ గారు బాబా భజన పాట ఒకటి పంపించారు. వారు ఈ పాటను బాబా భజనలో పాడుకుంటారుట. శ్రీ నగేష్ గారికి బాబా వారి ఆశీర్వాదములు.


త్యాగరాజు గారు ,అందరికి బాబా ఆశిర్వధములు ,

మేము బాబా భజనలో పాడుకొనే ఒక పాటను బాబా బంధువులందరికీ బాబా కృపతో అందిస్తున్నాను

శరణం శరణం శరనమయా
సాయి శరణం శరణం శరనమయా
సాయి పాదములే శరనమయా || శరణం||

ఎందుకు ఈ దేహం సాయి దీక్షను పూననిదే
ఎందుకు ఈ జన్మ షిర్డీ యాత్రను చేయనిదే || శరణం||

ఎందుకు ఈ శిరసు సాయి పాదుక మోయనిదే
ఎందుకు ఈ బుజము సాయి పల్లకి మోయనిదే || శరణం||

ఎందుకు ఈ కనులు సాయి రూపము చూడనిదే
ఎందుకు ఈ కరము సాయి పూజలు చేయనిదే ||శరణం||

ఎందుకు ఈ హృదయం సాయి కోవెల కట్టనిదే
ఎందుకు ఈ మనసు సాయి ద్యానము చేయనిదే || శరణం||

ఎందుకు ఈ గలము సాయి శరణము చెప్పనిదే
ఎందుకు ఈ గలము సాయి నామము పలకనిదే ||శరణం||

ఎక్కడ కైలాసం సాయి ఎక్కడ వైకుంటం
శిర్డే కైలాసం సాయి సన్నిదే వైకుంటం ||శరణం||

శరణం శరణం శరనమయా
సాయి శరణం శరణం శరనమయా
సాయి పాదములే శరనమయా

సర్వం శ్రీ సాయినాథ సమర్పయామి

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Friday, May 20, 2011

పల్లకి ఉత్సవం

0 comments Posted by tyagaraju on 8:01 AM




20.05.2011 శుక్రవారము


పల్లకి ఉత్సవం



ఓం సాయి శ్రీ సాయిజయజయ సాయి

సాయి బంధువులందరకు బాబా వారి ఆశీస్సులు

షిరిడీలో ప్రతీ గురువారం చావడి ఉత్సవం జరుగుతుందని మనకందరికి తెలుసు. అసలు ఆ చావడి ఉత్సవం యెప్పుడు యెలా ప్రారంభమయిందో ఈ రోజు తెలుసుకుందాము.


షి
రిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు.

అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909 లో జరిగింది. అంటే ప్రస్తుతానికి దాదాపు 101 ఏళ్ళముందు జరిగిందన్నమాట. ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం" గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివుని లా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబా కు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ" ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు.

ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.



వాణీ జయరాం పాడిని ఈ హారతి పాట చూడండి. దీని లింక్ ఫేస్ బుక్ లొ కూడా ఉంచాను. మనసారా ఆలకించండి.

జయ షిరిడీశ జగన్నివాస మనసే హారతి
అందది కళ్ళు నీ మీదేరా హరిఓం హారతీ
పాలించే మరి పవళించేందుకు తారా హారతి ||జయ||
సాధు రూపం దాల్చిన సాయికి సద్గుణ హారతి
గురువారమున పుట్టిన సాయికి నిగ్రహమే హారతి
వెల్లువలయ్యే నీ వరములకు వందన హారతీ
చల్లని చూపుల సాయి నీకు చంద్రా హారతి ||జయ||
రామనవమిని జన్మించిన శ్రీరామా హారతి
ద్వారకమాయి మెట్టిన ఓ ఘన శ్యామా హారతి
పావన నామ పావన రూప నీకే హారతి
శివ తేజార్చిత గణపతి రూప వరదా హారతి ||జయ||
సకలము నీవే సర్వము నీవే, నేనే నీవయా
నీ లీలలను తెలియగ నేరము నీవే భారము
పంచభూతముల శాసించేటి శక్తే నీవయా
షిరిడీ క్షేత్రము దర్శన భాగ్యము కలుషాహరణము ||జయ||
శ్యామా, నానా, దాసగణుల దయతో కాచితివి
ఇహ పరమొసగే భక్తికి ముక్తిని వరమే ఇచ్చితివి
తల్లివి నీవే, తండ్రియు నీవే, గురువే నీవయా
సర్వ దేవతా నిలయము నీవే కొనుమా హారతి ||జయ||
దుప్పటి పైనా, దుప్పటి పరచి శయ్యే వున్నదీ
అరువది మించిన కళలకు నీవు దిక్కే అన్నది
వెన్నెల మనసుకంటే దైవం వేరేమున్నది
అమృతమూర్తి ఆరాధనలో ముక్తే వున్నది ||జయ||

అరిషడ్వర్గము అన్నిట మించిన మోహము మాయనిది
నానా కనులకు తెరలే కప్పుట దాల్చీ బ్రోచితివి
బ్రహ్మము కోరిన వ్యాపారికి మరి జ్ఞానము తెలిపితివి
లోభికి ఎన్నడు వశమే కానని ఇలలో చాటితివి ||జయ||

నిత్య సేవలు అందే నీకే తగునీ హారతీ
నవ మార్గముల భక్తిని తెలిపిన సాయి హారతి
దూషణ, భూషణ సమముగ నెంచే సాయీ హారతీ
సర్వ దేవతా సంగమ రూపా సాయీ హారతి ||జయ||

జయ షిరిడీశ జగన్నివాస మనసే హారతి
భక్తుల ఆశల రూపం నీవే సాయీ ఆరతి
అందరి కళ్ళు నీ మీదేరా హరిఓం హారతీ
పాలించే మరి పవళించేందుకు తారా హారతి ||జయ||



















Thursday, May 19, 2011

భగవన్నామము యొక్క ప్రభావము

0 comments Posted by tyagaraju on 8:36 AM



భగవన్నామము యొక్క ప్రభావము


19.05.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి ఆశీర్వాదములు.

7 మాసముల సెలవు తరువాత మరలా తిరిగి ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. అందుకనే ప్రతీరోజు ఒక లీల ఇద్దామన్నా కూడా వీలు లేకుండా పోతోంది. సమ్యం చిక్కినప్పుడల్లా వీలు చూసుకుని పోస్ట్ చేస్తున్నాను.
అంతా బాబాయే చేయిస్తున్నారు. ప్రతీ రోజు యేదోఒకటి పోస్ట్ చేస్తె అదొక తృప్తి. కాని యేది పోస్ట్ చేసినా అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. పోస్ట్ చేసేది యేదో చదవడానికి కాదు. మనం చదివేది మనకి, మనం మళ్ళీ యతరులకి చెప్పదగ్గదిగా ఉండాలి.

ఈ రోజు మనం నామ జపం గురించి తెలుసుకుందాము. రాముడైనా, కృష్ణుడైనా అంతా బాబాయే.


నామమును జపించుట, కీర్తించుట, శ్రవణము చేయుట, స్మరించుట వలన పూర్వము చేసుకున్న సమస్త పాపములు నశిస్తాయి. అజ్ణానంతో మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారములు, రాగ ద్వేషాలు, కామక్రోథములు, లోభమోహములు మొదలైన దుర్గుణాలన్నీ కూడా సమసిపోతాయి. వాటినుండి విముక్తులమవుతాము. అన్ని దురలవాట్లు కూడా మనలని విడిచిపోతాయి. దుఖములన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నామ జపము వల్ల పరమాత్మని తప్పక పొందవచ్చు.

హనుమంతుడు పావనమైన శ్రీ రాముని తన వశమందుచుకొనగలిగాడు. ఆర్తుడైన గజేంద్రుడు, చిలుకకు రామ నామము నేర్పిన గణికాంగన శ్రీ హరినామ మహిమతో ముక్తిని పొందారు.

లోపల, బయట కూడా ప్రకాశముము కోరుకున్నట్టైతే ముఖమనెడి ద్వారమున నాలుక అనే గడపపై రామనామము అనే మణిద్వీపాన్ని ఉంచాలి.

ఒక కవి ఇల్లా చెప్పారు

"యెండుగడ్డిమీద నిప్పుకణిక పడినచో అది దగ్ధమైనట్లు భగవన్నామమును హృదయమునందు జపించినచో పాపములన్ని నశించును."

శ్రీ మద్భాగవతంలో :

అజ్ణానాదథవా జ్ణానాదుత్తమశ్లోకనామ యత్

సంకీర్తితమఘం పుంసో దహేదేథో యథానలహ

" అగ్ని కఱ్ఱలను కాల్చివేయును. అట్లే తెలిసి అయినను, తెలియక అయినను ఉత్తమ శ్లోకుడగు శ్రీహరినామమును కీర్తించిన వారియొక్క పాపములన్నియు నశించును."

శ్రీ చైతన్య మహా ప్రభువు యిలా చెప్పారు:

"భగవంతుడు తన అనేక నామములను ప్రకటించెను. వాటిలో తన శక్తినంతయు జొప్పించెను. వానిని స్మరించుటకు కాలనియమేదియును చేయలేదు. మనుష్యుడు యెల్లవేళల భగవన్నామమును స్మరింపవచ్చును. దీనికి యే ఆటంకము ఉండదు.

శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ యిలా చెప్పారు.

"మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావించదగును. యేలననగా అతడు నిశ్చయ బుథ్థి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి యేదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.కౌంతేయా ! అతడు శీఘ్రముగా థర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు"

నామము నామి నుండి వేరు కాదు.

నామము అంటే పేరు; ఆ నామము కలవాడు నామి.

నామమును జపించుటవలన నామి యొక్క స్మరణము సహజముగ అప్రయత్నముగ జరుగుచుండును.

వాక్కు ద్వారా భగవన్నామమును జపించుటకంటె మనస్సులో థ్యానించుట వలన అది వందరెట్లు అథిక ఫలాన్నిస్తుంది. ఆ మానసిక జపము కూడా శ్రథ్థాభక్తులతో చేస్తే కనక దానివలన అనంతఫలము లభిస్తుంది. దానిని గుప్తముగా నిష్కామభావముతో చేసిన యెడల అది శీఘ్రముగా పరమాత్మ ప్రాప్తిని కలుగచేస్తుంది.

నామ జపము వలన పాపములు నశించుచుండును కదా అని తలచి పాపములను ఆచరించుట, ప్రజలముందు ప్రదర్శించుటకు నామజపమును నెపముగా చేసుకొని, రహశ్యంగా పాపములు చేయుట, భగవన్నామము పేరుతో పాపము చేయుట యివి అన్నీ డాంబికముగా ప్రవర్తించుటయే అవుతుంది.

నామ రహశ్యమును తెలుసుకున్నవాడు దోషరహితుడు అవుతాడు.
అంతా చదివారు కదా. ఇందులో ముఖ్యంగా మనము గమనింపవలసినది యేమిటంటే ఆ భగవన్నామౌ, శ్రీరామునిది కావచ్చు, శ్రీకృష్ణపరమాత్మునిది కావచ్చు, షిరిడీ సాయిబాబాది కావచ్చు. కాని ఆ నామము సదా మన మనసులో జపం చేయబడుతూ ఉండాలి. నామ జపానికి కాల నియమమేదీ లేదు. యే సమయంలోనైనా జపించుకోవచ్చు.
ఆఖరికి మనము స్నానాల గదిలో స్నానం చేస్తున్నా కూడా "సాయి సాయి" అని నామ స్మరణ చేసుకోవచ్చు. నామ జపము చేసిన వాడికి అంతకంటే ముక్తికి దగ్గిర దారి మరొకటి లేదు. కాని ఆ నమ జపం చేయడం మనం యితరులు చూడటానికి కాదు . "ఆహా ! ఈయన యెంతటి బాబా భక్తుడొ అని అనిపించుకోవడానికి కాదు. మనము మన్స్పూర్తిగా బాబామీదే మనసు లగ్నం చేసి సాయి నామ స్మరణ నిరంతరం మనసులోనే జపిస్తూ ఉంటే ఆయన మన మనసులో స్థిరంగా ఉంటారు. మనకి తక్షణ సహాయం అందిస్తారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Tuesday, May 17, 2011

శ్రీ భరద్వాజగారి ద్వారా బాబా లీల

0 comments Posted by tyagaraju on 6:28 AM



17.05.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ భరద్వాజగారి ద్వారా బాబా లీల

బాబా శక్తి అమోఘం. బాబా తన భక్తుల ద్వారా కూడా తన లీలను చూపిస్తారు. శ్రీ యెక్కిరాల భరద్వాజ గారిని తెలియని వారుండరు. ఆయన గొప్ప బాబా భక్తులు. ఈ అద్భుతమైన బాబా లీలను చూడండి.
షిరిడీ సాయి బాబా అంకిత భక్తులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు.

భరద్వాజ మాష్టారు గారి ద్వారా మాట్లాడలెని అమ్మాయికి మాటలాడే శక్తి యెలా వచ్చిందో తెలుసుకుందాము.

నెల్లూరు దగ్గిర కొత్తపలెం లో ఒక గ్రామస్తురాలు అమెరికన్ ఆస్పత్రిలో ప్రసవించింది. ఒక పాప పుట్టింది. తరువాత ఆ పాపను తీసుకుని యింటికి బయలుదేరారు. నెల్లూరులో రైలు ఎక్కుతున్నప్పుడు తల్లి, తను చంటి పిల్లతో రైలు యెక్కడం కష్టమని రైలులో ఉన్న ఒకామెకు తన చంటి బిడ్డను అందిస్తుండగా పిల్ల జారి రైలు, ప్లాట్ ఫారంమథ్య పడిపోయిందిట.
తలకు దెబ్బ తగిలింది. గూడూరులో దిగి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఆయన వైద్యం చేశారు. తరువాత యింటికి తీసుకొని వెళ్ళారు. పిల్ల పెరిగి పెద్దవుతున్నా 6 సంవత్సరముల వయసు వచ్చినా మాటలు రాలేదుట. నడక కూడా రాలేదు.

కొత్తపాలెంలో శ్రీ గోపాలయ్యగారి యింట్లొ మాష్టారు గారు సత్సంగము యేర్పాటు చేయగా మాస్టారు గారు వచ్చి సత్సంగం నిర్వహించారు. భజన కుడా చేశారు. తరువాత సాయిబాబాకు పాయసం నైవేద్యం పెట్టారు. ఆ రోజు తలకి దెబ్బ తిన్న ఆ ఆరేళ్ళ పాప సత్సంగంలో తల్లి ఒడిలో కూర్చుని ఉంది. ఆ పాయసం, మాస్టారు దగ్గరున్న సమయంలో ఆ పాప పాకుకుంటూ వచ్చి ఆచార్యుల వారి దగ్గిరకు వచ్చింది. అప్పుడు ఆ పాప దెబ్బతగిలిన సంఘటన అంతా అక్కడున్నవారు మాస్టారుగారికి చెప్పారు. ఆ పాపని చూసిన ఆచార్యులవారికి జాలి కలిగింది. శ్రీ సాయిబాబా అయితే ఈ పాపకు మాటలు తెప్పించేవారు కదా అని అనుకున్నారు. ఆ పాప నుంచోవటానికి, యేదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తోందని చూసిన శ్రీ భరద్వాజ గారు దగ్గరకి వచ్చిన పాపను ఒళ్ళోకి తీసుకుని శ్రీ సాయిబాబాకు నివేదించిన పాయసం ఆ పాప నోట్లో పెట్టి తినిపించారు. తరువాత వారు విద్యానగర్ వచ్చారు.

మరునాడు మాస్టారుగారి శిష్యుడు విజయకుమార్ విద్యానగర్ వచ్చి మాస్టారుగరితో, "మీరు నిన్న పాయసం తినిపించడంతో ఆ పాపలో మార్పు చ్చింది. కాళ్ళలో కొంచెం శక్తి వచ్చి కొంచెం సేపు నించోకలుగుతోంది. గొంతులో కూడా కొంత మార్పు వచ్చింది అని చెప్పడంతో మాస్టారుగారు కూడా ఆశ్చర్య పోయారు. తరువాత క్రమక్రమమంగా ఆ పిల్ల అడుగులు వేయటం, కొన్ని పదాలు పలకడం కూడా వచ్చింది. ఈ విథంగా తన భక్తులను ఆదుకునే శక్తిని బాబా తన అంకితభక్తుడైన మాస్టారుగారికి ఇచ్చారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Sunday, May 15, 2011

బాబా కి సమర్పించు దుస్తుల కొలతలు

0 comments Posted by tyagaraju on 3:59 AM




15.05.2011 ఆదివారము

బాబా కి సమర్పించు దుస్తుల కొలతలు

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబా ఆశీర్వాదములు

ఈ రోజు బాబాకి సమర్పించే దుస్తుల కొలతలు యేవిథంగా ఉండాలి, షిరిడీలో వాటిని యెలా సమర్పించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము.

ఈ సమాచారమంతా షిరిడీలో బాబాకి దుస్తులను సమర్పిద్దామనుకునేవారందరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి బ్లాగునుండి తెలుగు అనువాదం.

ప్రియమైన పాఠకులారా, నేను షిరిడీ యాత్ర చేసినప్పుడు నాకు కలిగిన స్వీయానుభవంతో దీనిని రాస్తున్నాను. దుస్తుల కొలతలు, సమర్పించే విథానం రాసేముందు , ప్రతీవారి దుస్తులను స్వీకరించి, అందరి హృదయాలను ప్రేమ భక్తితో నింపమని నేను బాబాని ప్రార్థిస్తున్నాను.

నాకొక విషయం తెలుసు, యెవరయితే సాయి లీలలను ప్రేమతో వింటారో, ఆయన చూపిన దారిలో పయనిస్తారో, వారు బాబాతో కలిసి ఉంటారు. ఆయన శక్తి మీద నమ్మకం ఉంచుకుని, శరణాగతి చేసి, సందేహానికి తావులేకుండా, ధృఢమైన భక్తితో ఉండాలి. ఆయన యశస్సు మచ్చ లేనిది. నన్ను నమ్మండి, మీరు అలా కనక చేస్తే మీ చింతలు, బాథలు, భయాలూ, అన్ని చుట్ట చుట్టుకుపోతాయి.



నేనిప్పుడు అసలు విషయానికి వస్తాను. మీరు యేదీ కూడా మిస్ అవకుండా నేను ప్రతీ విషయం దేనికదే రాస్తున్నాను.

1. యెప్పుడూ పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని వెళ్ళద్దు, కారణం బాబా యేది చేసినా మంచి కోసమే, ఒకవేళ యేకారణం చేతనయినా మీరు సమర్పించే దుస్తులని అంగీకరించకపోతే, బాబాకి మీమీద ప్రేమ లేదనుకోకండి, మీరు దురదృష్టవంతులనుకోకండి. శ్రథ్థ, నమ్మకంతో ఉండండి, సాయి అందరినీ సమ దృష్టితో చూస్తారన్న్నది నిజం.

2. యెప్పుడూ, బాబా దుస్తులని మీరే స్వయంగా కుట్టండి. ఫాన్సీగానూ, ఖరీదుగానూ ఉండే బట్టలని కొనకండి. బాబాగారు థరించేది మీ ప్రేమని, భక్తిని మాత్రమే, మీరు సమర్పించే థనాన్ని కాదు.

3. తయారు చేసిన దుస్తులను చక్కగా కుట్టండి, దానిమీద అందంగా చీటీ మీద రాయండి. సమాథి మందిరం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి మీరు సమర్పించే దుస్తులతో వెళ్ళండి. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మిమ్మలిని తప్పకుండా ఆపేస్తాడు. అతనితో, మీరు బాబాకి దుస్తులు సమర్పించదలచుకొంటున్నానని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారిని కలవాలని చెప్పండి.

4. ఒకసారి మీరు అడ్మినిస్ట్రటివ్ యే ఆఫీసరుగారిని కలుసుకున్నా, వారికి మీరు సమర్పించే దుస్తులను చూపించండి వారు మిమ్మల్ని హెచ్.ఓ.డీ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్) కి పంపుతారు. ఆ హెచ్.ఓ.డీ వాటిని బాబాకి యెప్పుడు వేయాలో ఆయన నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం యెప్పుడు వేసేదీ మీకు సమాచారం అందిస్తారు.

5. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారిని కలవలేకపోతే, దాని బదులు మీరు చేయవలసినది డొనేషన్ కవుంటర్ వద్దకు వెళ్ళి చెప్పండి, వారు భక్తులకి ఈ విషయంలో సహాయ పడతారు.

ప్రయత్నించండి, ఓడిపోవచ్చు, కాని యెప్పుడూ ప్రయత్నించడంలొ విఫలం అవద్దు.

6. యెప్పుడు చాలా వైటింగ్ లిస్ట్ ఉంటుంది. కాని సాయి మీదుస్తులని థరించాలనుకుంటే ఆయన దగ్గిర యే లిస్టూ, యే రూలూ పనిచేయదు. అంచేత మీ మనసులో యే విథమైన ఆలోచన లేకుండా, పూర్తిగా శరణాగతి చేయండి.

ఇప్పుడు నేను దుస్తుల కొలతల గురించి చెపుతాను.

బాబా విగ్రహానికి ::

పొడవు 3 మీటర్లు, వెడల్పు 46 అంగుళాల కొలతలతో గుడ్డ తీసుకోండి.

బాబా సమాథి మీదకి ::

పొడవు 3 మీటర్లు, వెడల్పు 46 అంగుళాలు

తలపాగా ::

1.5 మీటర్ల గుడ్డ తీసుకోండి.

మెడలో కండువాకి ::

ముదురు రంగులో 2 మీటర్ల గుడ్డ.

సాయిరాం

అల్లాహ్ మాలిక్

***
ఇందులో ఇచ్చిన చిత్రాలలో శ్రీమతి ప్రియాంకా గారు సమర్పించిన దుస్తులను చూడండి.

బాబా గారు వాటిని స్వీకరించిన లీలను కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. పేరు : నా కలలో షిరిడీ, షిరిడీ.

చదివి ఉండకపోతే అదికూడా చదవండి.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List