30.07.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
రేపు అనగా 31.07.2015 గురుపౌర్ణమి. మన సద్గురువు అయిన బాబావారిని ఎప్పటిలాగే మనసారా స్మరించుకుంటూ ఉందాం.
గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞానాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భారతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.
గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
******
ఈ రోజు ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి లో ప్రచురింపబడిన మరొక బాబా లీలను తెలుసుకుందాము. భారత దేశం నుంచి ఎక్కడికో వేల మైళ్ళదూరంలో ఉన్న విదేశానికి ముఖ్యమయిన పత్రాలను తీసుకుని వెళ్ళడం మరచిపోతే ఇక ఆవ్యక్తి పడే అవస్థ వర్ణనాతీతం. వెనక్కి వచ్చి తీసుకుని వెళ్ళే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో ఎవరు సహాయం చేయగలరు? కాగితాలు ఇంటివద్దకూదా కనపడకపోతే ఇక ఏమి చేయాలి?