09.04.2023 ఆదివారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –19 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన
– విజ్ణానయోగము
శ్లోకములు 21 , 22 లకు కొనసాగింపు
శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ –
26
భక్తపంత్
పంత్ అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు. అతడు తన అదృష్టవశమున ఒకనాడు షిరిడీకి వచ్చాడు. అతనికి షిరిడీకి వెళ్ళడం ఇష్టం లేదు. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. అతడు రైలులో ప్రయాణము చేయుచుండగా అనేకులు బంధువులు, స్నేహితులు కలిసారు. వారందరూ షిరిడీకి ప్రయాణమయి వెడుతున్నారు. వారందరూ పంత్ ని తమతో కూడా షిరిడీకి రమ్మన్నారు. అతడు వారి మాటలు కాదనలేకపోయాడు. వారందరు బొంబాయిలో దిగారు. పంత్ విరార్ లో దిగాడు.
అక్కడ తన గురువును దర్శించి షిరిడీకి పోవడానికి అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తం డబ్బును సమకూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చాడు. అందరూ షిరిడీకి చేరి 11 గంటలకు మసీదుకు చేరుకొన్నారు. బాబాను పూజించడానికి మసీదులోకి చేరుకొన్న భక్తుల గుంపును చూసి అందరు ఎంతగానో సంతోషించారు.
కాని
పంత్ కి హటాత్తుగా మూర్చ వచ్చి క్రింద పడ్డాడు.
అందరు చాలా భయపడ్డారు. అతనికి చైతన్యం
కలిగించటానికి ప్రయత్నించారు. అతని ముఖముపై
నీళ్ళు చల్లగా బాబా కటాక్షం వల్ల తెలివి వచ్చింది. నిద్రనుంచి లేచినవానివలె లేచి కూర్చొన్నాడు. సర్వజ్ణుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలుకు శిష్యుడని
గ్రహించి నిర్భయముగా ఉండమని ధైర్యం చెబుతూ తన గురువునందే భక్తి నిలుచుకొనేలా ఈ విధంగా
అన్నారు. “ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడు నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము.” పంత్ ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ణప్తికి తెచ్చుకొన్నాడు. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మర్చిపోలేదు.
పాఠకులు పై సంఘటనలో బాబా ఏమి చెప్పారో ఒక్కసారి గమనించండి. పంత్ తో అతని గురువునందే ఆశ్రయము నిలుపుమని చెప్పారు. అంతే గాని, నీ గురువును విడిచి నన్నే పూజించు, నన్నే ఆశ్రయించు అని ఏమయినా చెప్పారా? బాబా వారి వ్యక్తిత్త్వం ఎటువంటిదో గ్రహించుకోవాలి. అంతే గాని ఆయన గురించి పూర్తి అవగాహన లేకుండా విమర్శలు చేయకూడదు.
శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ –
29
మద్రాసు భజన సమాజము
1916 వ.సంవత్సరములో రామదాసి పంధాకు చెందిన మద్రాసు భజన సమాజమొకటి కాశీ యాత్రకు బయలుదేరింది. ఆ సమాజములోని యజమానురాలుకి బాబా మీద ఎంతగానో ప్రేమ గౌరవాలున్నాయి. ఒకనాడు మధ్యాహ్న ఆరతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవముయొక్క దృశ్యాన్ని ప్రసాదించారు. ఆమెకు బాబా శ్రీరామునివలె కనిపించారు.
కాని ఇతరులకు మాత్రము మామూలు సాయినాధునివలె కనిపించారు. తన ఇష్టదైవాన్ని చూడగానే ఆమె మనస్సు కరిగిపోయింది. కండ్లనుండి ఆనందభాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టింది. ఆమె ఆనందస్థితిని చూసి తక్కినవారందరూ ఆశ్చర్యపడ్డారు. కాని కారణం తెలుసుకోలేకపోయారు. జరిగినదంతా సాయంత్రం తన భర్తతో చెప్పింది. సాయిబాబాలో తాను శ్రీరాముని చూశానని చెప్పింది. ఆమె అమాయక భక్తురాలు అవటం వల్ల శ్రీరాముని చూడటం ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు. అదంతా వట్టి చాదస్తమని వెక్కిరించాడు. అందరూ సాయిబాబాను చూస్తే ఆమె శ్రీరాముని చూచుట అసంభవమన్నాడు. భర్త చేసిన ఆక్షేపణకు ఆమెకు కోపం రాలేదు. తన మనస్సు ప్రశాంతముగా ఉన్నపుడు, దురాశలు లేనపుడు అప్పుడప్పుడు ఆమెకు శ్రీరామదర్శనము లభించుచునే యుండెను.
ఈ పై సంఘటనలో ఆ సమాజములోని యజమానురాలికి శ్రీరాముని దర్శన భాగ్యం కలిగించారు. అంతకన్నా అదృష్టం ఏమయినా ఉంటుందా?
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)