11.12.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుబాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 8 వ.భాగము చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ 8 వ. భాగము
29.05.1993
నిన్నటి రోజున శ్రీ సాయి సత్ చరిత్ర 51 వ. అధ్యాయము నిత్యపారాయణ పూర్తి చేసినాను. 51 వ. అధ్యాయము చదవటము పూర్తి చేసిన ప్రతిసారి శ్రీ సాయి లీలను చూడగలుగుతున్నాను. కాని నిన్నటి రోజున ఎటువంటి అనుభూతి కాని, లీలను కాని పొందలేదు. నిద్రకు ముందు శ్రీ శిరిడీ సాయికి నమస్కరించి కనీసము మంచి అనుభూతిని కలలో ప్రసాదించమని వేడుకొన్నాను. రాత్రి కలలో "నేను కాకినాడకు రైలులో చేరుకొన్నాను. కాకినాడ టౌన్ స్టేషన్ వెయిటింగ్ రూం దగ్గర చాలా మంది ఒకవరసలో నిలబడి లోపలికి వెళ్ళి శ్రీ సత్యసాయి (పుట్టపర్తి బాబా) పాదాలకు నమస్క్రరించుతున్నారు. నేను నా సామానులు ఒక స్నేహితునికి అప్పగించి ఆ వెయిటింగ్ రూం లోనికి వెళ్ళినాను. ఆయనను చూడగానే కాకినాడలో 1964 వ సంవత్సరములో ఒకరాత్రి కలలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చినది. 1964 వ సంవత్సరములో నాకు సాయి గురించి తెలియని రోజులలో శ్రీ సత్యసాయిని దూషించినాను. నేను సత్య సాయిని దూషించిన రోజు రాత్రి కలలో శ్రీ సత్యసాయి నా భుజముమీద చేయి వేయగానే నాకు విద్యుత్ శక్తి షాక్ కొట్టినది. ఈసారి నేను ఆయన పాదాలను తాకితే ఏమి జరుగుతుంది అనే ఆలోచనలతో నిలబడిపోయినాను. ఆయన చిరునవ్వుతో పాదపూజ చేసుకోమని చెప్పినారు. నేను సంతోషముగ ఆయన పాదపూజ చేసుకొన్నాను. పూజ అనంతరము ఆయన కేసి చూసినాను. ఆ కుర్చీలో శ్రీ సత్యసాయి బదులు శ్రీ శిరిడీ సాయి ఉన్నారు. నాకు వెంటనే మెలుకువ వచ్చినది. నిన్నటిరోజున 51 వ. అధ్యాయము చదవటము పూర్తి చేసిన సందర్భములో శ్రీ శిరిడీ సాయి నాకు యిచ్చిన అనుభూతి, సందేశము "నేను అందరు యోగులలోను ఉన్నాను" అనేది నిర్ధారింపబడినది. ఈ అనుభూతి గురించి ఆలోచించుతుంటే శ్రి సాయి సత్ చరిత్ర 12 వ. అధ్యాయములో నాసిక్ నివాసియగు మూలేశాస్త్రికి, శ్రీ సాయి ఘోలప్ స్వామి రూపములో దర్శనము యిచ్చి, మూలేశాస్త్రి పాదపూజ చేసుకొన్న అనంతరము తిరిగి శ్రీ సాయిబాబా లాగ దర్శనము యివ్వటము గుర్తుకు వచ్చినది. 33 వ. అధ్యాయములో హరి బావూ కర్లిక్ నుండి శ్రీ సాయి ఒక రూపాయి దక్షిణను నాసిక్ లోని కాలా రాముని మందిరములో నరసిం హ మహరాజు అనే యోగి రూపములో స్వీకరించటము ఆలోచించితే యోగీశ్వరులందరు ఒకటేయని, ఏకాత్మత భావముతో కార్యములొనర్తురని భావించినాను. శ్రీ శిరిడీసాయి తన భక్తుల మనసులోని భావాలను గుర్తించి వారికి అదే రూపములో దర్శనము యిచ్చి తాను అన్ని రూపాలలోను యున్నాను అనే నమ్మకము కలిగించి వారిని తన మార్గములో నడిపించుతారు. 1964 మరియు 1993 లలో నా భావనలో శ్రీ సత్యసాయి ఉండటము చేత శ్రీ శిరిడీ సాయి అదే రూపములో నాకు దర్శనకు యిచ్చినారు.
01.06.1993 మంగళవారము
నిన్నటిరోజున నా కుటుంబ పరిస్థితిపై ఆలోచించి విసిగిపోయినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతిని ప్రసాదించమని కోరినాను. కలలో "శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి రెండు విషయాలు చెప్పినారు. మొదటిది కాకినాడలో నీ స్నేహితుడు శ్రీ కామేశ్వరరావు తన పిచ్చి భార్యతో సంసారములో బాధలు పడటము లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయా నీ సంసార బాధలు ఆలోచించు. రెండవది 1970 అక్టోబరు నెల 30 వ. తారీకున నీవు నూతనముగా నీ ఆఫీసు పనిలోనికి చేరడానికి ఆటొలో వస్తున్నపుడు ఆటొ ప్రమాదములో నీవంటి మీద ఒక్కదెబ్బకూడ తగలకుండ నిన్ను కాపాడుకొన్నది ఎందుకు? ఈ రోజున నీకు చావడానికి నేను అనుమతి ఇస్తానని ఎలాగ తలచినావు. నా చరిత్ర అన్ని సార్లు చదివినావే ఆత్మ హత్యపాపము అని నీవు యింకా తెలుసుకోలేదా" . నాకు మెలుకువ వచ్చినది. శ్రీ సాయి కలలో చెప్పిన రెండు విషయాలు వ్యతిరేకించలేని నిజాలు. కాకినాడలో నా స్నేహితుడు తన పిచ్చి భార్యతో చాలా మానసిక బాధలు పడుతున్నాడు. నాపరిస్థితి అతని పరిస్థితికంటే చాలా మెరుగు. యింక రెండవ విషయము 30.10.1970 నాడు మధ్యాహ్న్నము ఎన్.ఎఫ్.సీ. లో డ్యూటీకి జాయిన్ అవటానికి సికంద్రాబాద్ నుండి ఆటోలో బయలుదేరినాను. ఆ ఆటో మౌలాలి దగ్గర ఆర్. ఎఫ్. సీ. దగ్గర ఎలక్ట్రిక్ స్థంభానికి గుద్దుకొని తలక్రిందులయినది. ఆటో డ్రైవరుకు గాయాలు తగిలినాయి. నాకు ఒక్క దెబ్బకూడ తగలలేదు. మరి దీనిని బట్టి ఆలోచించితే 1970 లో నేను శ్రిరిడీ సాయి భక్తుడిని కాకపోయినా శ్రీ శిరిడీ సాయి నన్ను ఆ ఆటో ప్రమాదమునుండి రక్షించినారు అని నమ్ముతాను.
10.06.1993 గురువారము
నిన్న సాయత్రము నా భార్య పిల్లలతో గొడవ పడినాను. వారికి నేను సంపాదించిన ధనము కావాలి. అంతేగాని నా ప్రశాంత జీవనానికి సహకారము మాత్రము యివ్వరు. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నేను సంపాదించిన ధనము, కట్టిన యిల్లు, నా భార్య పిల్లలకు యివ్వటానికి సిధ్ధముగా ఉన్నాను. నేను సన్యాసము స్వీకరించ దలచినాను. నాకు అనుమతిని ప్రసాదించు తండ్రీ అని వేడుకొని రాత్రి 9.30 గంటలకు నిద్రపోయినాను. రాత్రి 10.30 గంటల సమయములో ఉండగా నా మంచము ప్రక్కన ఉన్న టెలిఫోన్ మ్రోగినది. తెలివి తెచ్చుకొని ఫోన్ ఎత్తినాను. పూనా నుండి నా తల్లి నాయోగ క్షేమాలు తెలుసుకోవాలనే ఆతృతతో ఫోన్ చేసినది. ఆమె ఫోన్ లో మాట్లాడుతుంటే సాక్షాత్తూ శ్రీ సాయినాధుడు నాతో మాట్లాడుతూ నా యోగక్షేమాలు తెలుసుకొంటు నామనసుకు ప్రశాంతత కలిగించిన అనుభూతిని పొందినాను. నా తల్లి మాట్లాడిన తర్వాత నా చెల్లెలు నా యోగక్షేమాలు అడుగుతూ మాట్లాడినది. సంతోషముతో శ్రీ సాయికి నమస్కరించి శ్రీ సాయి సత్చరిత్రలో నిత్య పారాయణగా 13 వ. అధ్యాయము చదివినాను. మొదటి పేరాలో శ్రీ సాయి అన్న మాటలు "నేను ఫకీరుని అయినప్పటికి, యిల్లు గాని భార్య గాని లేనప్పటికీ, ఏచీకూ చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకోలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లపుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగువారినే చికాకు పరుచునపుడు నావంటి ఫకీరనగ దానికెంత?" ఈ మాటలు చదువుతుంటే శ్రీ సాయి నన్ను సన్యాస ఆశ్రమము స్వీకరించవద్దు అనే సందేశము యిచ్చినారు అని భావించాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు