24.09.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 20
సాయి బంధువులారా! మన బ్లాగులో ప్రచురణకు ఈ రోజు సమయం కుదిరింది..ఈ రోజు మీకందించబోయే సాయితో మధురక్షణాలలో ఈ బాబా లీల చదవండి..ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోక, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోకం
శ్లోకం: కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః |
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ||
పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళపుష్పములుగా ముఖ్యముగా మల్లెపువ్వుగా ధ్యానము చేయుము. ఆయన వర్షమున కధిపతియై జీవులకు సౌఖ్యము కలిగించుచున్నాడు. వాయువునందలి వీచు శక్తిగా అన్నిటిని పరిశుధ్ధము చేయుచున్నాడు. అమృతమయములకు చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము. ఆయన అన్నియూ తెలిసినవాడు. మరియూ అన్నిటియందు సామర్ధ్యము కలవాడు.
ఆకలితో ఉన్న తన భక్తులకోసం బాబా వేచిఉండుట.
అది 1962వ.సంవత్సరం. శ్రీవాడ్రేవు రామమూర్తిగారు తన స్నేహితులతో కలసి జమానపల్లినుండి షిరిడీ వెళ్ళారు. అక్కడ వారు ప్రతీరోజూ షిరిడీ సాయిబాబా క్యాంటీన్ లో భోజనం చేస్తూ ఉండేవారు. క్యాంటీన్ యజమాని రోజూ రాత్రి 9 గంటలకల్లా క్యాంటీన్ మూసివేసి తాళాలు వేసుకొని యింటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక రోజున వారంతా క్యాంటీన్ యజమానితో, తామందరూ సాకోరీ (షిరిడీనుండి 5 మైళ్ల దూరంలో ఉంది. అక్కడ బాపూసాహెబ్ జోగ్ సమాధిని, శ్రీఉపాసనీగారి ఆశ్రమం దర్శించుకోవడానికి) వెడుతున్నామని తాము వచ్చేటప్పటికి క్యాంటీన్ మూసివేయకుండా వేచి చూడమని చెప్పారు.