02.09.2014 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు గారు శ్రీసాయి సత్ చరిత్రపై అందించిన పరిశోధన వ్యాసాలను మీకు అందిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో ఈ రోజునుండీ కలలలో శ్రీసాయి పై ఆయన చేసిన పరిశోధనా వ్యాస సంపుటిని మీకందిస్తున్నాను.
ప్రతివారికీ కలలు వస్తాయి. కొన్ని కలలకు అర్ధం ఉంటుంది. కలలో వచ్చిన కొన్ని సంఘటనలు మన దైనందిన జీవితాలలో జరిగే సంఘటనలకి కొంతలో కొంత సారూప్యం గాను, కొన్ని కలలు నిజజీవితంలో ఉన్నదున్నట్లుగా ప్రతిబింబించేవాటిగాను ఉంటాయి. ఒక్కొక్కసారి అర్ధం పర్ధం లేని కలలుకూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు అనుభవమే. శ్రీసాయి సత్ చరిత్రలో కూడా మనకు కలల గురంచి ప్రస్తావన కూడా ఉంది. సాయి.బా.ని.స. గారి వ్యాసాలను చదువుతూ సాయి భక్తులందరూ కూడా మరొకసారి శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేయండి. సాయి.బా.ని.స. గారు ఎంతగా పరిశోధన చేసి మనకందించారో మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసాలలోని కొన్ని సంఘటనలు ఇంతకు ముందు మీరు చదివే ఉంటారు. ఈ వ్యాసాలు కలల గురించి కనుక మరలా వాటి ప్రస్తావన కూడా మీకు ఇందులో కనపడుతుంది. ఇక ఈ వ్యాసాలను ఆస్వాదించండి.
(సాయిభక్తులెవరికయినా కలల ద్వారాగాని, మరేవిధంగానయినా గాని బాబా వారు ఇచ్చిన సందేశాలను, కలల వృత్తాంతాలను పంపిస్తే వాటిని కూడా ప్రచురిస్తాను. సాయి భక్తులయిన పాఠకులందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి)
కలలలో శ్రీసాయి - 1వ.భాగం
ఆంగ్లమూలం : సాయి.బా.ని.స. రావాడ గోపాలరావు
తెలుగుఅనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
ఓం శ్రీ గణేశాయనమః, ఓం శ్రీసరస్వత్యైనమః,ఓం శ్రీసమర్ధ సద్గురు శ్రీసాయినాధాయనమః
నేను యిప్పుడు మీకు చెప్పబోయే విషయం కలలలో సాయి. ఈ రోజు నా ఉపన్యాసం ప్రారంభించే ముందు మీకందరికీ నాప్రణామములు. శ్రీసాయి సత్ చరిత్ర నిత్యం పారాయణ చేసేవారికి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జీవితంలో జరుగుతున్న సంఘటనలే కలలలో ప్రతిబింబిస్తాయయని చాలామంది చెబుతారు. కాని సాయి భక్తుల విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాయి తన భక్తుల భవిష్యత్తుని కూడా వారి కలల ద్వారా వారికి తెలియపరుస్తూ ఉంటారు.