18.03.2012 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 11 వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (11)
13.04.1995
శ్రీ సాయి నిన్నరాత్రి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము.
"నీవు ఎవరికైన సహాయము చేయదలచినపుడు వాళ్ళ యోగ్యతను గుర్తించి వారికి సహాయము చేయి. లేదపోతే లేనిపోని తలనొప్పిని కొనితెచ్చుకొంటావు. నీవు నీయిల్లు ఎవరికైన తలదాచుకుందుకు యిస్తే వాళ్ళు నీయింటిని పీకివేసి - నీవు నీయింట తలదాచుకోలేని పరిస్తితిని కలిగించుతారు - జాగ్రత్త."
14.04.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి జీవితములో అరిషడ్ వర్గాలను జయించే మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో ఒక స్కూల్ మాస్టర్ రూపములో దర్శనము యిచ్చి రోజుకు ఒక విషయము గురించి చెబుతాను అని చెప్పి మొదట "కామము" (కోరికలు) జయించే మార్గము గురించి వివరించినారు. వాటి వివరాలు.
1) "జీవితము ఒక అరటిచెట్టువంటిది. కోరికలు అరటిపిలకలు వంటివి. మనము అరటిపిలకలను పీకివేయకపోతే అసలు చెట్టు సరిగా ఎదగదు.
మరియు చెట్టుమనుగడ ఒక సమస్యగా మారుతుంది. అందుచేత కామము (కోరికలు) ను జయించి మనము మన జీవిత లక్ష్యాన్ని సాధించాలి."
15.05.1995
శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక డాక్టర్ రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు.
"నీకు వైద్యుడిమీద కోపము యుండవచ్చును. ఆకోపముతో వైద్యుడు యిచ్చిన ఔషధములను సేవించకుండ బయట మురికి కాలవలో పారవేసిన నష్ఠము ఎవరికి. జీవితములో క్రోధము సుఖశాంతులను దూరము చేస్తుంది. అందుచేత క్రోధమును మనజీవితమునుండి దూరము చేయాలి."
16.05.1995
శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక లోభిని చూపించినారు. ఆలోభి చేష్టలు కలలో కూడా నవ్వు పుట్టించినది. ఆలోభి చేసిన చేష్టలు చూసిన తర్వత జీవితమునుండి లోభత్వమును విడనాడాలి అని నిశ్చయించుకొన్నాను. ఆలోభి చేసిన చేష్టల వివరాలు.
"ఒకవ్యక్తి తనకుమార్తె వివాహ సందర్చములో బజారుకు వెళ్ళి పెళ్ళిబట్టలు బేరము చేయసాగినాడు. ఆదుకాణమువాడు పెండ్లి సందర్భములో పెండ్లి కుమార్తె ధరించే మధుపర్కము (పసుపురంగు నేత చీర) మాత్రమే చవకగా లభించుతుంది అనగానే ఆవ్యక్తి లోభత్వముతో మగపెళ్ళివారి తరఫున ఆడవారికి, ఆడపెళ్ళివారి తరఫున ఆడవారికి కూడా మధుపర్కాలు కొని అందరిచేత మధుపర్కాలు ధరింపచేసినాడు. ఆసమయములో పెండ్లికి వచ్చినవారు ఈవింత సంఘటనను చూసి కడుపు ఉబ్బేలాగ నవ్వసాగినారు." నేనుకూడా ఆవివాహములో యుండటము చేత నవ్వసాగినాను. నిద్రనుండి మేల్కొనినాను.
17.04.1995
శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక సన్యాసిరూపములో
దర్శనము యిచ్చి జీవితములో మోహము వలన కలిగే అనర్ధాలను చూపించినారు. ఆయన చూపిన దృశ్యాల వివరాలు. 1) నీవు ఉద్యోగరీత్యా నెలజీతము పొందటము ధర్మ సమ్మతము, అంతే గాని ధనము మీద మోహముతో ఉద్యోగములో అడ్డదార్లు త్రొక్కి జీవించటము మంచిది కాదు.
2) జీవితములో వివాహము చేసుకొని భార్యతో కాపురము చేయటము ధర్మ సమ్మతము
అంతేగని పరస్త్రీలపై మోహముతో జీవించటము మంచిది కాదు.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు