05.09.2015 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 6
ఆంగ్లమూలం : ఆర్థర్ ఆస్ బోర్న్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
(నిన్నటి సంచిక తరువాయి)
ఇటువంటి సందర్భంలో భక్తులకు తిరుగు లేని నమ్మకం ఉండవలసిఉండేది. శ్రీ హెచ్.వి. సాఠే గారి అనుభవాలను ఒకసారి పరిశీలిద్దాము. శ్రీ సాఠేగారు రెవెన్యూ కమీషనరు దగ్గిర ఉద్యోగస్థులు. శ్రీ సాఠేగారు తన కుటుంబసభ్యులతో షిరిడీలో ఉండగా అత్యవసర పనిమీద రెవెన్యూ కమీషనర్ ను మరియు జిల్లా కలెక్టరును మన్ మాడులో కలవవవలసిన పని బడింది. శ్రీ సాఠే తను షిరిడీని వదలి వెళ్ళటానికి శ్రీసాయి బాబాను అనుమతి అడగవలసినదని తన కుటుంబ సభ్యులతో పెద్దవారయిన తన మామగార్ని శ్రీసాయి వద్దకు పంపించారు. శ్రీసాయి అనుమతిని నిరాకరించారు. శ్రీసాఠే చికాకుతో తన ఉద్యోగము పోవచ్చుననే భయాన్ని తన మామగారి వద్ద తెలియపర్చి, తిరిగి శ్రీసాయిబాబా అనుమతిని స్వీకరించమని తన మామగార్ని శ్రీసాయిబాబా దగ్గరకు పంపించారు. ఈసారి శ్రీసాయి, శ్రీసాఠేను గదిలో ఉంచి తాళము వేయమని, షిరిడీ వదలివెళ్ళకుండ చూడమని శ్రీసాఠే మామగారితో చెప్పారు.