27.08.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
16 రోజుల తరువాత మరలా మన బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది..హైదరాబాదు ప్రయాణాలవల్ల, కొన్ని వ్యక్తిగత పనులవల్ల, ఆలశ్యం జరిగింది..ఈ ఆలశ్యానికి బాబావారిని మన్నించమని వేడుకొంటు ఈ రోజు సాయితో మధురక్షణాలలోని ఒక మధురక్షణాన్ని మీకందిస్తున్నాను. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 83వ.శ్లోక, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం 83వ.శ్లోకం:
శ్లోకం: సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ||
తాత్పర్యం: పరమాత్మను తిరిగి వచ్చుచున్న మరియూ తిరిగిరాని ఆత్మలతో కూడిన సృష్టి చక్రముగా, ధ్యానము చేయుము ఆయనను జయించుట, ఆయన ధర్మము నతిక్రమించుట మరియూ ఆయనను పొందుట మిక్కిలి కష్టము. ఆయనను సమీపించుట దుష్కరము. మాయతో కూడిన నివాసమే ఆయనది. ఆయన భక్తులకు కోటవంటివాడు. దుష్టులను జయంచి సం హరించువాడు.
సాయితో మధురక్షణాలు - 16
(ఈ కలియుగంలో బాబా శక్తి అంతుతెలియనిది)
ఈ కలియుగంలో బాబా శక్తి అంతుతెలియనిది
మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడానికి వీలుకానంతగా క్లిష్టమయినది. అటువంటిది బాబాయొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడమంటే అది అత్యంత క్లిష్టమయినది. భయంకరమయిన పర్షియా ఎడారులలో గులాబీల పరిమళాన్ని ఎవరు పరిశీలించగలరు..చేతికందే దూరంలోనే ఉండి, ఉన్నట్లుండి దూరమయిపోయే ఎడారులలోని ఒయాసిస్సుల అందాన్నెవరు వర్ణించగలరు? అదేవిధంగా బాబా విషయంలో కూడా.