25.12.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 17 వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1993
06.10.1993 నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి ఈ ప్రాపంచిక విషయాలలో (లంచాలు తీసుకోవటము) తగులుకోకుండ యుండే మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపించిన దృశ్యము నా కళ్ళు తెరిపించినది. అది మోండా మార్కెట్. అక్కడ చక్కని పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు గంపలలో యున్నాయి.
ఆ గంపల ప్రక్కన ఎత్తైన గోడ యుంది. ఆ గోడమీద ఒక మేక నిలబడి యుంది. ఆ గోడమీద నుండి చూస్తున్న ఆ మేకకు ఆ పండ్లు, ఆకు కూరలు తినాలని అనిపించి గోడమీద నుండి దూకాలా వద్దా అనే ఆలోచనలో పడినది. అంత ఎత్తు నుండి దూకితే ఆమేక కాళ్ళు విరగడము ఖాయము. అందుచేత ఆ మేక దూకటము ప్రయత్నము మాని గోడ వెనుక భాగాన ఉన్న మెట్లు దిగి వెళ్ళిపోయినది. ఈ దృశ్యము తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి అంటారు మనిషి కోరికలు మేక వంటిది. లంచాలు అనేది మనకు అందని ఫలాలు - అటువంటి ఫలాలును ఆశించితే మనకాళ్ళు చేతులు విరగడము ఖాయము. లంచాలను ఆశించరాదు.
08.10.1993
నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి ఆయన వయస్సు తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి నా చేతికి మూడు దృశ్యాల ఫొటో (3 డీ) యిచ్చి వెళ్ళిపోయినారు. ఆ ఫొటోను ఒక ప్రక్కనుండి చూస్తే ఉగ్రనరసిం హమూర్తిగాను (నరుడు + సిం హము)
ముందునుండి చూస్తే భారతములోని భీష్మ పితామహుడుగాను, యింకొక ప్రక్కన నుండి చూస్తే సినీనటుడు బాల కృష్ణగాను కనిపించినారు. ఆ ఫొటో చూసిన తర్వాత శ్రీ సాయి వయస్సు లక్షలు సంవత్సరాలు యుంటుంది అని నమ్మినాను.
11.10.1993
నిన్నటిరోజున మనసు చాలా చికాకుగా ఉండి శ్రీ సాయికి నమస్కరించి 16.10.1993 నాడు నా యింట జరగబోయే శుభకార్యము చేయగలనా లేదా లేకపోతే మాని వేయటము మంచిదా తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము చాలా ధైర్యాన్ని కలిగించినది. అది సర్కసుకంపెనీ. నేను ఆ కంపెనీలో ఉయ్యాలమీద ఫీట్స్ చేసే పనిలో చేరినాను. ప్రేక్షకులు అందరు వచ్చినారు.
ఆట ప్రారంభము అయినది. గంట మ్రోగినది. నేను త్రాడు, నిచ్చెన ఎక్కి ఉయ్యాల మీద కూర్చున్నాను. క్రిందకు చూసినాను. సాధారణముగా యుండవలసిన వల ఆరోజున లేదు. ఉయ్యాల మీద ఫీట్స్ చేస్తూ క్రిందపడితే చావడము ఖాయము. ఒళ్ళు అంతా చమటలు పట్టివేసినది. ఉయ్యాలనుండి దిగిపోవాలని అనిపించినది. కాని క్రిందనుండి సర్కసు మేనేజరు దిగటానికి వీలులేదు. నీవు ఉయ్యాల ఊగవలసినదే అన్నారు. ఫీట్స్ చేస్తున్నపుడు పడితే రక్షించే వల లేదు. నేను ఫీట్స్ చేయలేను అన్నాను. "భయపడకు - నీవు క్రింద పడకుండ నేను నిన్ను పట్టుకొంటాను. ధైర్యముగా ఉయ్యాల మీద ఫీట్స్ చేయి" అని ధైర్యము చెప్పి నాచేత ఉయ్యాల మీద ఫీట్స్ చేయించినారు. ఆమానేజరు (శ్రీ సాయి). ఈ విధముగా 16.10.1993 నాడు జరిగే శుభకార్యానికి ధైర్యము చెప్పినారు శ్రీ సాయి.
14.10.1993
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ 16.10.1993 నాడు నా యింట జరగబోయే శుభకార్యము (బారసాల) వచ్చి నా మనవడిని ఆశీర్వదించి, భోజనము చేసి వెళ్ళమని కోరినాను. కలలో శ్రీ సాయి నా పినతల్లి భర్త శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గారి రూపములో నా యింటికి వచ్చినారు. నేను ఆయనను భోజనము చేయమని కోరినాను. ఆయన సంతోషముగా అంగీకరించినారు. యింతలో ఆయన తమ్ముడు శ్రీ నరసిం హమూర్తి చనిపోయినట్లుగా వార్త వచ్చినది. నేను ఆయనను వెంటనే కాకినాడ వెళ్ళమని చెప్పినాను. ఆయన అలాగ కాదు "నేను నీయింట భోజనము చేసి వెళతాను. నేను మాట తప్పను" అన్నారు. ఉదయము తెలివి వచ్చినది. శ్రీ సాయి, సోమయాజులుగారి రూపములో నాయింటికి భోజనానికి రాలేరు. ఆయన 1992 లో స్వర్గస్తులైనారు. శ్రీ నరసిం హమూర్తిగారు 1989 లో స్వర్గస్తులైనారు. మరి శ్రీ సాయి తన మాటను ఏవిధముగా నిలబెట్టుకొంటారు వేచి చూడాలి.
(ఇంకా ఉంది) మరలా గురువారము
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు