02.10.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులారా! మనం అప్పుడప్పుడు బాబావారి అంకిత భక్తుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు కపర్డే గారి గురించి ప్రచురిస్తున్నాను. కపర్డేగారి గురించిన సమాచారమంతా శ్రీబొండాడ జనార్ధనరావుగారి బ్లాగునుండి సేకరింపబడింది.
బాబా భక్తులు
శ్రీ జీ.ఎస్.కపర్డే - 1
(తనకు ఎంతో ఆదాయాన్ని సముపార్జించి పెట్టే న్యాయవాద వృత్తిని, రాజకీయ జీవితాన్ని పదలిపెట్టి, ఒక పిచ్చి ఫకీరయిన బాబా సాంగత్యం తప్ప మరేదీ అవసరం కపర్డేకు లేదనే భావనను ఆనాటి బ్రిటీష్ పాలకులలో కలిగించారు బాబా. బ్రిటీష్ వారిలో ఆభావం కలిగినందువల్లే కపర్డే బ్రిటిష్ ప్రభుత్వం విధించబోయే శిక్ష నుండి తప్పించుకున్నారు. కపర్డే 46 డైరీలు వ్రాశారు. ఈ డైరీలలో కపర్డే బాబాతో తాను ఉన్నపుడు జరిగిన సంఘటనలని తేదీలవారిగా వ్రాశారు. డైరీల ద్వారా మనకు లభించిన సంఘటనలు మొదటగా దీక్షిత్ ద్వారా లభిస్తే, రెండవది కపర్డే గారి ద్వారా మనకి లభ్యమయాయి.)
గణేష్ శ్రీకృష్ణ కపర్డే బెరార్ జిల్లాలోని ఇంగ్రోలీ గ్రామంలో ఆగస్టు, 27, 1854 లో జన్మించారు. ఆరోజు వినాయక చతుర్ధి. అందుచేతనే ఆయన పేరులో గణేష్ అని కూడా చేర్చారు వారి తల్లిడండ్రులు. ఆయన తండ్రి శ్రీకృష్ణ నార్ధర్. చిన్నతనం నుండీ బీదరికాన్ని అనుభవించినా, కష్టపడి మామలతదారు స్థాయికి ఎదిగారు.